11, నవంబర్ 2020, బుధవారం

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదిహేనవ శ్లోక భాష్యం - మూడవ భాగం


బహిర్గతమైన స్థూల శబ్దాన్ని తక్కువ వర్గానికి చెందినదిగా భావించరాదు. అర్థవద్ధ్వనికి ప్రాతినిధ్యం వహించే 51 అక్షరములు మాతృకలని పిలవబడుతున్నాయి. మాతృక అంటే తల్లి. ఒక స్త్రీ గౌరవ భాజన అయినప్పుడు ఆమెను గౌరవంగా “అమ్మగారు” అని పిలవడం వ్యవహారంలో చూస్తున్నాం. మహారాజ్ఞి అయిన అంబిక “అమ్మగారు”. మనతో మనలో కలిసిపోయినపుడు ఆమె మాతృక. అమ్మ. అంబికను మహారాజ్ఞిగా కొనియాడిన లలితా సహస్రనామ స్తోత్రం ఆమెను మాతృకా వర్ణరూపిణిగా ప్రస్తుతిస్తుంది. కాళిదాసు శ్యామలా దండకంలో ఆమెను సర్వవర్ణాత్మికగా ప్రస్తుతిస్తాడు. వేదములు మొదలుగా సమస్త సారస్వతము ఈ మాతృకల విన్యాసమే! 


శాక్త తంత్రములో శబ్ద ప్రపంచమునకు గల ప్రాముఖ్యత చెప్పుకొన్నాం కద! అక్షమాల, పుస్తకము దానికి ప్రతీకలు. శ్రీవిద్యలోని మంత్రములు అంబిక నామములు కావు. బీజాక్షరములే. మంత్రములు, బీజమంటే విత్తనం. ఒక చిన్న విత్తు మఱ్ఱిచెట్టుగా విస్తరిస్తుంది. విత్తు అంతటి శక్తిని తనలో నిబిడీకృతం చేసుకొని ఉన్నదన్నమాట. బీజాక్షరాలలో పరమమైన అంబిక శబ్దరూపాన్ని ధరిస్తోంది. ఏకాగ్రతతో జపిస్తే శబ్దరూపంలో ప్రత్యక్షమయి అనుగ్రహిస్తుంది. అంతే కాదు. అంబికను ముఖాముఖి దర్శించడానికి ఆకేశపాదాంతం దర్శించడానికి వీలవుతుంది. మనం పూర్వపు శ్లోకాలలో సదాశివత్వం సిద్ధించకపోతే అటువంటి దర్శనం సాధ్యం కాదని చెప్పుకొన్నాం. అంబికాదర్శనమన్నది తురీయదశ. ఏకాగ్రతతో మంత్ర జపం చేయడం వలన కుండలినీ యోగం ద్వారా పొందగలిగే అనుగ్రహాన్ని మొత్తంగా పొందగలరు. అటువంటి జపం వలన మనకు ఇప్పుడు, ఇక మీదట కావలసినదంతా సిద్ధిస్తుంది.


శ్రీవిద్యా మంత్రములలో కూటములు అని పిలవబడే మూడు విభాగాలున్నాయి. మంత్రం మొత్తంగా అంబికా స్వరూపం. అందులో ముఖస్థానీయం వాగ్భవ కూటము. ఇదే మొదటిది. మనిషి శబ్దం చేయగలిగే నోరు ముఖంలోనే కదా ఉన్నది, వాగ్భవ కూట మంత్రములకు శాక్త గ్రంథములలో ప్రత్యేక ప్రాముఖ్యత ఈయబడింది. ఈ మంత్రములు జపించినవారు కవులవుతారు అని చెప్పబడింది. సౌందర్యలహరి కూడా అంబికానుగ్రహం కవిత్వాన్ని సిద్ధింపచేస్తుందని చెబుతోంది. ఎందువలన ?


పరాశక్తి ఒక మనుష్య జాతికి మాత్రమే వాక్శక్తిని ప్రసాదించింది. ఇది మనకు మాత్రమే లభించిన ప్రత్యేక ప్రసాదము. ఈ ప్రసాదాన్ని సరిగా వినియోగించుకొని శ్రేయస్సు పొందగల బుద్ధి మనకుంటే ధన్యులవుతాము. అంబిక చేత ప్రసాదించబడిన ఈ వాక్శక్తి మనం అంబికను చేరడానికి ఉపయోగపడాలి. అయితే ఆమె కొద్ది మందికి కవితా శక్తి హృద్యమైన వాగ్వైఖరిని ఎందుకు అనుగ్రహించింది?  అంబికను దర్శించిన భాగ్యవంతుడు, తన తోటి వారికందరికీ ఎలుగెత్తి, హృద్యంగా చెప్పి, వారికందరికీ అటువంటి అనుభూతి కలగడానికై దోహదం చేసేందుకే ఈ శక్తి అనుగ్రహించబడింది. గురువు గమ్యార్థియైన తన శిష్యునకు కష్టసాధ్యమైన సాధనను, ప్రవర్తనా నియమావళిని ఏర్పరుస్తాడు. కవి తన పాటల ద్వారా, పద్యాలద్వారా అటువంటి గమ్యాన్ని నిరాయాసంగా, ఆనందంగా పాడుకుంటు చేరేట్లు చేస్తాడు. అంబిక అతనికి ప్రసాదించిన కవితా శక్తి అతని ఉద్ధరణకు మాత్రమే పరిమితం కాదు. సామ్యవాద శైలిలో అది సాధకులందరి ఉమ్మడి సొత్తు. మనకు అనుగ్రహించబడిన హక్కుతో ఆ స్తోత్రాలను పాడి, ఆ రూపాన్ని కీర్తించి ఉద్ధరించబడాలి. అంబిక చేసే ఈ కవితా శక్తి అనే అనుగ్రహం ఆమె వాగ్దేవి అనే ప్రత్యేక రూపంలో చేస్తున్నట్లు చెప్పబడింది.


వరదాభయ ముద్రలు, అక్షమాలాపుస్తకములు ధరించి ఉన్న వాగ్దేవికి సతాం = మంచివారు, సజ్జనులు, సాధువులు; సకృత = ఒక్కసారి; నత్వా = నమస్కారం చేస్తే చాలు. ఎవరైనా ఒకసారి నమస్కారం చేస్తే అమోఘమైన వాగ్వైఖరి సిద్ధిస్తుందని ఇక్కడ చెప్పబడలేదు. ఉన్నతులు సత్ శీలురు అయినవారి విషయంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. “మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణా ఫణితయ” అన్న పాదం అటువంటి సాధువుల విషయంలో మాత్రమే సిద్ధిస్తుంది.

ఇక్కడ ఆచార్యులవారు తీపి అయిన వస్తువులను, మూడింటిని ఉపమానంగా చెబుతున్నారు. అవి తేనే, పాలు, ద్రాక్ష. ఇవి ఒక మధురమైన వస్తువులేకాదు. తేలికగా జీర్ణమవుతాయి. పటుత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఉపమానాన్ని ఎన్నుకోవడం ద్వారా సత్పురుషుల వాక్యములు మనుష్యులు గ్రహిస్తే వారికి విషయం తేలిగ్గా అవగతమవడమే తమ గమ్యాన్వేషణలో పటుత్త్వాన్ని కలిగిస్తుందని ఆచార్యులవారు సూచిస్తున్నారు. సత్పురుషులు వాగ్దేవి రూపంలో ఉన్న అంబికకు ఒక్కసారి నమస్కరిస్తే మధురమైన వాగ్వైఖరి ప్రసాదిస్తుందని చెప్పడానికి కవిత్వ ధోరణిలో “కథమివ – సన్నిదధతే” ఎలా ప్రసాదించకుండా ఉంటుంది? అని ప్రశ్నిస్తారు.


(రాబోయే మూడు శ్లోకాలలోని విషయానికి, పై విషయానికి సంబంధమున్నందున ఆ శ్లోకములపై మహాస్వామివారి ప్రసంగాలు చదివేటప్పుడు ఈ ప్రసంగం పునరాలోకనం చేయవలసి ఉంటుంది.)


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: