శ్లో:- యౌవనం ధనసంపత్తి: ౹
ప్రభుత్వ మవివేకితా ౹
ఏకైక మప్య నర్థాయ ౹
ఏకత్ర కిము ఉచ్యతే ౹౹
***
భా:- మానవుడు బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశలను సరియైన దిశానిర్దేశంలో సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా యువత గాడి తప్పి, చెడి పోయేలా చేయడానికి 1. నిండు యౌవనము, 2.పుష్కలమైన ధనసంపద,3. తిరుగులేని అధికారము,4.తెలివితక్కువతనము అనే యీ నాలుగింటిలో ఒకటి మాత్రమే చాలు. ఉరుకులు, పరుగులు తీసే వయసులో ఆవేశమే కాని ఆలోచన, నిదానము, నిబ్బరము ఉండవు. అవసరాలకు మించిన డబ్బు వ్యసనాలకు బానిసను చేసి, అథోగతి పాలుచేస్తుంది. అంగ,అర్థబలాలతో అదిరిపడుతూ, కనుసన్నలతో చేయకూడని పనులను కూడ చేయించి తీరగల అడ్డు,అదుపు లేని అధికారము ప్రమాదాలు, సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒకరు చెబితే వినక, తనకు తోచక చేసే మితిమీరిన తెలివి తక్కువ పనుల వల్ల ఇంటా-బయటా నవ్వులపాలు కావలసి వస్తుంది. ఒకటి ఉంటేనే ఇలా ఉంది. ఇక ఈ నాలుగు ఒకరిలోనే ఉంటే జరిగే విపత్తు ఇక వేరే చెప్పనవసరము లేదని భావన. తల్లిదండ్రులుగా బిడ్డలను విద్యాబుద్ధులతో తీర్చిదిద్దుతూ, నడవడిని నియంత్రిస్తూ ,ఉన్నత శిఖరాలను అధిరోహించేలా, తమ వంతు ప్రయత్నం తాము చేయాలని, వ్యసనాల బారిన పడకుండా సంరక్షించుకోవాలని సారాంశము.
***
సమర్పణ : పీసపాటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి