19, సెప్టెంబర్ 2020, శనివారం

*ఇంటింటి బ్రహ్మోత్సవాలు*

 


తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకారం చుట్టిన బ్రహ్మాండ నాయకుడి అద్భుత బ్రహ్మోత్సవ వేడుకలు నేడే ఆరంభమవుతున్నాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే వార్షిక ఆవిర్భావ దినోత్సవాలు. శ్రీవారికి ఏటా జరిగే సుమారు 450 సంబరాల్లో ఇవే తలమానికాలు.


శ్రీ మహావిష్ణువు కన్యా మాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీ వేంకటపతిగా, శ్రీ స్వయంభువు మూర్తిగా ఆవిర్భవించాడని తిరుమల స్థల పురాణం చెబుతోంది. ‘వేంకట’ శబ్దానికి ‘సమస్త పాపాలను దహించేది’ అంటూ భవిష్యోత్తర పురాణం వ్యాఖ్యానం చేసింది. శ్రీవారి జన్మదిన వేడుకలను తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడు కాబట్టి వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అనడం పరిపాటి.


ధ్వజం అంటే జెండా! బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా విజయకేతనం ఎగురవేయడాన్ని ‘ధ్వజారోహణం’ అంటారు. వెండివాకిలి ఎదుట ధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఆవిష్కరించి- విద్యాధర, సిద్ధ, సాధ్య, యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వాదులను, దేవతాసమూహాలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. గరుడోత్సవంలో ప్రత్యేక అలంకారాలు విశేష ఆకర్షణలుగా నిలుస్తాయి. ‘ఆనందనిలయం’లో మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకర కంఠి, సహస్రనామ హారం సహా ఎన్నో అమూల్య వజ్రాభరణాలను మలయప్పస్వామికి గరుడోత్సవం నాడే అలంకరించి ఊరేగిస్తారు. ఇక దేవేరులతో శ్రీవారు ఠీవిగా రథంలో విహరించేది తొమ్మిదో రోజున! శ్రీ వరాహస్వామి ఆలయప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి అభిషేకం, సుదర్శన భగవానుడికి స్వామిపుష్కరిణిలో పవిత్రస్నానం, గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.


గతంలో బ్రహ్మోత్సవాలకు హాజరైనప్పుడు సప్తగిరి శిఖరాలనుంచి జాలువారే సెలయేటి బిందువులన్నీ పవిత్ర తీర్థ జలాలై, మన భౌతిక మానసిక కక్ష్యలను ప్రక్షాళన చేసేవి. మాడవీధులను చుట్టుముట్టే ప్రతి గాలి తునకా అన్నమయ్య పాటమొలకై శ్రవణానందాన్ని కూర్చేది. దేహానికి బయటి, లోపలి ఆవరణలన్నింటా వినూత్న ఆధ్యాత్మిక చైతన్య విభూతి ఆవరించేది. జన్మజన్మాంతర దోషాలను సమూలంగా దహించేది. ‘అదివోఅల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము...’ అంటూ వినసొంపుగా వినవచ్చే గానామృతం మరోవైపు ఆధ్యాత్మిక కక్ష్యను ఆప్యాయంగా అభిషేకించేది. అలా మూడు ఆవరణలు శుద్ధి అయిన మనకు తిరుమల క్షేత్ర విలక్షణ కాంతి పరివేషం- అన్నమయ్య చెప్పిన ‘సువ్రతస్థితి’ని అనుగ్రహించేది. ఆ స్థితిలో స్వామివారి దివ్య మంగళ దర్శనంతో భక్తుడి జన్మ ధన్యమైపోయేది.


తిరుమలలో బ్రహ్మోత్సవాలను తిలకించడమంటే జన్మ చరితార్థమేనని భక్తులు భావిస్తారు. కానీ ఈఏడాది మాత్రం కాలం కలిసి రాలేదు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే పరమ భక్తులకు సైతం ఈసారికి ప్రత్యక్ష ప్రసారాలను తిలకించి, పులకించి తరించవలసిన పరిస్థితి ఏర్పడింది.


స్వామి భక్తసులభుడన్న విషయం మరచిపోకూడదు. తన వద్దకు రాలేని భక్తుల కోసం శ్రీవారే దిగివచ్చి గుండెల్లో కొలువు తీరినట్లుగా భావించి దర్శించి సరిపెట్టుకోవలసిన సందర్భమిది. ఈ ఏడాది వీటిని ‘ఇంటింటి బ్రహ్మోత్సవాలు’ గాను, హృదయావిర్భావ దినోత్సవాలు గాను భావించాలి. ఈ పదిరోజులూ మన ఇల్లే తిరుమల కావాలి. మన హృదయాలు ఆనంద నిలయాలుగా మారాలి. ఆరాధనలు విలక్షణంగా సాగాలి. గుండె గుడిలో శ్రీవారిని దర్శించుకొని తృప్తిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి.

కామెంట్‌లు లేవు: