11, నవంబర్ 2020, బుధవారం

భజగోవిందం

**దశిక రాము**


**మోహముద్గరః**


(భజగోవిందం)


18) 


సుర మందిర తరు మూల నివాసః 


శయ్యా భూతల మజినం వాసః |


సర్వ పరిగ్రహ భోగ త్యాగః


కస్య సుఖం న కరోతి విరాగః ||


వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడుతున్నాయి?

ప్రతి మానవుడూ ఏవో కర్మలను చేస్తూ ఉంటాడు. మమకారంతో, కోరికతో, రాగద్వేషాలతో ఇలా కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు; కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. ఐతే మానవుడు బండరాయి కాదు గదా! ఏ పనీ చేయకుండా ఉండడానికి. కనుక పని చేయాల్సిందే. ‘కుర్వన్నే వేహ కర్మాణి’ - ‘ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే’ అని ఈశావాస్యోపనిషత్ చెబుతున్నది. ‘నహికశ్చిత్ క్షణ మపి జాతు తిష్టత్య కర్మకృత్’ - ‘కర్మలు చేయకుండ ఒక్క క్షణం కూడా ఉండే వీలులేదు’ అంటూ భగవద్గీత బోధిస్తున్నది. కనుక కర్మలు చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? కోరికలు లేకుండా, నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా - కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవదార్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావం లేకుండా, నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు క్రొత్త వాసనలు చేరుకోవు. కర్మఫలాలు కూడా నీకు అంటవు. 'ఇలా చెయ్యాలి' అంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మనస్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంతకాలం ఈ పుట్టటం - చావటం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే. 

  పుడితే ఏమిటి నష్టం? పుట్టేటప్పుడు ఏడుపు. పెరిగేటప్పుడు ఏడుపు. రోగాలొస్తే ఏడుపు. ముసలితనం వస్తే ఏడుపు. కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు. నీది అనుకున్నది నిన్ను విడిపోతే ఏడుపు. చివరకు మరణించేటప్పుడు అయ్యో! అన్నింటిని, అందరిని వదలి పోతున్నామే అని ఏడుపు. ఆ అవ్యక్తలోకాల్లో ఎన్ని కష్టాలు పడాలో, ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు. 

  ఇక మళ్లీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి. అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి. అక్కడ ఉండటానికి చాలా ఇరుకు. సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి . జుగుప్సాకరమైన రక్తం, చీము, మాంసం మొదలైన పదార్థాలతో నివాసం. ఇక ఉండటం కూడా తలక్రిందకు మోకాళ్ళకు ఆని ఉంటుంది. అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. దుర్భరం, బాధాకరం. అది గర్భనరకం. 

  ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్ధరించుకోవాలి. మనకు సాధ్యమా ఇది? మన శక్తి సరిపోతుందా? చాలదు. కనుక పరమాత్మను ఆశ్రయించాలి. ఓ ప్రభూ! ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి. భగవంతునితో తాదాత్మ్యం చెందాలి. ఆయనను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు. 

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: