19, సెప్టెంబర్ 2020, శనివారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఐదవ శ్లోక భాష్యం - మూడవ భాగం


అలా అర్థరహితమైన జీవితాలు గడిపిన వారందరూ ఎల్లప్పుడూ అలాగే ఉండిపోరు. మన మతం నిరంతరమైన నరకాన్ని ఒప్పుకోదు. మధ్వాచార్యులవారు దానికి తుల్యమైన భావాన్ని వెలువరించారు. ప్రజలలో పాపభీతి కలిగించి సన్మార్గ వర్తనులుగా చేయాలన్నది వారి ఉద్దేశ్యంగా మనం గ్రహిద్దాం. మహాపాపికి కూడా ఒకానొక సమయంలో ముక్తి లభిస్తుందని మన సాధారణమైన విశ్వాసం. యుగాల కాలం పట్టవచ్చు. కానీ అంబిక తన చెడిపోయిన పిల్లలను తన ఒడిలోనికి తీసుకొని నిశ్చయంగా సద్వర్తనులను చేసి ముక్తినిస్తుంది.


యుద్ధం కోసమొక రాజుగారు రాజప్రాసాదాన్ని విడిచి వెళ్ళారు. అక్కడ ఏకాంతంలో ఎవరో ఒక పౌరులు ఆయనకు సహాయం చేశాడు. లేదూ ఈతడికే ఆ పౌరునిపై అకారణమైన దయ కలిగింది. రాజప్రాసాదంలోకి వచ్చి తనను కలుసుకోమన్నాడు. “నా వంటివాణ్ణి రాజభవనంలోనికి రానీయరు కదా – రాజముద్ర ఏదైనా ఉంటే ప్రసాదించమ”న్నాడతను. రాజుగారు ఓ ముద్రిక ఇచ్చారు. పరిశీలించి చూస్తే అది శత్రురాజు యొక్క రాజముద్రిక. ఆ పౌరుడు తికమక పడ్డాడు.


రాజుగారు నవ్వుతూ శత్రురాజు రాజముద్రికను ఎందుకిచ్చారో చెప్పాడు. “చాలామందికి నేను రాజముద్రిక నిచ్చాను. అట్లాంటి వాళ్ళు పెద్దవరుసలో నించొని ఉంటారు. నువ్వావరుసలో చేరితే నిన్ను తొందరగా కలుసుకోవాలన్న ఉద్దేశ్యం నెరవేరదు. అందుకే నీకీ శత్రురాజు రాజముద్రికనిచ్చాను. ఇది అతని గూఢచారులను పట్టుకొన్నప్పుడు మా చేతబడింది. దీనిని దాచుకొని నా దగ్గరకు దొంగతనంగా వస్తున్నట్లు నటించు. ఆ అంగరక్షకులకు అనుమానం కలిగేలా ప్రవర్తించాలి. వాళ్ళు నిన్ను పట్టుకొని, సోదాచేసి, శత్రురాజు రాజముద్రిక ఉన్నందున నేరుగా నావద్దకు తీసుకొని వస్తారు.” 


అంబిక చేసేది ఇటువంటి పనే! కామక్రోధములనేవి శత్రురాజు రాజముద్రిక వంటివి. కృష్ణపరమాత్మ కుంతీ దేవిని నీ కోర్కె ఏమిటో చెప్పు అన్నాడు. “నాకు కష్టాలు రావాలి. అవి ప్రసాదించు. అప్పుడే నిన్ను నేను తలుచుకుంటాను” అన్నది. కష్టాలు ఎలా వస్తాయి ?? కామక్రోధాదుల చేత. వాటిచే బాధించబడినపుడు, ఫలితంగా కష్టబడేటపుడు, మనకు దేముడు గుర్తుకు వస్తాడు. ఆయనను ప్రార్థిస్తాం. అప్పుడు ఈ జగత్సృష్టి, కామక్రోధములు ఎంత ఉపయోగకరమైనవో గుర్తిస్తాం.


అంబిక ఒకనికి కామాన్ని కలిగించిందంటే కారణం అతడిపై కరుణ చూపే అవకాశం తనకు కలగడానికే!! ఈ ఏర్పాటు. ఆ వ్యక్తితోనే అంతరించదు. అతడి కామం వలన జనించిన పుత్రులపైన కూడా ఈ కరుణ ప్రసరిస్తుంది. మహాత్ములు మరింకో జన్మవద్దని ఆక్రోశిస్తారు. కానీ ఈ కామంచేత జనించిన అనేకమందికి అది ఆశీస్సుగా పరిణమిస్తోంది.


మరింకో జన్మ వద్దని మరి పోగులు పోగులుగా కర్మననుభవించ వలసినవారు జన్మవద్దంటే తీరుతుందా ? వారి శేషకర్మను అనుభవించడానికి జన్మించి తీరవలసిందే! ధర్మయుతంగా జీవించవలసిందే!! ఎవరికీ కామం లేకపోతే ఈ కర్మలను అనుభవించవలసిన వారు పుట్టేదెలా?? తమ కర్మ భారాన్ని వదిలించుకొనేదెలా ?? వారికి కర్మను వారనుభవించి ధర్మయుతంగా జీవించడానికి తద్వారా నైష్కర్మ్యాన్ని పొందడానికి ఒక అవకాశం ఈయబడింది. ఆ జన్మలో కూడా వారి పాతకర్మలను తుడిచివేసుకోగా కొత్త దుష్కర్మలను చేర్చుకుంటే దానికి ఎవరేం చేయగలరు ?? జన్మకు ప్రయోజనం ఇంకో జన్మ కలగకుండా చేసుకోవడానికి ప్రయత్నించడం. మనమీ సత్యమెరిగి తదనుగుణంగా వర్తించాలి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: