11, నవంబర్ 2020, బుధవారం

నీతిలేని మనషులు(

 *నీతిలేని మనషులు(కమ్మని వూహలు-అందమైన అబద్దాలు)* 

డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

*******************************

పిల్లలూ... తేనెటీగలు తేనెపారను వూరికి దూరంగానో, ఎవరికీ కనబడకుండా గుబురు పొదల్లోనో, చెట్లకొమ్మలపై అందనంత ఎత్తులోనో పెడుతుంటాయి గదా... మనం దాన్ని తీసుకోవాలని చూస్తే తరిమి తరిమి కొడతా... కుట్టికుట్టి పెడతాయి గదా... అట్లా ఎందుకు చేస్తాయో తెలుసా... తెలీదా... అయితే సరదాగా ఈ కమ్మని ఊహ వినండి.


పూర్వం పాములు, తేనెటీగలు కూడా మనుషులతోనే కలసిమెలసి వుండేవంట. తేనెటీగలు రాత్రిపూట వూర్లలోకి అడవిజంతువులు ఏవీ రాకుండా కుక్కలతో కలసి వూరి చుట్టూ తిరుగుతా కాపలా కాస్తావుండేవంట. ఏవయినా జంతువులను పసిగట్టి కుక్కలు మొరగడం ఆలస్యం రయ్యిమని ఎగురుతా... అవి పులులైనా, సింహాలైనా, తోడేళ్ళయినా, నక్కలైనా కుట్టికుట్టి తరిమేవంట.


ఇక పాములేమో ఇళ్ళముందే పడుకోని కాపలా కాస్తావుండేవంట. తేనెటీగలను, వేటకుక్కలను దాటుకోని ఏవయినా లోపలికి వచ్చినా... ఇండ్లలోకి రాకుండా పాములు బుసలు కొడతా ఎదురు తిరిగేవంట. పిల్లలకు పాములంటే చాలా ఇష్టం. వాటిని మెడలో వేసుకోని తిరుగుతా, ఆడుకుంటా వుండేవారంట. అవన్నీ మనుషులతో బాటే వాళ్ళ గుడిసెల్లో నివసిస్తూ వుండేవంట. తేనెటీగలు చూరుకి తేనెపార కట్టుకోని అందులో గుడ్లుపెట్టేవి. ఎక్కడెక్కడి పూలనుంచో తేనెను సేకరించుకోని వచ్చి గదులనిండా నింపేవి. వాటిని పిల్లలుగానీ, పెద్దలుగానీ ఎవరూ ఏమీ చేసేవారు కాదు. అవిగూడా పొరపాటున గూడా మనుషులను కుట్టేవి కాదు.


ఎప్పటిలాగే ఒక రోజు చీకటిపడే సమయానికి కుక్కలు, తేనెటీగలు కలసి కాపలాకి వూరిబైటకు చేరుకున్నాయి. ఆరోజు ఒక పిల్లవాడు రాయిని పైకెగరేసి పట్టుకుంటా ఆడుకుంటున్నాడు. అనుకోకుండా అదిపోయి నిండుగావున్న ఒక తేనెపారకు కింద తగిలింది. దాంతో దానికి చిన్న రంధ్రంపడి ఒకొక్క చుక్కా కారసాగింది. ఆ పిల్లవాడు చేయి పెడితే ఒక చుక్క చేతిమీద పడింది. అది ఎట్లావుంటుందో చూద్దామని నాకి చూశాడు. నోరంతా తియ్యగా, హాయిగా ఎప్పుడూ చూడనంత రుచిగా కమ్మగా వుందంట. దాంతో వురుక్కుంటాపోయి తన స్నేహితులకంతా చెప్పాడు. అందరూ వచ్చి తలా ఒక చుక్క రుచి చూశారు. ఆహా! ఏమి రుచి. ఇంత తియ్యని తేనె ఇంట్లోనే పెట్టుకొని ఇన్నాళ్ళూ తాగని ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా అనుకున్నారు. ఆ విషయం అట్లా పిల్లలనుంచి పెద్దలవరకూ నిమిషాల్లో పాకిపోయింది. దాంతో అందరూ ''అబ్బో... అంతరుచా... చూద్దామాగు ఎట్లావుంటాదో'' అనుకుంటూ కనబన్న తేనెపారలన్నింటినీ కిందనుంచి రాళ్ళతో కొడతా తాగసాగారు. అట్లా కాసేపటికి అన్నిట్లో తేనె అయిపోయింది. అంతలో కొందరు పిల్లలు ''తేనె దాండ్ల లోపల ఇంకా వుంటాది గదా... రండి తెంచి పిడుదాం'' అని అరిచారు. దాంతో అందరూ చేతికి చిక్కిందాన్నల్లా తెంపి పిండుకోని జుర్రుకోసాగారు. దాంతో పాపం... వాటిలోపలుండే తేనెటీగల గుడ్లన్నీ చిదిమిపోయి పిల్లలన్నీ చచ్చిపోయాయి.


ఉదయమే ఊరికి తిరిగివచ్చిన తేనెటీగలకు... చూస్తే ఇంకేముంది. ఎక్కడికక్కడ తేనెపారలన్నీ విరిగి కిందబడి కనిపించాయి. పిల్లలన్నీ చచ్చిపోయాయి. గుడ్లన్నీ పగిలిపోయాయి. అవి కాందామీదా పడి గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ''ఎవరు ఈ పని చేసింది. మా తేనెపారలన్నీ నాశనం చేసి కళ్ళుగూడా తెరవని మా చిన్నారులను చంపిందెవరు'' అని అడిగాయి. దానికి మనుషులు 'ఏం చెప్పమంటారు మిత్రులారా... రాత్రి మీరంతా తూర్పువైపుకి కాపలా వెళ్ళారా... పడమటివైపునుంచి ఎట్లా వచ్చాయో ఏమో గానీ... అందరూ నిద్రపోతున్న సమయంలో... ఒక పెద్ద ఎలుగుబంట్ల గుంపు దాడి చేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా అవి కనపడిన ఇళ్ళలోకంతా దూరి దొరికిన తేనెపారను దొరికినట్లు నలిపి పారేసి తేనెంతా తాగేశాయి. ఆ అలికిడికి మేమంతా లేచి చేతికి దొరికిన కట్టె తీసుకోని దొరికిందాన్ని దొరికినట్టు చావబాదినాం గానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది' అని అబద్దం చెప్పారు.


ఆ మాటలన్నీ వింటున్న పాములకి చాలా కోపం వచ్చింది. ఒక పాము సరసరసర ముందుకొచ్చి ''ఎందుకు చెబ్తారట్ల అబద్దాలు. ఐనా పిల్లలు పొరపాటు చేస్తే తల్లిదండ్రులు సర్దిచెప్పి తప్పొప్పులు వివరించాలి గానీ... ఓ అంటూ వాళ్ళతో బాటు గుంపులో చేరిపోయి తప్పుమీద తప్పు చేయడమేనా పెద్దరికమంటే? సరే... ఐపోయిందేదో ఐపోయింది. తప్పొప్పుకొని ఇంకోసారి అట్లా చేయం అని చెబితే బాగుంటాది గానీ ఇట్లా అబద్దాలు చెబితే ఎట్లా మిమ్మల్ని నమ్మి మీతో వుండడం' అంది.


ఆ మంచిమాటలు మనుషుల తలకెక్కక పోగా వాళ్ళకు మరింత కోపం వచ్చింది. ''ఏందే... వూకె వింటున్నాం గదాని ఎగిరెగిరి నీతులు చెబుతున్నావు. నువ్వుండేదేమో నా చేయంత. అదుండేదేమో నా గోరంత. మీరా మాకు చెప్పేది. కట్టె తీసుకొని పెరికితే పచ్చడిపచ్చడయిపోతారు. అవ్‌ తాగాం. ఇకపై గూడా తాగుతాం. ఏం చేస్తారు. ఇంత వరకూ తేనె రుచి తెలీదు కాబట్టి దాని జోలికి పోలేదు. ఇక నోరు కట్టుకోని చూస్తా వూకుండలేం. తేనెలో సగభాగం ఇస్తే సరి. లేదంటే ఈ రోజుతో మీకు మాకు రాంరాం'' అన్నారు.


ఆ మాటలకు తేనెటీగలు బాధతో నోరు లబలబా కొట్టుకుంటా ''అయ్యో... ఎంతమాట... ఆ తేనె మేం గూడా తాగం. పాపం పసిపిల్లలు. గుడ్డులోంచి బైటకొచ్చి రెక్కలొచ్చి ఎగిరేదాకా వాటికి అదే ఆహారం. పిల్లల పొట్టగొట్టి అట్లాంటి దాంట్లో భాగం అడగడం న్యాయమేనా. మీకు గూడా పిల్లా జెల్లా వున్నారుగదా'' అన్నాయి.


కానీ ఆ మాటలు చెవిటోని ముందు శంఖమూదినట్లు మనుషుల తలకెక్కలేదు. వాళ్ళకు మధురమైన ఆ తియ్యని తేనె రుచి నాలుక మీద నుంచి పోనేపోవడం లేదు. మాటిమాటికీి గుర్తుకొస్తా రెచ్చగొడతావుంది. దాంతో ''మీరేం చెప్పినా లాభంలేదు. మేం తేనె మాత్రం వదలం. మీ ఇష్టం వుంటే వుండండి. పోతే పోండి'' అని తెగేసి చెప్పారు. దాంతో పాపం తేనెటీగలన్నీ బాధతో మనుషులని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాయి.


అప్పుడు ఒకడు ''అసలు ఈ గొడవకంతా కారణం ఈ పాములే. పెద్ద ఫుడంగుల మాదిరి మనకే నీతులు చెబుతున్నాయి. ఇవే గనుక గమ్మునుంటే గొడవే వుండేది కాదు. మనకి కావాల్సినప్పుడల్లా ఎలుగుబంట్ల మీదకు తోసేస్తూ కమ్మని తేనె తాగుతా వుంటిమి'' అన్నాడు.


''అవునవును. మనతోబాటే వుంటూ మనకే ఎదురు తిరుగుతా వున్నాయి. వీటికి ఒకసారి బుద్ధి చెబితేగానీ లాభంలేదు'' అన్నాడు ఇంకొకడు.


అంతే... అందరూ తలా ఒక కట్టె తీసుకోని దొరికిన పాముని దొరికినట్టు చావబాదసాగారు. దాంతో పాపం అవి అక్కడ వుండలేక వూరు విడిచి పారిపోయాయి.


కానీ... మనుషులు మాత్రం ఇప్పటికీ పాములు కనబడితే చాలు... అవి ఏమీ చేయకపోయినా, వాటంతటవి పోతావున్నా... వెంటబడి చంపుతావున్నారు. అట్లాగే తేనెటీగలు ఎవరికీ అందకుండా ఏ చెట్టుమీదనో, ఎవరికీ కనబడకుండా ఏ పొదలచాటునో తేనెపార కట్టుకున్నా కనుక్కోని దాండ్లను తరిమేసి తేనె తెచ్చుకోని తాగుతావున్నారు.

**************************

డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

**************************

కామెంట్‌లు లేవు: