11, నవంబర్ 2020, బుధవారం

&మహాభారతము

 **దశిక రాము**


*&మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


126 - ఉద్యోగపర్వం.


సైన్య సమీకరణలో భాగంగా, నకులసహదేవుల మేనమామ, మాద్రి సోదరుడైన మద్రదేశాధీశుడు శల్యునికికూడా దూతద్వారా వర్తమానం పంపాడు, ధర్మరాజు.  


స్వయంగా మేనల్లుళ్లు వచ్చి మాటమాత్రం చెప్పలేదని మనసులో ఒకింత బాధపడినా, చనిపోయిన తనసోదరి మాద్రిమీదవున్న ప్రేమతో, వెంటనే తనబలగాలతో బయలుదేరి, మధ్య మధ్యలో సరోవరాలమధ్య సేద తీరుతూ, స్వతహాగా విలాసపురుషుడైన శల్యుడు, నిదానంగా ఉపప్లావ్యం వైపు ప్రయాణిస్తున్నాడు.   


ఈవార్త తెలిసిన దుర్యోధనుడు, ఆయనకు, ఆయన పరివారానికి, అత్యద్భుతమైన, సుందరమైన విడిది ఏర్పాటు చేసి, స్వాగత ద్వారాలు అమర్చి, మేలిరకమైన మదిరతో, అందమైన నాట్య గత్తెలతో నింపివేసి, అక్కడనుండి కదలబుద్ధి కాకుండా చేసాడు శల్యునికి. ఇంద్ర సుఖాలు అనుభవిస్తూ శల్యుడు కొద్దికాలం అక్కడే వుండిపోయాడు. ఆ ఏర్పాట్లన్నీ తనకోసం ధర్మరాజే చేసాడని అనుకున్నాడు. 


అయితే, పరిచారకుల ద్వారా , తమను యీవిధంగా సంతోషపెడుతున్నది, దుర్యోధన మహారాజని తెలుసున్నాడు, కొద్ది కాలానికి. అది తెలిసి, తాను వైరివర్గం లోనికి వెళ్తున్నా, యెంతో వుదారంగా తనకు యీ సౌకర్యాలు అమర్చిన దుర్యోధనునిపై, ప్రేమ పొంగిపొర్లింది శల్యునికి . శల్యుని, నీడలా వెంటాడుతూ, తగిన సమయం కోసం నిరీక్షిస్తున్న దుర్యోధనుడు వెంటనే అక్కడ శల్యుని ముందు కనబడి, ' మామా ! కుశలమా, తమను చూడాలనిపించి వచ్చాను.' అని వంగి నమస్కరించి నిలబడ్డాడు. శల్యుడు కూడా పరమ సంతోషంతో, ' దుర్యోధనా ! నీ మంచిబుద్ధికి సంతోషించాను. యేమి కావాలో కోరుకో ! ' అన్నాడు, కౌగిలించుకుంటూ.


' మామా ! మీఅంతట మీరే అడిగారు. ఏమికావలో కోరుకొమ్మని. మీరు నా సైన్యానికి నాయకత్వం వహించాలి. కాదనరు కదా ! ' అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు శల్యునకు తెలిసివచ్చింది, తాను చేసిన తప్పేమిటో ! కాదనలేక ' సరే ' అన్నాడు. తన తొందరపాటు చర్య వలన, తన మేనల్లుళ్ళకు గాక, వారి శత్రువులకు సేనాధిపతిగా వుండే పరిస్థితి తెచ్చుకున్నాడు, శల్యుడు. 


అనుకున్న ప్రకారం, శల్యుడు, ధర్మరాజును కలిసాడు, ఉపప్లావ్యం లో. వారి సాదర సత్కారాలు అందుకున్నాడు. వారికీ హితోక్తులు పలికాడు. మేనల్లుళ్ళను దగ్గరకు తీసుకుని శుభం పలికాడు. తరువాత, నిదానంగా, జరిగిన విషయం చెప్పాడు. దుర్యోధనుడు చేసిన మాయోపాయం వలన వారికీ మాట యిచ్చిన సంగతి చెప్పాడు. అదివిని ధర్మరాజు నొచ్చుకున్నాడు. తాను నకుల సహదేవులలో యెవరినైనా పంపి, మామను దగ్గర వుండి తీసుకువస్తే, యీపరిష్టితి వచ్చేది కాదుకదా అనుకున్నాడు.  


త్వరత్వరగా అలోచించి దుర్యోధనుడు, శల్యుని విషయంలో లాభంపొందాడు. తాత్సారం చేసి ధర్మరాజు శల్యుని పోగొట్టు కున్నాడు. అయితే, ' మామా ! నీ మంచితనంతో దుర్యోధనుని అనుగ్రహించావు. కానీ, నీవు యుద్ధభూమిలో మాకు ఒక సహాయం చెయ్యాలి. అది చెయ్యకూడనిది అయినా, ధర్మ రక్షణార్థం అడుగుతున్నాను. కర్ణుడు యుద్ధంలో అర్జునునితో పోరు సలుపుతున్నప్పుడు, నీవు కర్ణునికి రధసారధ్యం చేసి, తనని నిరుత్సాహపరుస్తూ, అర్జునుని విజయానికి దోహదం చెయ్యాలి. ' అన్నాడు ధర్మరాజు.  


' ధర్మరాజా ! తప్పక నీకు ఆ సాయం చేస్తాను. నిండుసభలో ద్రౌపదికి అవమానం జరగడానికి కారణం, ఆ కర్ణుడే అని నాకూతెలుసు. ఆసమయంలో మీరు అనుభవించిన దుఃఖము. లోకమంతా తెలుసు. నీవు కూడా ఇంద్రుడు వృత్రాసురుని సంహరించినట్లు, నహుషుని పీచమడిచినట్లు, దుర్యోధనాదులను సంహరించి, నీ రాజ్యం తిరిగి పొందుతావని, ' ఇంద్ర విజయం ' అనే గాధను చెప్పి, వారిని ఆశీర్వదించి, శల్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు, దుర్యోధనుని చేరడానికి.


ఆ విధంగా కురు పాండవులకు జరుగబోయే యుద్ధంలో తమవంతు పాత్ర నిర్వహించ డానికి, వివిధరాజ్యాల రాజులు, వారిసేనలను వెంటబెట్టుకుని యేదో ఒకవర్గంలో చేరి పోతున్నారు. సాత్యకి ఒక అక్షౌహిణి సైన్యంతో, మహా సముద్రం లాంటి ధర్మరాజు సైన్యంలో ఒకనదిలా వచ్చి చేరాడు. అలాగే, చేది, మగధ దేశాధీశులు, ఒక్కొక్క అక్షౌహిణితో వచ్చి చేరారు, ధర్మరాజు సైన్యంలో.  


సాగరంలోని ద్వీపాలకు ఆధీసుడైన పాండ్యరాజు, మత్స్య దేశాధీశుడు, కొండజాతి వీరులు, వారి వారి అనువైన ఆయుధాలతో వచ్చి ధర్మరాజు సేనలో కలిశారు. ఆ విధంగా ధర్మరాజుసేన ఏడు అక్షౌహిణుల సైన్యంగా యేర్పడి, ఉపప్లావ్యంలో, యుద్ధానికి సిద్ధంగా వున్నది.  


ఆ ప్రక్క, కౌరవసేనలో, భగదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు తలా ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చి చేరారు. కృతవర్మ, జయధ్రదుడు, కాంభోజరాజు సుదక్షిణుడు, అవంతీ పురాధీశులు, విందానువిందులు, మాహిష్మతి నుండి నీలుడు, కేకయరాజులు వచ్చి వారిసైన్యంతో దుర్యోధనుని చేరారు. ఆ విధంగా పదకొండు అక్షౌహిణుల సేన కౌరవుల పక్షాన కొమ్ముకాస్తున్నది.


ఇలాంటి సమయంలో, సంధి నిమిత్తమై, ద్రుపద రాజ్య వృద్ధ పురోహితుడు హస్తినకు వేంచేశాడు. ఆయనకు ఉచితమర్యాదలు చేసి, కౌరవసభలో ప్రసంగించమన్నారు. ద్రుపద పురోహితుడు గంభీరంగా, ధృతరాష్ట్ర, పాండురాజుల రాజ్యాధికారం ప్రస్తావిస్తూ, దుర్యోధనుడు పాండవులను మాయాద్యూతంలో ఓడించడమూ, ద్రౌపది అవమానింప బడడమూ, అరణ్య అజ్ఞాతవాసాలలో వారు పడిన బాధలూ, అన్నింటి గురించీ సవిస్తరంగా చెప్పి, ' వారిని అన్నిబాధలు పెట్టినా, పాండవులు అవన్నీ మర్చిపోయి, జననష్టం కలుగకుండా, యేవిధమైన రక్తపాతం లేకుండా తమ రాజ్యం తమకు యివ్వమని కోరుతున్నారు. ' 


' ఇప్పటికే, పాండవుల హితంకోరే రాజన్యులు, ఉపప్లావ్యంలో పాండవులను చేరి వున్నారు. పోరుకు బయలుదేరడానికి, ధర్మజుని ఆజ్ఞకై నిరీక్షిస్తున్నారు. అందరినీ మించి అర్జునుడు వారితో వున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. వారి సేన, అర్జునుని ప్రతాపం, శ్రీకృష్ణుని రాజనీతి బేరీజు వేసుకుని, ధర్మ మార్గాన అలోచించి, మంచి నిర్ణయం తీసుకోవలసిందిగా ఉభయులకూ శ్రేయస్కరమైన నా కోరిక. ' అని ముగించాడు ద్రుపద పురోహితుడు. 


ఆ పురోహితుని మాటలను సావధానంగా సభికులందరూ విన్నారు. ముందుగా భీష్మ పితామహుడు లేచి నిలబడ్డాడు, అయన అభిప్రాయం చెప్పడానికి.  


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: