11, నవంబర్ 2020, బుధవారం

మహాభారతము ' ...72 .

 మహాభారతము ' ...72 . 

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//

అరణ్యపర్వం.


దమయంతిని సైరంధ్రినిగాచూసి, సుదేవుడు సమీపించి,  ' అమ్మా ! విదర్భరాజపుత్రీ ! దమయంతీ దేవీ !! మీ తండ్రి గారి ఆజ్ఞమేరకు మా బ్రాహ్మణసమూహము,  మీ యిరువురికోసం వెదుకుతూ వున్నాము.  నీబిడ్డలు మీతండ్రిగారి వద్ద సుఖంగా వున్నారు.  మీ తల్లిదండ్రులు మాత్రం మీగురించి కుమిలిపోతున్నారు. ' అన్నాడు.  


సుదేవుని దమయంతి గుర్తుపట్టింది.  అతనిని ఆప్తుడిగా భావించి, భోరున విలపించింది.  అది చూసి రాకుమార్తె సునంద రాజమాతతో చెప్పింది.   రాజమాత వెంటనే సుదేవుని దమయంతినీ దగ్గరగా పిలిచి,  విషయం తెలుసుకుని అచ్చెరువొందింది.  రాజమాత దమయంతిని ఆలింగనం చేసుకుని, ' అమ్మాయీ ! నీవెవరోకాదు, నాసోదరి కుమార్తెవు.  మీ అమ్మా,  నేనూ దశార్ణదేశాధిపతి కుమార్తెలం.  మీ అమ్మను విదర్భరాజుకు, నన్ను చేదిరాజుకు యిచ్చి వివాహాలు జరిపించాడు మా తండ్రి.   నీవు మా పుట్టింటిలోనే పుట్టావు. అప్పుడునేను అక్కడే వున్నాను.  ఇప్పుడు కూడా నీవు నీ పుట్టింట వున్నట్లే భావించి, సంతోషంగా యిక్కడ నీకు కావలసినన్నిరోజులు  వుండు.  నీవింక సైరంధ్రివి కావు, నాయింకొక కుమార్తెవు. '  అని ముద్దుచేసి, చుబుకం పైకెత్తి, ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని అక్కున చేర్చుకున్నది, రాజమాత. 


'  అమ్మా నేను విదర్భరాకుమారిని  అని తెలియక ముందుకూడా మీరు నన్ను కుమార్తె వలే ఆప్యాయంగా చూసుకున్నారు.  మీ అభిమానానికి కృతజ్ఞతలు.  నేను కొన్ని సంవత్సరాలుగా, పెనిమిటికీ, బిడ్డలకూ దూరమై అలమటిస్తున్నాను.  నన్ను విదర్భకు వెళ్లేవిధంగా దయచేసి ఏర్పాట్లు చేయించండి. '  అని ఆవేదనతో చెప్పింది దమయంతి.


ఆమె కోరినవిధంగా రాజమాత, కుమారునికి చెప్పి, దమయంతిని అనేక కట్నకానుకలతో, సంభారాలతో, సైనికులను రక్షణగా యిచ్చి విదర్భరాజ్యానికి పంపింది.  ఆమె తండ్రి భీమరాజు యెంతో సంతోషించి, సుదేవునికి తాను ప్రకటించిన విధంగా వెయ్యి గోవులను, అగ్రహారాన్ని బహూకరించాడు.


అప్పటినుంచి, నలునికోసం అన్వేషణ యింకా తీవ్రతరం చేశాడు, దమయంతి తండ్రి భీమరాజు.   దమయంతి కూడా, తన మేధస్సు వుపయోగించి, మెరికలలాంటి కొందరు బ్రాహ్మణయువకులను పిలిపించి, వారికి,  ఆమెకూ నలమహారాజుకూ,  వివాహం జరిగిన విధానమూ, తరువాత జరిగిన పరిణామాలు, అన్నీ వివరించి ఒక కథలాగా తయారు చేయించి, అన్ని రాజ్యాలలో కూడలిస్థలాలలో వినిపింపమని చెప్పింది.   ఆకధ విని యెవరైనా ఉత్సుకత ప్రదర్శించిప్రశ్నలు వేసినా, లేక ఆవేదనతో దుఃఖం ప్రదర్శించినా, వారిని కనిబెట్టి తనకు తెలియజేయవలసినదిగా చెప్పి,  చుట్టుప్రక్కల రాజ్యాలకు పంపింది, దమయంతి.


అలా తిరుగుతున్న బ్రాహ్మణయువకులలో పర్ణాదుడు అనే ఒక బ్రాహ్మణుడు తిరిగి వచ్చి, ' అమ్మా !  దమయంతీ దేవీ ! నా ప్రయత్నాలలో అయోధ్యరాజ్యంలో ఋతుపర్ణుని కొలువులో యీకథ వినిపిస్తుండగా,  యెవరూ స్పందించక పోయినా, తిరిగి నేను ఒంటరిగా వస్తుంటే, ఋతుపర్ణుని రధసారధి, బాహుకుడు అనేవాడు, వచ్చి నన్ను రహస్యంగా కలిశాడు. బహు కురూపిగా వున్నాడు.  కానీ అశ్వవిద్యలో పాకశాస్త్రం లో నిష్ణాతుడట.   అతను నాతో మాట్లాడుతూ, ' పతివ్రతలు, తమభర్తలు  తమను వదలి వెళ్లినా కోపగించుకోరనీ, యేపరిస్థితులలో అలా చేశాడో అని గ్రహించి, తమను తాము రక్షించుకుంటారనీ, మీరుచెప్పిన కథలో ఆమె కూడా అదేవిధంగా భర్తను అర్ధం చేసుకుని వుంటుందని భావించవచ్చా ?' అని అడిగాడు.   ఈ విషయం తమకు తెలియజేద్దామని వచ్చాను, అనిచెప్పి,  ఆమె యిచ్చిన బహుమతి తీసుకుని శలవు తీసుకున్నాడు.


దమయంతి యీవిషయమై దీర్ఘంగా ఆలోచించింది.  తన తల్లితో కూడా చర్చించింది.  సుదేవుని పిలిపించింది.   బాగా అలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి,  సుదేవుని ద్వారా  ఋతుపర్ణునికి  ' దమయంతికి పున:స్వయంవరమనీ, నలుడు కనబడకుండా పోయి చాలా రోజులైందని, అందువలన, త్వరగా ఒక్కరోజులోనే స్వయంవరం యేర్పాటు చేశామనీ, రేపటికల్లా యిక్కడకు రావాలని '  కబురుచేశారు. 


సుదేవుడు యీవిషయాలు ఋతుపర్ణునికి చెప్పగానే, ఆయన బాహుకుని వేషంలో వున్న నలుని పిలిపించి,  ' బాహుకా !  నీవు నా అశ్వదళాధిపతివి.  ఇప్పుడు నీవే నాకు సహాయం చెయ్యాలి. వెంటనే ఒక్కరోజులో మనం విదర్భరాజ్యం వెళ్ళాలి.  అంతదూరం త్వరగా, అనుకున్న సమయానికి తీసుకెళ్లి చేర్చగలవా ? ' అని అడిగాడు. ' సరే ' అన్నాడు బాహుకుడు.  


' బాహుకా ! విదర్భరాజపుత్రిక దమయంతి పున : స్వయంవరమనీ, రేపటికల్లా అక్కడ వుండాలని వర్తమానం వచ్చింది.  దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా వుండు. కొద్దిసేపటిలో బయలుదేరుదాము.' అని లోపలకు వెళ్ళాడు  ఋతుపర్ణుడు.  తాము విదర్భదేశం వెళుతున్న కారణం తెలిసి నలుడు ఖిన్నుడయ్యాడు.  ' దమయంతి పుత్రవతి అయివుండి కూడా యిట్టి నిర్ణయం తీసుకుందా ?  నమ్మశక్యంగా లేదు.  కాలం గడిచిన కొద్దీ ఆమె మా దాంపత్య స్మృతులు మర్చిపోయిందా ?  లేక నన్ను నలునిగా గుర్తించి ఈ వర్తమానం పంపిందా ? '  అని పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు.


ఋతుపర్ణుడు రథమెక్కి బాహుకుని బయల్దేరమన్నాడు.  వారితో వార్ష్ణేయుడు కూడా వున్నాడు. రధంకదిలింది.  బాహుకుడు వాయువేగ మనోవేగాలతో రధం తోలుతున్నాడు.  ఋతుపర్ణుడు గగనవిహారం చేస్తున్నట్లు అనుభూతిచెందాడు.' బాహుకుని మారువేషంలో వున్న ఇంద్రుని రధసారధి మాతలి యేమో అనుకున్నాడు.  లేక అశ్వహృదయ విశారదుడయినా శాలిహోత్రుడా అనుకున్నాడు. వీరెవరూ కాక, మారువేషంలో  వున్న నలమహారాజా  !  అనుకున్నాడు.  తనకు తెలిసినంతవరకూ  యీముగ్గురే  రధాన్ని ఇంతవేగంగా నడుపగలరు,' అని ఆశ్చర్యపోయాడు.  వారితో వున్న వార్ష్ణేయుడు కూడా బాహుకునిలో నలమహారాజు పోలికలకై వెతుకున్నాడు.  


గుర్రాలు ఆవిధంగా భూమిమీద వెళ్తున్నాయో, గాలిలో వెళ్తున్నాయో తెలియని స్థితిలో, ఋతుపర్ణుని వుత్తరీయం, గాలికి యెగిరి రధం వెనుకగా పడిపోయింది. అది గమనించి

' బాహుకా రధం ఆపు. వార్ష్ణేయుడు వెళ్లి నా వుత్తరీయం తెస్తాడు.  ఇప్పుడేపడిపోయింది. '  అన్నాడు.  ' అసంభవం మహారాజా ! మీరు మాట్లాడే లోపే, మన రధం మూడు క్రోసుల దూరం వచ్చింది.  నేను వేగాన్ని పట్టి దూరాన్ని కొలవగలను. ' అని సమాధానం యిచ్చాడు, బాహుకునిరూపంలో వున్న నలుడు,  ' బాహుకా !  నీ అశ్వవిద్య అద్భుతం.  నాకు అశ్వవిద్య నేర్పు. నేను నీకు ద్యూతవిద్య నేర్పుతాను.  నా ద్యూతవిద్య అసమానమైనది.  ఆ కలిపురుషుడైనా నా విద్య ముందు పారిపోవలసినదే ! '  అని నలుని ప్రక్కగావచ్చి రథచోదనంలో మెళుకువలు తెలుసుకుంటూ, తన ద్యూత విద్యను కూడా రహస్యంగా చెవిలో ఉపదేశించాడు ఋతుపర్ణుడు, నలునికి.


రధం వేగంగా పరిగెడుతున్నది, నలుని సారధ్యంలో. 


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: