19, సెప్టెంబర్ 2020, శనివారం

నాగులచవితి

 నాగులచవితి నాడు పాముల పుట్టవద్ద దీపాలు వెలిగించాలా?

కార్తీక శుద్ధ చవితి నాడు నాగులచవితి పండుగ వస్తుంది. ఈరోజు స్త్రీలు పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు, నువ్వులు తో చేసిన చిమ్మిలి ఉండలు నాగదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆరోజున సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని ఆకారంలో నక్షత్రం కన్పిస్తుంది. దీపావళి నుండి ఐదవరోజున నాగపంచమి పర్వాన్ని జరుపుకుంటారు. నాగేంద్రస్వామికి పుట్టలో పాలు పోయడం మన అలవాటు. పిల్లలు తో ఈవిధంగా పాలు పోయించడం వలన వారికి ఎలాంటి అనారోగ్యాలు, అరిష్టాలు లేకుండా ఎదుగుతారని విశ్వాసం. పుట్టల కొనలలోంచి ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు జారవిడిచి పుట్టలో కొలువైన నాగదేవతకు పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెడతారు. ముందు పుట్టవద్ద శుభ్రం గా చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ లు పూలు చల్లి పూజ చేస్తారు. ఆ తర్వాత నాగేంద్రుడికి నైవేద్యం పెడతారు.

            నైవేద్యం పెట్టడానికి ముందు గా పుట్టకు పూజ చేస్తారు. పూజా విధానం లో దీపం వెలిగించడం, ధూపం తప్పనిసరిగా కాబట్టి దీపారాధన కూడా చేస్తారు. పాముల పుట్ట వద్ద టపాకాయలు వెలిగించడం వంటివి మాత్రం చేయకూడదు.

         వర్షాకాలం పూర్తయి శీతాకాలం ప్రవేశిస్తూంటే పాములు వరుసగా పుట్టలు వదిలి బయటకు రావడం ప్రారంభిస్తాయి. అలా వచ్చే పాముల ను అదుపులో ఉంచేందుకు పుట్టలో తేమ ఉంచేందుకు మనవారు నాగులచవితి పండుగను ఏర్పాటు చేసారు. ఆరోజున పాలు, చిమ్మిలి వంటివి పోయడం వలన పాముల పుట్టలు తడిగా మారతాయి. దాని వలన పాములు త్వరగా బయటకు రావు. స్త్రీలకు, పిల్లలు కు పాముల పట్ల భయం ఉండేందుకు నాగులచవితి పర్వదినం ఉపయోగపడుతుంది.

కామెంట్‌లు లేవు: