11, నవంబర్ 2020, బుధవారం

మహాభారతం

 **దశిక రాము**


**మహాభారతం**


125 - ఉద్యోగపర్వము


శ్రీకృష్ణుని సహాయం:


హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దూర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూర్చుంటే  తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరువాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. సుయోధనుడు ముందుగా ”కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను. అందుకు శ్రీకృష్ణుడు ”సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునుని చూసాను; మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన ” నారాయణ ” నామంగల పదివేల మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం ” అన్నాడు. వెంటనే అర్జునుడు ” నాకు శ్రీకృష్ణుడు కావాలి ” అన్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించి పది వేల సైన్యం తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. బలరాముడు ” సుయోధనా! అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్ధించాను. అందుకు కొందరు వ్యతిరేకించారు. నాకు కృష్ణుడంటే అభిమానం. అందుకని  నేను ఏమి అనలేక పోయాను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను ” అన్నాడు. సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.


శ్రీకృష్ణుడు ” అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి ” అన్న్నాడు. అర్జునుడు ” కృష్ణా నిన్ను యుద్ధంలో గెలువగల మొనగాడెవడు. నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కనుక నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మాకు పక్క బలంగా ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సారధ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు ” అన్నాడు. శ్రీ కృష్ణుడు ” అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారధ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద ” అని అర్జునినితో ఉపప్లావ్యం చేరాడు.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: