మహాభారతము ' ...73 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
ఋతుపర్ణుడు ద్యూతవిద్యను రధంలో వున్నప్పుడే నేర్పగానే, అక్షవిద్య నలునికి అవగతమైంది తెలుసుకుని, కలిపురుషుడు నలుని శరీరంలో వుండలేక, అసౌకర్యానికి గురై నలుని శరీరం నుండి తప్పుకున్నాడు. వెంటనే, నలుడు తెలీని సౌఖ్యం పొంది ప్రశాంతత అనుభవించాడు.
అనుకున్న సమయానికంటే ముందస్తుగానే, నలుడు ఋతుపర్ణమహారాజును విదర్భ రాజ్యం చేర్చాడు. వారిరాకకు అందరూ ఆశ్చర్యపోయారు. దమయంతి తన అనుమానం నిజమనే నిశ్చయానికి వచ్చింది. ఋతుపర్ణుని హఠాత్తురాక భీమరాజుకు అర్ధంకాలేదు. అయినా యింటికివచ్చిన అతిధిని వెంటనే అడుగకూడదని సంశయిస్తూ, అతిధి మర్యాదల తరువాత, మెల్లగా తమరిరాకకు కారణం తెలుసుకోవచ్చునా ? అని మాత్రం అడిగాడు.
ఋతుపర్ణుడు యెంతో తెలివైనవాడు, సంయమనం కలవాడు. భీమరాజు తనకు వర్తమానం పంపలేదని, దమయంతీ పున:స్వయంవర చాయలేమీ కనబడడం లేదనీ గ్రహించాడు. కారణం అదేతెలుస్తుందిలే అని అనుకుని, 'వేరే కారణం యేమీలేదు మహారాజా ! ఇటుగా పోతూ తమను దర్శించుకుని పోదామని వచ్చాను.' అని మాత్రం అన్నాడు.
ఋతుపర్ణుని సమాధానం అంత సంతృప్తికరంగా లేకపోయినా, అంతదూరం నుంచి వచ్చాడు కదా అని విశ్రాంతి ఏర్పాట్లు చేయించాడు, భీమరాజు. దమయంతి ఋతుపర్ణునితో ఇంకెవరెవరు వచ్చారో, తెలుసుకుని, కేశిని అనే తన చెలికత్తెను, బాహుకుని చేష్టలను, మాటలను కనిబెట్టి చూస్తూ వుండవలిసినదిగా హెచ్చరించింది. ముఖ్యంగా అతను పాకశాలలో వున్నప్పుడు ప్రవర్తించే విధానం కనిబెట్టమని చెప్పింది. అశ్వవిద్య పరీక్ష ముగిసింది, ఇక పాకశాస్త్ర పరీక్షలో కావలసిన సమాచారం దొరికితే, అతడే నలుడని ఖచ్చితంగా గుర్తించవచ్చని, దమయంతి ఆశ.
కేశినికి తాను చూసి అచ్చెరువొంది, సేకరించిన సమాచారం దమయంతి కి తెలియజేసింది. ' అమ్మా ! బాహుకుని తీరు బహు ఆశ్చర్యకరంగా వున్నది. అతనికి అతీంద్రశక్తులేవో ఉన్నట్లు అనుమానమొస్తున్నది. అతడు యెంత చిన్నద్వారం గుండా, వెళ్లప్రయత్నించినా, ఆయనకు తలవంచవలసిన అవసరం లేకుండా, ద్వారమే పెద్దదిగా అవుతున్నది. బాహుకుడు ద్వారం దాటగానే, మళ్ళీ కుంచించుకుని సాధారణ పరిమాణం లోనికి వస్తున్నది. ద్వారమే కాదు, ఎట్టి యిరుకైనప్రదేశాలు కూడా, బాహుకుడు అంతదూరంలో వుండగానే, విశాలమై, దారి యిస్తున్నవి. ఇక ఖాళీ కుండలో బాహుకుడు దృష్టి సారించగానే, కుండ జలధారతో నిండిపోతున్నది. గడ్డిపోచ సూర్యునికి చూపించగానే, అగ్ని రగులుతున్నది. యెంత మండుతున్న వస్తువు నైనా,బాహుకుడు వట్టిచేతులతో ముట్టుకుంటున్నాడు.' ఇన్నెందుకు, పంచభూతాలు ఆయన నియంత్రణలో వున్నాయేమో అనిపిస్తున్నది. అతడు మామూలు వంటవానిగా అనిపించడంలేదు. ' అని అమితాశ్చర్యంతో ఆవిషయాలను కేశిని వివరించింది దమయంతికి.
' కేశినీ ! నీవు చాలా అమూల్యమైన సమాచారం యిచ్చావు. నీకు కృతజ్ఞతలు. ఇంకొద్దిగా శ్రమ తీసుకుని, బాహుకుడు తయారు చేసిన వంటకాలను కొద్దిగా రుచికొరకై యెలాగైనా తీసుకునిరా ' అని అడిగింది. కేశినితీసుకునివచ్చిన వంటకాలు రుచిచూసి, ఆతడు నలుడే అని నిశ్చయానికి వచ్చింది, దమయంతి.
వెంటనే, తన యిద్దరు పిల్లలు, ఇంద్రసేనుడు, ఇంద్రదేనను, తీసుకువెళ్లి, బాహుకునికి పరిచయం చేసి, అతని స్పందన చూడమని చెప్పింది, దమయంతి. బాహుకుడు యిద్దరు పిల్లలనూ చూడగానే, తన పుత్రోత్సాహం ఆపుకొనలేక, వారిని దగ్గరకు తీసుకుని భోరున విలపించాడు. అతని వేదనకు కారణమేమని కేశిని అడుగగా, తనకూ అంత వయస్కులైన పిల్లలు వుండేవారని బాహుకుడు చెప్పాడు, కేశినికి.
ఈ విషయమంతా, దమయంతికి చేరవేసింది, కేశిని. ఇప్పుడు తాను నిర్ధారణకు వచ్చిన తరువాత,దమయంతి, తన తల్లిదండ్రులకు అన్నీ వివరంగా చెప్పి, ఒక్కసారి బాహుకుని అంత:పురానికి వచ్చే యేర్పాటుచెయ్యమని అభ్యర్ధించింది.
అంత:పురానికి వచ్చిన బాహుకుని వికృతరూపం చూడగానే,దమయంతికి దుఃఖం ఆగలేదు. తల్లిదండ్రులను పట్టుకుని బిగ్గరగా రోదించింది. అంతలోనే తెప్పరిల్లి, తన ముందున్న కార్యం గుర్తు తెచ్చుకుని, ' బాహుకా ! నీ వెప్పుడైనా యే అపరాధము చెయ్యని, అమాయకంగా నిద్రిస్తున్న భార్యను, నిర్దయగా వదలివెళ్లిన వ్యక్తిని చూశావా ? ' అని అడిగింది. దమయంతి తన మాటలు పూర్తి చెయ్యకుండానే, బాహుకుని నేత్రాలు నీటికుండలై , ధారాపాతంగా వర్షించాయి. దుఃఖంతో అతని ఉదరం కదిలిపోయింది. ఈ దృశ్యం చూడలేక, ఆమె తల్లిదండ్రులు ముఖాలు ప్రక్కకు త్రిప్పుకున్నారు.
' దమయంతీ ! నేనే నలుణ్ణి. కలిపురుషుని ఆగ్రహం వలన మనకు ఈ యెడబాటు కలిగింది. కర్కోటకుని దయవలన నేను కలినుండి విముక్తి కాబడ్డాను. నన్నూ ఒక సంశయం పీడిస్తున్నది, నీ పున:స్వయంవర వార్త విన్నప్పటినుండి. నేను యెట్టి పరిస్థితులలో అలా వెళ్లిపోయానో, వూహించలేక, యిద్దరుబిడ్డలకు జన్మ నిచ్చిన నీవు, మరల స్వయంవరానికి యెలా అంగీకరించావో తెలియక మధనపడుతున్నాడు. నన్ను యింకా దురదృష్టం వెంటాడుతూనే వున్నది. నేను అధర్మపరుడను కాను. కానీ విధి నన్ను అడుగడుగునా శిక్షిస్తూనే వున్నది. ' అని దమయంతితో తన బాధ చెప్పుకున్నాడు, నలుడు.
నలుని మాటలకు దమయంతి కంపించిపోయింది. ' నలమహారాజా ! నీవు దేవతల నుండి సందేశం తెచ్చినన్ను వారిలో ఒకరిని వివాహమాడమని చెప్పినప్పుడే నా అభిప్రాయం చెప్పాను. దేవతలని కాదన్న మీ దమయంతి, అన్య పురుషులను యెందుకు మనువాడుతుంది ? మీరు పర్ణాదుడు అనే విప్రునితో మాట్లాడిన తీరుచూసి, నేనూ, నా తల్లిగారు మీ వునికిని గ్రహించి, చేసిన ఉపాయము, ఈ పున:స్వయంవరం. నా హృదిలో యింకెవరూ స్థానం పొందలేరు, మీరు తప్ప. నా మాటలు సత్యవాక్కులని దేవతలే మీకు చెబుతారని, నేను నమ్ముతాను. ' అని అనేక విధాల దమయంతి నలుని ఓదార్చింది.
అంతలో, అశరీరవాణి కూడా, దమయంతి మాటలకు అనుగుణంగా, " నలమహారాజా ! దమయంతికి యేపాపమూ అంటదు. మేము గత మూడుసంవత్సరాలుగా, దమయంతిని కంటికి రెప్పలాగా కాపాడాము. ఈమె అగ్నిపునీత.' అని వాయుదేవుని ద్వారా అశరీరవాణి పలికింది. దేవతలు పుష్పవృష్టి కురిపించి, దుందుభువులు మ్రోగించారు.
ఇక సమయామాసన్నమైందని, కర్కోటకుడు తనకు అనుగ్రహించిన దివ్యమైన వస్త్రాన్ని నలుడు వొంటిపై కప్పుకున్నాడు. వెంటనే, ఇంద్రసమాన తేజస్సుతో నలమహారాజు తన సహజ సౌందర్యంతో వెలిగిపోయాడు. దమయంతి నలుని నిజరూపంలో కనులారా చూసుకుని పులకించిన హృదయంతో, ఆనందబాష్పాలు రాలుస్తూ, తన భర్తను, గర్వంగా తల్లిదండ్రులకూ, సంతానానికి చూపిస్తూ మురిసిపోయింది.
ఆ తరువాత, ఋతుపర్ణమహారాజు, నలుని తనవద్ద వుద్యోగిగా వుంచుకున్నందుకు క్షమింపమని కోరగా, మీరు నాకు నీడనిచ్చి మేలుచేశారు, మీ తప్పిదమేమీ లేదని నలుడు ఋతుపర్ణుని ఆలింగనం చేసుకున్నాడు. తిరిగి నిహిధరాజ్యానికి బయలుదేరి నలమహారాజు పుష్కరునితో, పాచికలాడి, తన రాజ్యాన్ని తాను దక్కించుకుని ప్రజల హర్షధ్వనాలమధ్య ఆనందంగా రాజ్యాభిషిక్తుడైనాడు. ప్రజలను కన్నబిడ్డలలాగా పాలిస్తూ, అనేక యజ్ఞ యాగాలు నిర్వహించి దేవతల, ప్రజల మన్నన చూరగొన్నాడు, నలమహారాజు. నలదమయంతుల దాంపత్యం, అన్యోన్యత అన్నిలోకాలకూ ఆదర్శంగా నిలిచింది.
అని నలదమయంతోపాఖ్యానాన్ని, యెంతో హృద్యంగా, బృహదశ్వడు ధర్మరాజుతో చెప్పాడని, వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు.
ఈ ఉదంతం చెప్పిన తరువాత, బృహదశ్వడు, ' ఇప్పుడు చెప్పు ధర్మరాజా ! నీవు నలమహారాజు కంటే దురదృష్టవంతుడవు అనుకుంటున్నావా ? నీకు కనీసం నీ భార్యా సోదరులతోడు వున్నది, బ్రాహ్మణ సమూహం మీతో వున్నది. కష్టాల కడలిలో నీవు ప్రయాణిస్తున్నప్పుడు., కష్టమైనా, సుఖమైనా మీరందరూ కలసి అనుభవిస్తున్నారు. కాబట్టి, నిరాశ నిస్పృహలకు లోనుగాక కర్తవ్యోన్ముఖునివి కమ్ము. ' అని నిత్యపూజల నిమిత్తం స్నానానికి వెళ్ళాడు.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి