11, నవంబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 77*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                              *ధార్మికగీత - 77*

                                        *****

    *శ్లో:-  సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం ౹*

            *సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ౹*

            *షన్ణామ్ రసానామ్ లవణం ప్రధానం*

            *భవే న్నదీనాం ఉదకం ప్రధానమ్ ౹౹*

                                   *****

*భా:-1. మానవునికి  ఇహ,పర ధర్మసాధకోపకరణము శరీరము. దేహమే దేవాలయము. జీవుడే దేవుడు. అటువంటి శరీరం మొత్తానికి కీలకమైనది "శిరస్సు". సమస్త అవయవాలకు ఆజ్ఞలు జారీచేసి, మంచైనా, చెడైనా చేయించగల సత్తా గల మనస్సు దీని ఆధీనంలో ఉంటుంది. తల లేని దేహాన్ని ఊహించలేము. అది కేవలం కట్టెలమోపుతో సమానము.   2. జ్ఞానేంద్రియాలలో "కన్ను" ముఖ్యమైనది. ఒక్క చూపుతో విశ్వ విజ్ఞానాన్ని పసిగట్టడంలో దిట్ట,  పరేంగితావగాహి  "నేత్రము". హృదయమనే పుస్తకాన్ని ఆసాంతం చదివి , భావాన్ని విప్పిచెప్పగల ధీశాలి "కన్ను". అది లేకపోతే  లోకమంతా  అంధకార బంధురమే.అన్నీ ఉన్నా "కన్ను" లేకుంటే ఏమీ లేనట్టే.   3. పసందైన విందంటే అందరికి ఇష్టమే. షడ్రసోపేతమైన మృష్టాన్నం వేడుకల్లో అందరిని అలరిస్తుంది. అది ఎంత నలభీమ పాకమైనా "ఉప్పు" లేకుంటే రుచేముంటుంది? సరియైన ఉప్పు పాలు కలిస్తేనే ఏ పదార్థమైనా  అమృతతుల్యంగా ఉంటుంది.   4. సృష్టిలో నదీ నదాలు నిరంతరం ప్రవహిస్తూ,  వ్యవసాయానికి "సాగునీరు", ప్రాణికోటికి  జీవనాధారమైన 'త్రాగునీరు" అడగకుండానే అందించడంలో ముందుంటాయి. నీరు లేని నదులను ఊహించుకొంటేనే  హృదయం ద్రవిస్తుంది. జీవకోటి అల్లల్లాడి పోతుంది. ఈ విధంగా కాయానికి "తల"; ఇంద్రియాలలో "కన్ను"; షడ్రుచులలో "ఉప్పు"; నదులకు "నీరు" గుండెకాయ వంటివని సారాంశము*. 

                                   *****

                    *సమర్పణ  :   పీసపాటి*    

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: