11, నవంబర్ 2020, బుధవారం

మహాభారతము ' ...74 .

 మహాభారతము ' ...74  . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


నలదమయంతుల చరిత్ర విన్న తరువాత, ధర్మరాజు, కొంత వుపశమించాడు.  మనస్సు తేలికపడింది.  తరువాత లోమశమహర్షి కూడా ధర్మజుని కలిసి, అర్జునుని యోగక్షేమాలు, ఇంద్రుని వద్ద అర్ధసింహాసనం అధిష్టించడం, పాశుపతం శివుని అనుగ్రహంతో పొందడం మొదలైనవి అన్నీ చెప్పి వుత్సాహపరిచాడు.  లోమశమహర్షి  ఇంద్రుడు ధర్మజుని, తీర్ధయాత్రలు చేసుకుని, తపస్సు ఆచరించి, దైవబలం పొందమని చెప్పమన్న విషయం,  ధర్మజునికి చెప్పాడు.   


కొందరు బ్రాహ్మణులతో, ద్రౌపదీ, మిగిలిన సోదరులతో, ధౌమ్యుడు, లోమశమహర్షి తో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు ధర్మజుడు. నైమిశారణ్యము, గయా దర్శించి, అగస్త్యాశ్రమం చేరారు వారు.   అగస్త్యుని గొప్పదనం తెలుసుకుంటూ, ' లోమశమహర్షీ !  అగస్త్యుడు వాతాపిని యెందుకు చంపాడు ? అంత అవసరం మునిపుంగవునకు యెందుకు వచ్చింది. దయచేసి వివరించమని ' వినయంగా అడిగాడు ధర్మజుడు.     


లోమశమహర్షి చెబుతున్నాడు :  అగస్త్యమహర్షి గొప్ప తప:సంపన్నుడు.  ఒకనాడు ఆయన అరణ్యమార్గంలో నడుస్తూ వుండగా,  ఆయనకు, మార్గం ప్రక్కన ఒక గొయ్యిలో,తన పితృదేవతలు తలక్రిందులుగా వేలాడుతూ వుండడం కనబడింది.  అగస్త్యుడు యెంతో బాధతో, ' పితృదేవతలారా !  మీరు యీవిధంగా వుండడానికి కారణమేమిటి ?  నామనసు వ్యధ చెందుతున్నది.  చెప్పండి. ' అని అడిగాడు.  


' కుమారా ! అగస్త్యా ! నీవు సంసారజీవితంలో ఒక పుత్రుని కన్న తరువాతనే మాకు విముక్తి. ' అని చెప్పారు.   అగస్త్యుడు ఆలశ్యం చెయ్యకుండా, తనకు తగినవధువు యెక్కడ వున్నదా అని అన్వేషించసాగాడు.   ఎక్కడా లభ్యం కాలేదు.  ఆయన తన మంత్రశక్తితో, ఒక్కొక్క జంతువులోని విశిష్టభాగాన్ని సేకరించి, వాటిని ఒకచోట పొందుపరచి, అందమైన అద్భుతమైన స్త్రీమూర్తిని తయారుచేశాడు.  ఈమెను యెవరి గర్భంలో ప్రవేశపెట్టవలెనా అని అనుకుంటుండగా, విదర్భరాజు, సంతానార్థియై తపస్సు చేస్తుండగా, ఆయన రేతస్సులో యీమె ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, ఆయన భార్యద్వారా, మెరుపుతీగ వంటి కుమార్తె వారికి ప్రసవించేటట్లు యేర్పాటుచేశాడు, అగస్త్యుడు.  ఈ విషయం విదర్భ రాజుకు చెప్పాడు. ఆబిడ్డకు లోపాముద్ర అని నామకరణం చేశాడు, విదర్భరాజు.


లోపాముద్ర అత్యంత తేజోరాశిగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగి, నవయౌవనంతో, యువకుల మనసులను కొల్లగొట్టేవిధంగా పెరిగింది.  ఆమెను చేపట్టాలని అనేకమంది వువ్విళ్ళు వూరసాగారు  .  అయితే, అగస్త్యునికి భయపడి, వారి మనసులోమాట విదర్భరాజుకు చెప్పలేకపోయారు.  


అగస్త్యుడు, లోపాముద్ర యవ్వనవతి అయిందని తెలుసుకుని,  ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని,విదర్భరాజును అడిగాడు. అయితే, రాజు మనసు అందుకు అంగీకరించలేదు.  ఇట్టి అందాల రాసిని,  కందమూలాలు తిని వికృతమైన గడ్డము, మీసాలతో వుండే ఈయనకు అప్పజెప్పడమేనా అని వ్యాకులపడ్డాడు.  తండ్రి బాధను గ్రహించి, లోపాముద్ర ఆయనను వూరడించి, ' తండ్రీ ! మీరు నన్ను అగస్త్యునకు యిచ్చి వివాహము చెయ్యకున్న ఆయన కోపించి శపిస్తాడు.  నాకు యీ రూపలావణ్యాలు   రావడానికి, ఆయన చేసిన కృషే అని చెప్పారు కదా !  కాబట్టి మీరు సంకోచించకుండా నన్ను ఆయనకు యిచ్చి వివాహం జరిపించండి.  కాకున్నది కాక మానదు. ' అని యెంతో నిబ్బరంగా చెప్పింది లోపాముద్ర. 


అలా విధిలేని పరిస్థితులలో, తన అసంతృప్తి బయటకు కనబడకుండా, లోపాముద్రను అగస్త్యునికి యిచ్చి వివాహం జరిపించాడు, విదర్భరాజు.  వివాహానంతరం, అగస్త్యుడు లోపాముద్రతో, ' మనం వుండేది అరణ్యాలలో కాబట్టి, నీవు యీ నగలూ,  చీనాంబరాలు వదలి, నారబట్టలతో నాతో బయలుదేరిరా ! మన ఆశ్రమమునకు వెల్దాము. ' అని ఆదేశించాడు.  ఆమె అలాగే నారబట్టలతో అగస్త్యుని అనుసరించింది.


హరిద్వారంలో చాలాకాలం వుండి తపస్సు ఆచరించాడు అగస్త్యుడు.  లోపాముద్ర ఆయనకు చేదోడు వాదోడుగా వుంటూ, అనేకవిధాలా సపర్యలు చేసి, ఆయన తపోవిధులకు యే ఆంతరాయం రాకుండా చూసుకున్నది లోపాముద్ర.  ఆమె సేవలకు అగస్త్యుడు యెంతో సంతోషించాడు.


ఇలావుండగా, ఒకనాడు, తేజస్సుతో, అందచందాలతో వెలిగిపోతున్న లోపాముద్రను,  అగస్త్యుడు కన్నార్పకుండా చూశాడు. ' ఇంత అందాలరాశినా నేను యిన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినది.  నేను వివాహమాడిన కారణం మర్చిపోయి, యెంత పొరబాటు చేశాను,'  అని మనసులో అనుకుని, తన కామవాంఛను, లోపాముద్రకు తెలియజేశాడు, అగస్త్యుడు. 


అయితే. లోపాముద్ర,  యెంతో వినయంగా '  సామీ !  మీరు అన్యధా భావించవద్దు.  సంతతిని పొందాలనే వుద్దేశ్యంతో, మీరు నన్ను వివాహం చేసుకున్నారు. మీ కోరిక తీర్చడం నాధర్మం.  కానీ, మిమ్ములను, యీ మునీశ్వరరూపంలో, తెల్లనిగడ్డంతో చూస్తుంటే, నాకు కోరిక కలగడంలేదు. అదియునూ గాక, మీరు వుపయోగించే యీ దుస్తులను, సామాగ్రిని మలినపరచడానికి, నా మనస్సు అంగీకరించడం లేదు.  

నారచీరలు, కాషాయవస్త్రాలు విసర్జించి, మేలిమివస్త్రాలు, ఆభరణాలు ధరించి, మనము ప్రణయం జరుపుకోవాలని, నా మనసు కోరుకుంటున్నది.  నా అభిలాష మీకు సమ్మతమేనని భావిస్తాను. ' అని సున్నితంగా మనసులోని మాట చెప్పింది.


ఆమె మాటలకూ అగస్త్యుడు ఆలోచనలో పడ్డాడు.


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: