11, నవంబర్ 2020, బుధవారం

అరణ్యపర్వము-22

 అరణ్యపర్వము-22

అర్జునుని రాక


పాండవులు నరనారాయణులు నివసించిన స్థానంలో కొన్ని దినములు గడిపారు. ఒకరోజు ధర్మరాజు తమ్ములతో ఇలా అన్నాడు. ” అర్జునుడు మనలను విడిచివెళ్ళి అయిదు సంవత్సరాలు గడిచాయి. దివ్యాస్త్రాలతో అతను వచ్చే సమయం ఆసన్నమైంది ” అని చెప్పాడు. పాండవులు అర్జుని కోసం ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారంతా మాల్యవంతము అనే పర్వతం చేరుకున్నారు.


ఒక రోజు ద్రౌపది భీమసేనుడు ఆ పర్వత సానువులలో విహరిస్తున్నారు. అప్పుడు పంచ వర్ణములు కలిగిన పువ్వు గాలిలో ఎగురుతూ వారి ముందు పడింది. ద్రౌపది ఆ పువ్వులను చూసి ముచ్చట పడి భీమసేనుని అలాంటి పువ్వులు మరికొన్ని తీసుకు రమ్మని కోరింది. భీముడు ఆ పువ్వు వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. పువ్వులను వెదుకుతూ భీముడు కుబేరుని నివాసానికి వెళ్ళాడు. అక్కడ కాపలా ఉన్న యక్ష, రాక్షస భటులు భీముని అడ్డగించారు. భీముడు వారితో యుద్ధం చేసాడు. ఆ యుద్ధంలో కుబేరుని సేనాని మరియు ప్రయ మిత్రుడైన మణిమంతుడు మరణించాడు. ఆ విషయాన్ని భటులు కుబేరునికి తెలిపారు.


ఇంతలో ద్రౌపది వలన విషయం తెలుసుకున్న ధర్మరాజు సోదరులను తీసుకుని ద్రపదీ సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. వారు కుబేరుని మందిర సమీపంలో చనిపోయిన యక్షులు, మణిమంతుని భీకరంగా కనపడుతున్న భీముని చూసారు. కుబేరుడు జరిగినది భటుల వలన తెలుసుకుని అక్కడకు వచ్చి ధర్మరాజాదులను చూసి ధర్మరాజుకు నమస్కరించి ” ధర్మరాజా! నా మిత్రుడు మణిమంతుని నీ సోదరుడు భీముడు చంపాడని చింతించ వలదు. అతడు శాపవశాత్తు మరణించాడు. మీరు ఈ ప్రాంతంలో హాయిగా ఉండండి. నాసేవకులు మీకు సేవలు చేస్తారు. మీరు పదిహేను దినములపాటు ఆర్ష్టిషేణాశ్రమంలో నివసించండి. మీ తమ్ముడైన అర్జునుని నేను ఇంద్రసభలో చూసాను. అర్జునుడు మీ వద్దకు రావడానికి సిద్దంగా ఉన్నాడు ” అన్నాడు.


కుబేరుని మాట ప్రకారం ధర్మరాజాదులు ఆర్ష్టిషేణాశ్రమం చేరుకున్నారు. ఒకరోజు వారికి ధౌమ్యుడు మేరుపర్వతం చూపించి ” ధర్మజా! అది మేరుపర్వతం దానిని దిక్పాలకులు కావలి కాస్తుంటారు. మేరువు చుట్టూ సూర్యుడు చంద్రుడు, నక్షత్రమండలం ప్రదక్షిణం చేస్తంటారు. ఈ పర్వతం మీద త్రిమూర్తులు కొలువు తీరి ఉంటారు ” అని చెప్పాడు. ఇంతలో మాతలి తోలుతున్న రథం మీద అర్జునుడు వచ్చాడు. అర్జునుడు రాగానే ధౌమ్యుడు, ధర్మరాజు, భీములకు నమస్కరించాడు. ఇంతలో ఇంద్రుడు అక్కడకు వచ్చి ” ధర్మరాజా! నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. నివాత, కవచులను వధించాడు. దేవతలకు మేలు చేసాడు ” అని చెప్పి ధర్మరాజుకు అర్జునిని అప్పచెప్పి ఇంద్రలోకం వెళ్ళాడు.


ధర్మరాజు అర్జునునితో ” అర్జునా! నీవు పరమశివుడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు మొదలగు వారిని మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావు అని ఇంద్రుడు చెప్పాడు. ఆ వివరాలను మాకు వీనుల విందుగా చెప్పు ” అని అడిగాడు. అర్జునుడు ఈవిధంగా చెప్పసాగాడు ” అన్నయ్యా ! నేను నీ ఆదేశం మేరకు హిమవత్పర్వతానికి వెళ్ళాను. నాకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కనిపించి శివుని గురించి తపస్సు చెయ్యమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకు మెచ్చి శివుడు కిరాతుడి రూపంలో దర్శనం ఇచ్చాడు. నాతో యుద్ధం చేసి నా శౌర్యం మెచ్చి నాకు పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. తరువాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలు పొందాను. అందుకు ప్రతిగా ఇంద్రుడు నన్ను నివాతకవచులను చంపి దేవతలకు మేలు చేకూర్చమన్నాడు. నాకు దేవదత్తము అనే శంఖాన్ని బహూకరించాడు.


నేను మాతలి రథం తోలగా రథం ఎక్కి నివాతకవచుల దగ్గరికి వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకు యుద్ధానికి వచ్చారు. వారికి నాకు మధ్య ఘోర యుద్ధం జరిగింది ఇంతలో దేవతల సారధి మాతలి స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేసారు. నేను స్వయంగా రధాన్ని నడుపుతూ వారితో యుద్ధం చేసాను. వారు తిమిర బాణాన్ని వేసారు. లోకమంతా చీకటి అయింది. అది చూసి మాతలి పెద్దగా అరిచాడు. ఎవరూ ఎవరికీ కనిపించలేదు. నేసు దేవేంద్రడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చింది. నేను నా గాండీవం నుండి అస్త్రప్రయోగం చేసాను. ఆబాణములకు రాక్షసులు అందరూ మరణించారు.


ఆ విధంగా నేను రాక్షసులను జయించి దేవలోకం వెళుతూ మార్గ మధ్యంలో నేను హిరణ్య పురం చూసాను. అందులో పౌలోమ, కాలకేయులు అనేరాక్షసులు నివసిస్తున్నారు. వారు దేవతలచే చంపబడరు అని నాకు మాతలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను. నన్ను చూసి దేవేంద్రుడు అనుకుని రాక్షసులు నన్ను చుట్టు ముట్టారు. మా మధ్య ఘోరయుద్ధం జరిగింది. వారు నాతో మాయా యుద్ధం చేయసాగారు. వారు వారి పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి యుద్ధం చేయసాగారు. నేను శివుని స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రానికి రాక్షసులంతా మరణించారు. ఆ తరువాత నేను దేవలోకానికి వచ్చి ఇంద్రునితో జరిగినది వివరించాను. ఇంద్రుడు నాతో ” అర్జునా ! నీ కోసం నీ సోదరులు ఎదురు చూస్తున్నారు. నీ విజయ వార్తలు వినటానికి ఉవ్విళ్ళూరుతున్నారు ” అని చెప్పి మాతలితో నన్ను ఇక్కడికి పంపించాడు ” అని అర్జునుడు చెప్పాడు. అర్జునుని విజయగాధలు విని ధర్మరాజాదులు సంతోషించారు. ధర్మరాజు ” అర్జునా! నీకు దేవతలు ఇచ్చిన అస్త్రాలు మాకు చూపించు ” అన్నాడు.


అర్జునుడు ప్రయోగించి చూపడానికి ఉద్యుక్తుడు కాగా అక్కడకు వచ్చిన నారదుడు ” అర్జునా! అవి దివ్యాస్త్రాలు. ఆ అస్త్రాలు లక్ష్యం లేకుండా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి మూడు లోకాలను దహించగలవు ” అని చెప్పాడు. నారదుని ఆదేశం మేరకు అర్జునుడు అస్త్ర ప్రయోగాన్ని ఆపి వేసాడు. తరువాత ధర్మరాజు తన సోదరులతో అక్కడ పది మాసాలు గడిపాడు. తరువాత దేవఋషి రోమశుడు దేవలోకం వెళ్ళాడు. తరువాత పాండవులు బదరీ వనంలోని సుబాహు పురం వచ్చి అక్కడి నుండి ఘతోత్కచుని తన పరివారంతో సహా పంపి వేసాడు. తరువాత వారు హిమవత్పర్వతమునందలి అనేక ప్రదేశములు దర్శిస్తూ ఒక సంవత్సరం గడిపారు.

కామెంట్‌లు లేవు: