11, నవంబర్ 2020, బుధవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -19


ప్రాచీనబర్హి యఙ్ఞములు -2 


అని శ్రీహరిని ఉద్దేశించి తన కుమారులు వింటుండగా ఇలా అన్నాడు “ఓ ఈశ్వరా! ఆత్మజ్ఞానులకు నిన్ను స్తుతించడం ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి ఆనందం మాకు కలుగు గాక! ఆనంద స్వరూపుడవు, సర్వాత్మకుడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను” అని ఇంకా ఇలా అన్నాడు. పద్మనాభుడవు, సంకర్షణుడవు, శాంతుడవు, జగతికి చైతన్యాన్ని కలిగించేవాడవు, తన్మాత్రలకూ ఇంద్రియాలకూ ఆశ్రయమైనవాడవు, సూక్ష్మమే నీవైనవాడవు, వాసుదేవుడవు, పరిపూర్ణమైనవాడవు, పుణ్యశరీరుడవు, నిర్వికారుడవు, వేదకర్మలను విస్తరింప జేసినవాడవు, దేహము లనెడి క్షేత్రాలను పాలించేవాడవు, ముల్లోకాలకు పాలకుడవు, సోమరూపుడవు, అధిక తేజస్సూ బలమూ కలవాడవు, స్వయంప్రకాశం కలవాడవు, అంతం లేనివాడవు, వేదకర్మలకు సాధనమైనవాడవు, పురాణ పురుషుడవు, యజ్ఞకారకుడవు, జీవ తృప్తుడవు, భూస్వరూపుడవు, లోకస్వరూపుడవు, ఆకాశం నీవే అయినవాడవు, లయకారుడవు, విశ్వకర్తవు, సర్వ వ్యాపకుడవు, జిష్ణుడవు అయిన నీకు నమస్కారం. స్వర్గ మోక్షాలను పొందటానికి కారణమైనవాడవు, జలరూపుడవు, సూర్యుడవు, ధర్మరక్షకుడవు, సజ్జనులకు హితమైన ఫలాలను ఇచ్చేవాడవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తియుతుడవు, కపిలుడవు, హిరణ్యగర్భుడవు, అగ్నిరూపుడవు, రుద్రుడవు, శిష్ట రక్షకుడవు, దుష్ట శిక్షకుడవు, శూన్యప్రవృత్తుడవు, కర్మ స్వరూపుడవు, మృత్యుదేవుడవు, విరాట్ శరీరధారివి, సర్వ ధర్మస్వరూపుడవు, వాక్ స్వరూపుడవు, నివృత్తుడవు, గొప్ప వర్చస్సు కలవాడవు, సకల ధర్మదేహుడవు, ఆత్మస్వరూపుడవు, అనిరుద్ధుడవు, వృద్ధి క్షయాలు లేనివాడవు అయిన నీకు నమస్కారం. సర్వ సత్త్వుడవు, దేవుడవు, నియామకుడవు, బయట లోపల వ్యాపించి ఉండేవాడవు, సమస్త అర్థచిహ్న స్వరూపుడవు, నిర్గుణుడవు, సృష్టికర్తవు, జితాత్మక సాధు స్వరూపుడవు అయిన నీకు నమస్కారం.” అని ఇంకా “ప్రద్యుమ్నుడవు, అంతరాత్మవు, సమస్త శేషకారకుడవు, నాలుగు హోత్రాలు రూపు గొన్నవాడవు, లయకారుడవు, సర్వజ్ఞుడవు, జ్ఞానక్రియా స్వరూపుడవు, అంతఃకరణమందు నివసించేవాడవు అయిన నీకు నమస్కారం. పుణ్యాత్మా! దేవా! నీ పాద పద్మాలను చూడగోరుతున్న మాకు పరమ భక్తులు పూజించిన నీ దర్శనాన్ని ప్రసాదించు. ఆ దర్శనం ఎటువంటిదంటే…పుణ్యాత్మా! నీ రూపం సర్వేంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులకు ప్రియమైనది. సంపూర్ణమైన సౌందర్యం కలది. సాటి లేనిది. శాశ్వతమైన శుభాలను సమకూరుస్తుంది. ఇంకా…తుమ్మెదల గుంపువలె నీ తలవెంట్రుకలు నల్లగా శోభిస్తాయి. నీ ముఖం చంద్రునికి సాటి వస్తుంది. దివ్య భూషణాల కాంతులతో నీ చెవులు ప్రకాశిస్తాయి. నీ కనుబొమలు, ముక్కు మిక్కిలి సొగసైనవి. నీ దంతాలు మొల్ల మొగ్గల వలె తెల్లగా ఉంటాయి. నీ చెక్కిళ్ళు నిగ్గు దేరుతుంటాయి. నీ కన్నులు కలువరేకుల వలె ప్రకాశిస్తాయి. నీ కడకన్నులు చిరునవ్వులను చిందుతాయి. నీ ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంటుంది. నీ కంఠం శంఖానికి సాటి. మణికుండలాల కాంతులతో నీ మేను జిగేలుమంటుంది. నీ నడుము సింహం నడుమువలె సన్నగా ఉంటుంది. ఇంకా నీ నాలుగు చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం ఉంటాయి. వైజయంతి అనే వనమాలికను, కౌస్తుభం అనే మణిని, లక్ష్మీదేవి అనే రత్నపుటద్దాన్ని నీవు రొమ్మున ధరిస్తావు. అందుచేత నీరొమ్ము గీటురాయివలె ఉంటుంది. రావి ఆకువంటి నీ పొట్టమీద ఏర్పడిన మూడు ముడుతలు నీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలకు కదలుతుంటాయి. నీటి సుడిగుండం వలె లోతైన నీ నాభిరంధ్రం పూర్వం బయటికి వచ్చిన సర్వప్రపంచమును మళ్ళీ లోనికి తీసుకొనే విధంగా ఉంటుంది. నీ నల్లని బలిష్ఠమైన కటి ప్రదేశంపై పద్మకేసరాలు రంగు కలిగిన పట్టు పీతాంబరం, బంగారు మొలత్రాడు ప్రకాశిస్తూ ఉంటాయి. నీ తొడలు నల్లని అరటి బోదెలవలె మెరుగులు చిమ్ముతాయి. నీ పిక్కలు సమంగా అందంగా ఉంటాయి. నీ మోకాళ్ళు పల్లంగా ఉంటాయి. నీ పాదాలు తామర రేకులవలె ఉంటాయి. నీ గోరు నా మనస్సులోని చీకటిని పారద్రోలే నెలవంకవలె ఉంటుంది. కిరీటం, కుండలాలు, కంఠహారాలు, ముత్యాలదండలు, భుజకీర్తులు, కంకణాలు, ఉంగరాలు, మణులు పొదిగిన అందెలు మొదలైన నానావిధాల నగలతో నీ శరీరం అలంకరింపబడి ఉంటుంది. నీ దివ్యరూపం భక్తుల సమస్త పాపాలను పోగొడుతుంది. భక్తుల మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తుంది. నీ రూపం సర్వ శుభాలకు నిలయం. నీవు అజ్ఞానులకు మంచి మార్గాన్ని చూపిస్తావు. నీవు మాకు నీ దివ్య రూపాన్ని చూపి మమ్మల్ని ధన్యుల్ని చేయవలసిందిగా వేడుకుంటున్నాము” అని ఇంకా ఇలా అన్నాడు. “కమలాక్షా! సచ్చరిత్రా! ఆత్మ పరిశుద్ధిని కోరే వారికి నీ దివ్యమూర్తి ధ్యానింపదగింది. స్వర్గాధిపతికైనా నీవు కోరదగినవాడవే. నీవు భక్తులకు సులభుడవు. దుష్టులకు దుర్లభుడవు. ఆత్మ దర్శనులు నిన్ను పొందగలరు. నీరు దురారాధ్యుడవు. నిన్ను సజ్జనులు కూడ వర్ణింపలేరు. నిన్ను పూజించువాడు నిన్ను విడువలేడు. భక్తియోగం చేత నీ పాదపద్మాలను ఆశ్రయించినవాడు తీవ్రకోపంతో బెదరిస్తూ సర్వలోకాలను ధ్వంసం చేసే యమునికి కూడా భయపడడు. కనుక…ఇటువంటి నీ పాదమూలాన్ని ఆశ్రయించిన పుణ్యాత్ముడు మరచిపోయి అయినా మనస్సులో మరొకటి కోరుకొనడు. శ్రీహరీ! నీ భక్తులతో చెలిమి చేసే అరనిముసంతో మోక్షం కూడా సమానం కాదు. ఇక క్షణికాలైన లౌకిక సుఖాలను గూర్చి చెప్పే దేమున్నది?

పాపాలను నాశనం చేసే పాదపద్మాలు కలవాడా! నీ కీర్తి అనే జలకణాలతో లోపలి, బయటి మాలిన్యాన్ని తొలగించుకొన్నవారే ఈ లోకంలో ప్రవిత్రులు కదా!

ప్రాణులపట్ల దయకలవాళ్ళు, రాగద్వేషాలు లేని మనస్సు కలవాళ్ళు, కపటం లేనివాళ్ళు అయిన అటువంటి సద్భక్తుల సహవాసాన్ని మాకు కలుగచెయ్యి. ఇదే మమ్ములను అనుగ్రహించడం” అని ఇంకా ఇలా అన్నాడు. పద్మనాభా! సత్పురుషుల స్నేహం వల్ల సంప్రాప్తమైన భక్తియోగం చేత పరిశుద్ధు డైనవాని మనస్సు అస్థిరాలైన బాహ్య విషయాలలో చిక్కుకొనదు. తమోరూపమైన సంసార గుహలో ప్రవేశించదు. అది స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలదు. అది ఎలా అంటే…దేనిలోపల ఈ విశ్వం ప్రకాశిస్తుందో, ఈ విశ్వం లోపల ఏది ప్రకాశిస్తుందో అటువంటి స్వయంప్రకాశమూ, శాశ్వతమూ అయిన ఆత్మతత్త్వమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం వికారం లేనిది. అతడు భేద బుద్ధిని కలిగించే మాయచేత విశ్వాన్ని సృష్టించాడు.మాటిమాటికి ఈ విశ్వాన్ని పుట్టించి, పోషించి, ధ్వంసం చేసే ఈశ్వరుడవు నీవే అని….అని తెలుసుకున్నాము” అని ఇంకా ఇలా అన్నాడు. “యోగనిష్ఠ కలవారు శ్రద్ధతో తమ పనులను ఆచరిస్తూ నీ రూపాన్ని మనస్సులో భావిస్తూ పూజిస్తారు. వారు వేద తత్త్వజ్ఞానులు. నీవు ఆద్యుడవు. అద్వితీయుడవై మాయాశక్తితో కూడి విలసిల్లుతూ ఉంటావు. అటువంటి మాయాశక్తి చేత….(మాయాశక్తి చేత) సత్త్వ రజస్తమో గుణాలు వరుసగా జన్మించాయి. ఆ త్రిగుణాల వల్ల మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఋషులు, దేవతలు, భూతగణాలు మొదలైన విశ్వం పుట్టింది. ఈ విధంగా మాయచేత నీవు సృష్టించిన చతుర్విధ రూపమైన పురమనే దేహాన్ని ఆత్మాంశలో పురుషుడు ప్రవేశించి తేనెను త్రాగినట్లు ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవిస్తాడు. అతనిని జీవుడు అని అంటారు. ఇటువంటి జగత్తుకు సృష్టికర్తవైన నీవు…

మేఘాలను చెదరగొట్టే పెనుగాలిలాగా నీవు ప్రాణులచేతనే ప్రాణులను గొప్ప సమర్థతతో నశింపజేస్తావు. ఆయా కార్యాలకు ఆయా రూపాలను పొంది, గొప్ప తేజస్సుతో, తీవ్రవేగంతో, గొప్ప భుజబలంతో నీవు విశ్వ సంహారం చేస్తావు. అది ఎలా అంటే…ఇది చేయదగిన పని అనే వివేకంతో ఎప్పుడూ ఏమఱిపాటుతో, విషయ లాలసత్వముతో, లోభత్వంతో ఉన్న ఈ సృష్టిని…కమలాక్షా! అధికమైన ఆకలితో నాలుకలు చాస్తున్న పాము తన నోట బడిన ఎలుకను తిన్నట్లు నీవు మెలకువతో (ఈ సృష్టిని) మ్రింగుతావు.

శేషశయనా! భక్తవత్సలా! నా తండ్రియైన బ్రహ్మదేవుడు, మనువులు దృఢవిశ్వాసంతో ఎల్లప్పుడూ పూజించే నీ పాదపద్మాలను మనస్సులో నిల్పుకొని, నీవు చేసే నిరాదరణకు బాధపడినా సజ్జనుడు ఆ పాదాలను వదలిపెట్టడు.కావున నాకు, పండితులకు సర్వ సందేహాలను పోగొట్టి, కాపాడి, పోషించేవాడవు నీవే” అని స్తుతించిన ఈ స్తవమును కోరి రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించాడు.అలా రుద్రుడు ప్రచేతసులకు తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు “ప్రచేతసులారా! యోగాదేశం అనే ఈ స్తోత్రాన్ని మీరు పలుమారు వల్లించి, మనస్సులో నిలిపి విశ్వాసంతో జపిస్తూ హరిని పూజించండి. ఈ స్తోత్రాన్ని ప్రజాసృష్టి చేయగోరి పుత్రులమైన మాకు, భృగువు మొదలైనవారికి బ్రహ్మ ఉపదేశించాడు. ప్రజాసృష్టి చేయడానికి బ్రహ్మ పురికొల్పగా మేము, భృగువు మొదలైనవారు ఈ స్తోత్రాన్ని జపించాము. అందువల్ల తమోగుణం నశించింది. వివిధ ప్రజలను సృష్టించాము. కాబట్టి ఏకాగ్రతతో శ్రీహరిపై మనస్సు నిల్పి ఈ స్తోత్రాన్ని జపించేవాడు కొద్ది కాలంలోనే శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానం అనే నావ చేత దుఃఖమయమైన సంసార సముద్రాన్ని మిక్కిలి తేలికగా దాటగలడు. నేను మీకు ఉపదేశించిన శ్రీహరి స్తవాన్ని పఠిస్తూ శ్రీహరిని పూజించేవాడు శ్రేయస్సులకు ఏకాశ్రయమైన నారాయణుని వలన కోరిన కోరికలను పొందుతాడు. వేకువ యందు శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని విన్నా లేక ఇతరులకు వినిపించినా కర్మబంధాలనుండి విముక్తు డౌతాడు. రాజకుమారులారా! పురుషోత్తముడైన శ్రీహరి స్తోత్రాన్ని ఆదరంతో మీకు తెలియజేశాను. మీరు ఎంతో భక్తితో…మీరు ఏకాగ్రచిత్తంతో ఈ స్తోత్రాన్ని జపిస్తూ తపస్సు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి”

అని ఈ విధంగా ఉపదేశించి ప్రచేతసుల పూజలను గ్రహించి శివుడు అంతర్ధాన మయ్యాడు. అప్పుడు…

ఆ ప్రచేతసులు శివుడు ఉపదేశించిన శ్రీహరి స్తవాన్ని జపిస్తూ పదివేల సంవత్సరాలు నీటి మధ్య నిలబడి భయంకరమైన తపస్సు చేశారు.కర్మాసక్తుడైన ప్రాచీనబర్హి వద్దకు ఆధ్యాత్మ తత్త్వవేత్త అయిన నారదమహర్షి దయతో వచ్చి ఈ విధంగా జ్ఞానబోధ చేసాడు. “రాజా! దుఃఖాన్ని తొలగించి, కోరికలను ప్రసాదించే శ్రేయస్సును నీవు కోరుకుంటున్నావు. కాని అట్టి శ్రేయస్సు నీకు ఈ కర్మలవల్ల లభించదు” అని చెప్పగా ప్రాచీనబర్హి నారదునితో ఇలా అన్నాడు. పుణ్యాత్మా! మహానుభావా! నారదమునీంద్రా! కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించింది. అందుచేత నేను మోక్షాన్ని తెలుసుకోలేక పోయాను. కాబట్టి నాకు ఇప్పుడు కర్మబంధాలను నిర్మూలించే నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించు. దయామూర్తీ! కపట ధర్మాలకు ఆలవాలమైన గృహాలలో భార్యాపుత్రులు, ధనధాన్యాలే గొప్ప పురుషార్థాలుగా భావించి సంసార బంధాలలో బద్ధుడైన బుద్ధిహీనుడు మోక్షాన్ని పొందలేడు”. అని చెప్పగా ఆ ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో నిర్దయుడవైన నీచేత సంహరింపబడ్డ వేలకొద్ది పశువుల సంఖ్యను 

గమనించు.ఆ పశువులన్నీ నీ హింసాకార్యాన్ని స్మరిస్తూ లోహయంత్రాలతో కూడిన కొమ్ములు కలిగినవై నీవు ఎప్పుడు మరణించి పరలోకాన్ని చేరతావో అప్పుడు నిన్ను హింసించాలని నిశ్వయించుకొని నీ చావు కోసం ఎదురు చూస్తున్నవి. ఇటువంటి గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్న నీకు దానిని తరింపజేసే ఒక కథను వినిపిస్తాను. విను” అని ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: