19, సెప్టెంబర్ 2020, శనివారం

శృంగేరి స్థల పురాణం

శృంగేరి శారదాపీఠము

శ్రీశంకరులు తమ శిష్యులతో ఒకసారి తుంగానదీ తీరంలో సంచరిస్తూండగా ఒక దృశ్యం వారిని అబ్బుర పరిచింది. ఎండ వేడిమిని భరించలేక ఒక కప్ప అలమటిస్తుండగా, ఒక పాము పడగ విప్పి కప్పకు ఉపశమనము కలిగిస్తున్న దృత్యాన్ని చూసిన శంకరులు విస్మయానికి లోనయ్యారు. కప్ప సహజంగా పాముకు వైరి, ఆహారము. అయితే సహజ వైరాన్ని మరిచి పాము కప్పకు సహాయం చేస్తుండడము పూర్తిగా స్థల మాహాత్మ్యమే అని ఆయన గుర్తించారు.

ఇక తాను స్థాపించదలచిన పీఠాల్లో మొదటి పీఠాన్ని స్థాపించేందుకు సముచితమైన ప్రదేశం ఇదేనని నిర్ణయించి, అక్కడే ఒక శిలపై శ్రీ చక్రాన్ని లిఖించి సరస్వతీ మాతను, తల్లీ! శారద అనే పేరుతో ఈ ప్రదేశంలో స్థిరనివాసాన్ని ఏర్పర్చుకుని భక్తజనులను అనుగ్రహించాలని శంకరులు ప్రార్ధించారు. సరస్వతీ దేవి శంకరుల ప్రార్ధనను అంగీకరించి అనుగ్రహించింది. ఈ విధంగా శ్రీశారదాదేవిని ప్రధాన అధిష్టాన దేవతగా శంకరులు ప్రతిష్టించారు. శంకరులు నాడు స్థాపించిన పీఠమే శృంగేరి శ్రీ శారదాపీఠంగా ప్రసిద్ధమైంది. సంప్రదాయాన్ని అనుసరించి ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠంగా పిలుస్తారు.

శ్రీశారదాపీఠానికి ప్రధాన వేదంగా యజుర్వేదాన్ని శంకరులు నిర్ణయించారు. ప్రదత్తమైన శ్రీ చంద్రమౌళీశ్వర సృటిక లింగాన్ని, శ్రీ రత్నగర్భ గణపతి విగ్రహాన్ని, మహామేరు యంత్రాన్ని నిత్యపూజకోసం శంకరులు అనుగ్రహించారు. మహామహిమాన్వితాలైన ఈ విగ్రహాలు పన్నెండు వందల ఏళ్ళుగా నేటికీ పీఠంలో పూజలు అందుకుంటున్నాయి. ఈ పీఠాన్ని నెలకొల్పిన తర్వాత శృంగేరీ క్షేత్ర రక్షణకై నాలుగు దిశల్లో నలుగురు దేవతలను క్షేత్రపాలకులుగా ఏర్పాటుచేశారు. తూర్పున కాలభైరవుడు, పడమర అంజనేయుడు, ఉత్తరాన కాళికాంబ, దక్షిణాన వనదుర్గా దేవిని శంకరులు స్వయంగా ప్రతిష్టించారు.

సాక్షాత్తు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని అవతారమూర్తులైన తమ ప్రియశిష్యుడు సురేశ్వరాచార్యులను శ్రీ శారదాపీఠం నిర్వహణకోసం ప్రధామాచార్యులుగా శంకరులు నియమించారు. ఈ పీఠం సుస్థిరంగా వర్ధిల్లుతుందని, భవిష్యత్తులో ఈ పీఠానికి అచార్యులుగా వెలుగొందేవారందరూ తమ అంశకలిగి ప్రకాశిస్తారని శంకరులు ఆశీర్వదించారు. ఆ మహనీయుని దివ్యవచనం మేరకు శృంగేరీ శ్రీశారదాపీఠం జగద్గురు పరంపర అపూర్వ విశిష్టతకు నిలయంగా విరాజిల్లుతోంది. సురేశ్వరాచార్యుల తర్వాత జగద్గురువర్యులుగా ఈ పీఠంలో విలసిల్లిన మహానీయులందరూ జ్ఞానమునులైన కరుణా సముద్రులు, మహా పండితులు. ఆదిశంకరుల దైవాంశ సంభూతులైన ఈ ఆచార్యులను స్వయంగా శ్రీ శంకరాచార్యులుగా ఆరాధించడం ఆనవాయితీ. ఈ అనుపమాన పరంపరలో 36వ శంకరాచార్యులుగా జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహస్వామివారు ప్రస్తుతం పీఠం ఆచార్యవర్యులుగా విరాజిల్లుతూ భక్తజనులను తమ కరుణా పూర్ణ దృక్కులతో జనులను అనుగ్రహిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: