11, నవంబర్ 2020, బుధవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -20


ప్రాచీనబర్హి యఙ్ఞములు


విజితాశ్వుడు పరలోకగతుడైన తర్వాత అతని కొడుకైన హవిర్ధానుడికి హవిర్ధాని అనే భార్య వల్ల బర్హిష్మదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే ఆరుగురు పుత్రులు కలిగారు. అందులో బర్హిష్మదు డనేవాడు….నిత్య యజ్ఞదీక్షతో భూమండలమంతా యజ్ఞశాలలతో నింపాడు. సమస్త భూమిని యజ్ఞవాటం చేసాడు. ప్రాచీనాగ్రాలై (తూర్పు దిక్కుకు కొనలు గల) దర్భలను భూమండలమంతా పరిచి ‘ప్రాచీనబర్హి’ అనే పేరు పొందాడు. అతని ధర్మకార్యాలకు జనులంతా మెచ్చుకొని అతణ్ణి యోగ సమాధి నిష్ఠుడని, ప్రజాపతి అని వేనోళ్ళ సంస్తుతించి సంతోషించారు. ఇంకా అతడు…సముద్రుని కూతురైన శరధృతి అనే అమ్మాయిని వివాహమాడాడు. శరీరమంతా నగలతో చక్కగా అలంకరించుకొని పెండ్లినాడు ప్రదక్షిణం చేస్తున్న శతధృతిని చూచి పూర్వం అగ్నిదేవుడు శుకిని మోహించినట్లే ప్రాచీనబర్హి విమోహితుడైనాడు. సుర్యకాంతి వలె మెరిసిపోతూ కాళ్ళయందలి బంగారు అందెలు ఘల్లుఘల్లుమని మనోహరంగా మ్రోగుతుండగా తిరుగుతున్న నవయౌవనవతియైన శతధృతి సౌందర్య వైభవం దేవతలు, కిన్నరులు, నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, నాగులు, ఖేచరులు మున్నగు వారి నందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. అంతటి సౌందర్యవతి, సముద్రపుత్రి అయిన ఆ శతధృతిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ప్రాచీనబర్హి పెండ్లి చేసుకున్నాడు. శతధృతివల్ల ప్రాచీనబర్హికి పదిమంది కొడుకులు జన్మించి ‘ప్రచేతసులు’ అని ప్రఖ్యాతి గాంచారు. వారు సమవ్రతులు, సమనాములు, ధర్మజ్ఞులు. ఆ ప్రచేతసులు తండ్రి ఆజ్ఞ తలదాల్చి ప్రజలను సృజించటం కోసం తపస్సు చేయడానికి అడవికి బయలుదేరారు. త్రోవలో వారికి రుద్రుడు సాక్షాత్కరించి దయతో నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రచేతసులు ఆ ఉపదేశానుసారం జపధ్యాన పూజానియమాలతో నారాయణుని పదివేల సంవత్సరాలు ఆరాధించారు” అని చెప్పగా విని విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు.మునీంద్రా! ప్రచేతసులు వనమార్గంలో శివుని ఎలా కలుసుకున్నారు? శివుడు ప్రసన్నుడయి వారికి ఏమి ఉపదేశించాడు? ప్రాణులకు శివసాక్షాత్కారం ఈ లోకంలో దుర్లభం కదా! గొప్ప గొప్ప మునీంద్రులకు కూడా ఆయన ధ్యానంలోనే తప్ప ప్రత్యక్షంగా కనిపించడు కదా! అంతేకాక ఆత్మారాముడైన ఆ విరూపాక్షుడు అఖిలలోక సంరక్షణార్థమై స్వయంశక్తి సంపన్నుడై సర్వత్ర సంచరిస్తూ ఉంటాడు. కనుక అటువంటి భగవంతుడు, దేవాదిదేవుడు అయిన మహాదేవునితో ప్రచేతసులకు సమాగమం ఎలా కలిగింది? ఈ విషయమంతా నాకు వివరించి చెప్పు”.

అని ప్రశ్నించిన విదురునితో మత్రేయుడు ఇలా చెప్పాడు. “జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు తమ తండ్రి మాటను…తలదాల్చి తపస్సు చేయటానికి పశ్చిమదిశగా వెళ్తూ సముద్రం కంటే విశాలమైన ఒక పెద్ద సరస్సును చూచారు. ఆ చక్కని సరస్సు స్వచ్ఛమైన నీటితో నిండి వారి మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంకా…ఆ కొలనులో ఎఱ్ఱకలువలు, నల్లకలువలు, కమలాలు, కల్హారాలు చక్కగా వికసించి ఉన్నవి. మదించిన తుమ్మెదల మధుర ధ్వనులకు సంతోషంతో పులకరించినట్లుగా ఒడ్డున ఉన్న తీగలు, చెట్లు చిగురు తొడిగాయి. పద్మాలలోని పరాగాలను దిక్కులకు విరజిమ్ముతూ ఆనందంగా మంద మలయానిలాలు వీస్తున్నవి. ముద్దులు మూటగట్టే హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు, కన్నెలేడి పిట్టలు వీనుల విందుగా కూస్తున్నవి. చారణులు, గంధర్వులు అక్కడ విహరిస్తున్నారు. పుణ్యాలకు ఆలవాలమైన ఆ కొలనిలోని నీరు శుచిగా, తేటగా, తియ్యగా ఉన్నది.

ఆ సరస్సు సజ్జనుని మనస్సువలె నిర్మలంగా ఉన్నది. వైకుంఠం వలె దేవతల సంచారం కలిగి ఉన్నది. గొప్పవాని సంపద వలె యోగ్యమైన జీవనంతో ఒప్పుతున్నది. స్త్రీ స్వభావం వలె గంభీరమై ఉన్నది.

ఆ కొలనులోని నీళ్ళు చంద్రకిరణాల వలె తెల్లనివి. హరికథల వలె కల్మషాలను హరించేవి. అగ్నుల వలె భువనపావనాలైనవి. అటువంటి ప్రశస్తాలైన జలాలతో పరిపూర్ణమైనట్టి…ఆ భవ్యమైన సరస్సులో ప్రచేతసులు ఒక దివ్యపురుషుణ్ణి చూశారు.ఆ ప్రచేతసులు వీనుల విందుగా మృదంగ, వేణు నాదాలతో కూడి మనోరంజకమైన గంధర్వగానాన్ని ఆలకించి ఆ సంగీత మాధుర్యానికి ఆశ్చర్య చకితులౌతుండగా ఆ కొలనులోనుండి ఆ దివ్యపురుషుడు సంతోషంతో తటాలున వెడలి వచ్చాడు. ఈ విధంగా కొలనులోనుండి బయటకు వచ్చిన…కారుణ్యసముద్రుడైన రుద్రుణ్ణి ఆ ప్రచేతసులు చూశారు. ఆ శంకరుడు దేవతలలో అగ్రగణ్యుడు. మేలిమి బంగారు చాయ గలవాడు. సనకాది యోగివర్యులను సంస్తుతులను పొందేవాడు. మూడు కన్నులవాడు. భక్తులను వెంటనంటి ఉండేవాడు. మహైశ్వర్య సంపన్నుడు. ప్రసన్న వదనం కలవాడు. సజ్జనులకు సంపదలను అనుగ్రహించేవాడు. అటువంటి రుద్రుని…ప్రచేతసులు చూచి తమ మనస్సులలో అనురాగం, అద్భుతం కలుగగా భక్తి పరవశులై సవినయంగా ఆయన పాదపద్మాలకు మ్రొక్కారు.

భగవంతుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, దయామయుడు, భక్తులపట్ల వాత్సల్యం కలవాడు, దర్శనంతో అన్ని పాపాలను హరించేవాడు అయిన శంకరుడు సంతోషించి ధర్మములు తెలిసినవారు, ప్రసన్నమైన మనస్సులు కలిగినవారు, తన దర్శనంతో తృప్తిని పొందినవారు అయిన ప్రచేతసులతో ఇలా అన్నాడు. రాకుమారులారా! వినండి. మీ మనస్సులోని అభిప్రాయం తెలిసింది. మీకు శుభం కలుగుతుంది. మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా దర్శన మిచ్చాను. సూక్ష్మమూ, త్రిగుణాత్మకమూ అయిన నా స్వభావం కంటే, జీవులలో ప్రసిద్ధుడైన మానవుని కంటే పరమైనవాడు అయిన వాసుదేవుని పాదపద్మాలను ఎవరైతే భక్తితో పూజిస్తారో అటువంటివారు నాకు మిక్కిలి ఇష్టమైనవారు. వారికి నేను ఇష్టుడనై మహిమాన్వితుడనై విలసిల్లుతాను. సుచరిత్రులారా! ఇంకా వినండి. నిరంతరం స్వధర్మాన్ని ఆచరించిన పురుషుడు పెక్కు జన్మాల పుణ్యం చేత బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేత నన్ను పొందుతాడు. నేను బ్రహ్మాది దేవతలు అధికారాంతంలో పొందే విష్ణుపదాన్ని హరిభక్తుడు తనంతతానే పొందుతాడు. మీరు భాగవతులు కనుక నాకు ఇష్టులై ఉన్నారు. భాగవత భక్తులకు నాకంటె ఇష్టుడు మరొకడు లేడు. కాబట్టి వివేకవంతమైనది, జపింపదగినది, పవిత్రమైనది, శుభప్రదమైనది, మోక్షప్రదమైనది అయిన నా ఉపదేశాన్ని వినండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. అది ఎటువంటిదంటే….బ్రహ్మదేవుడు తన కుమారులైన సనకాదులను చూచి ఇలా అన్నాడు “కుమారులారా! వినండి. శుభప్రదమైన విష్ణు స్తోత్రాన్ని చెప్తాను”.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: