20, జులై 2020, సోమవారం

వినాయక స్తోత్రం అర్ధం

ప్రసిద్ధమైన వినాయక స్తోత్రం అర్థాన్ని గురించి తెలుసుకుందాం. 

*అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే*

ఈ శ్లోకంలో అనేక దంతము ఏకదంతమును ఏమిటి అన్న అనుమానం చాలామందికి సహజంగా కలుగుతుంది. 

ఇది అనేకదంతం కాదు. 
*"అనేకదం   తం"* అని వేర్వేరుగా చదువుకోవాలి. 

ఇక్కడ దం అనగా ఇచ్చువాడు అని అర్థం. (అనేకం అంటే  వివిధమైన లేక పెక్కు అని అర్థం).

అనేకదం తం భక్తానాం అన్న వాక్యానికి భక్తులకు అనేకములు ఇచ్చు వాడవైన నిన్ను అని అర్థం. 

ఏకదంతం అన్న మాటకు ఒకే దంతం కలిగిన వాడు అని అర్థం. ఉపాస్మహే అనగా పూజించెదము అని అర్థం. ఆగము అంటే కదలిక లేనిది అనగా పర్వతము అని అర్థం. జ అంటే పుత్రిక అని అర్థం కనుక అగజ అంటే హిమాలయ పర్వత పుత్రిక పార్వతి అని అర్థం. 

ఆనన పద్మము అంటే ముఖ పద్మము అని అర్థం చెప్పుకోవాలి. సూర్యుడు పద్మములను వికసింప చేస్తాడు అని సంప్రదాయం. 

కనుక ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని చూసినట్లయితే 

*పర్వత పుత్రిక అయిన పార్వతి దేవి కన్నులు అనెడు పద్మములను వికసింప చేసే  సూర్యుడు వంటి నిన్ను , ఎల్లవేళలా గజ ముఖముతో ఉండే నిన్ను, భక్తులకు అనేకమైన వానిని అనుగ్రహించు వాడవైన నిన్ను, ఏకదంతుడవు అయిన నిన్ను ఉపాసిస్తున్నాను.* 

అని ఈ శ్లోకం యొక్క అర్థం

కామెంట్‌లు లేవు: