11, నవంబర్ 2020, బుధవారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


127 - ఉద్యోగపర్వం


బ్రాహ్మణుని మాటలు విన్న భీష్ముడు లేచి " పాండవులు శ్రీకృష్ణునితో కలసి ఉండటం వారు శాంతియుతంగా సమస్యా పరిస్కారానికి దారులు వెదకడం అదృష్టం. మీ మాటలు వినడానికి కొంత కటువుగా ఉన్నా ఆమోదయోగ్యం. పాండవులు అనుభవించిన కష్టాలు మనందరికి తెలుసు. కనుక వారిని సగౌరంగా పిలిచి వారి రాజ్య భాగాన్ని ఇవ్వడం సముచితం. కాని పక్షంలో ఆగ్రహించిన అర్జునిని బాణాగ్నికి సర్వం ఆహుతి కాక తప్పదు " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు లేచి " అందరికి తెలిసిన విషయాన్ని మాటి మాటికి ప్రస్తావించడం వ్యర్ధం. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు ధర్మరాజు సకలము ఓడాడు. ఇందులో అపరాధం లేదు. అనుకున్న ప్రకారం అజ్ఞాత వాసం ముగియకనే రాజ్యభాగం కోరడం తప్పు. విరాటుడు, ద్రుపదుడు సహాయంగా ఉన్నారని రాజ్యభాగం అడగటంలో ఏమి న్యాయం ఉంది? ఇంత అన్యాయం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? " అన్నాడు. అందుకు భీష్ముడు బాధపడుతూ " కర్ణా! ఏమిటిది? పెద్ద వీరుడి మాదిరి మాట్లాదుతున్నావు. గోగ్రహణంలో అర్జునుడు మనందరిని గెలిచాడు. ఇప్పుడు నువ్వు మాటలతో గెలుస్తున్నావు. గోగ్రహణ సమయంలో సుయోధనునికి నేను అజ్ఞాత వాసం ముగిసిందని చెప్ప లేదా ఇప్పుడు మరలా ఆ ప్రస్తావన ఎందుకు ? " అని కోపంగా అన్నాడు. దృతరాష్ట్రుడు భీష్ముని శాంతింప చేసాడు " విప్రోత్తమా! మీరు చెప్పింది సావధానంగా ఉన్నాను. తగు విధంగా ఆలోచించి మేము ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట తెలియచేస్తాము. మీరు వెళ్ళి రండి " అన్నాడు.


#సంజయుని సంధి కొరకు ఉపప్లావ్యం పంపుట:


దృతరాష్ట్రుడు సంజయుని పిలిచి " సంజయా! పాండు రాజకుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో వారితో అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకున్నందుకు అభినందిస్తున్నాని చెప్పు. సుయోధనుడు వివేచనా శూన్యుడు కనుక ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుపుము. ధైర్యవంతులు, ఉత్సాహవంతులు అయిన పాండవుల దోషం ఏమీ లేదని చెప్పు. పాలు, నీళ్ళ లాగా అన్నదమ్ములను కలిసి ఉండమని చెప్పు. వారు వారి తండ్రి రాజ్యభాగానికి అర్హులని చెప్పు. పాండవులు మనలను అసత్యవాదులని  నమ్మరు. కాని ధర్మాత్ముడైన ధర్మరాజుకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండలేము కదా. మేము గర్వించి ఇవ్వకున్న శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు ముల్లోకాలను క్షోభపెట్టగలడు. భీముని తలచిన దడ పుడుతుంది. నకుల, సహదేవుల పరాక్రమం సామాన్యం కాదు. ద్రుపద, సాత్యకులు తక్కువ వారు కాదు. వారి మిత్రులు కేకయ రాజు, పాండ్యుడు ఎవరికీ తీసి పోరు. ఇక ధర్మజుని ఆగ్రహం ఎదుర్కొనుట రుద్రునికైనా సాధ్యం కాదు. కనుక ధర్మజుని వద్దకు వెళ్ళి అతని తమ్ములకు ఆగ్రహం కలుగకుండా ప్రీతి కలిగేలా మాట్లాడు. శాంతి కలిగేలా మాట్లాడి కార్యం సఫలం చేసుకుని రా " అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: