19, సెప్టెంబర్ 2020, శనివారం

రామాయణమ్.67

 

..

కైకా ! నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్ధిస్తారనుకొన్నావా?...భరతుడు దశరథుడికి పుట్టిన వాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ వంశములో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు ! తండ్రి తనకు మనఃపూర్వకముగా ఇవ్వనిదానిని తాను స్వీకరించడు! 

.

అంతెందుకు? రాజ్యంలో అన్నలేకపోతే అన్న ఉన్నచోటే రాజ్యమని భరతశత్రుఘ్నులు రాముని వెంటే వెడతారు.

.

నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః

తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి! 

.

రాముడు లేని చోటు అది రాజ్యమే కాదు! రాముడున్న వనమే రాజ్యం .

.

తమ పిల్లపాపలతో జనులంతా రాముని వెంటే కదులుతారు! పాడుపడి,పిచ్చిమొక్కలుమొలిచి నిలిచి ఉన్న నిర్మానుష్యమైన రాజ్యం ,భరత శత్రుఘ్నులు లేక శోభావిహీనమైన అంతఃపురమూ మాత్రమే నీకు మిగులుతాయి. 

.

కైకేయీ ఒక్కసారి బయటకు వచ్చి చూడు ! పశుపక్ష్యాదులతో సహా అన్నీ తమ ముఖాన్ని రాముడున్న వైపే త్రిప్పి వున్నాయి.

.

సీతమ్మకు నారచీరలెందుకు ఇచ్చావు? ఈమె నారచీరలు కట్టవలెనని లేదే అని పలుకుతూ వసిష్ఠులవారు సీతమ్మను నారచీరకట్టుకోవద్దని వారించారు.

.

సీత విషయములో నీవు ఏ నిబంధన విధించలేదుకదా ! 

రాముడి ఆత్మ సీత ఆమె ఇక్కడే ఉండి రాముడి సింహాసనం అధిష్ఠించగలదు ! 

.

అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనమ్....రాముడియొక్క ప్రస్తుతమైన సింహాసనం సీతమ్మ అధిష్ఠించగలదు ! 


...

N.B

..

సీతమ్మ తనకు అత్యంత ప్రియుడయిన తన భర్తను వదిలి ఉండటానికి ఇష్టపడలేదు .తానుగా తరలింది వనవాసానికి.

.

( ఇదీ భారతీయుమ్!)

.

 స్త్రీల కు పూర్వకాలంలో సింహాసనం మీద కూర్చుండి పాలించే అర్హత లేదు ,స్త్రీల ను అణగదొక్కారు. వారిని వంటింటికే పరిమితం చేసేశారు అనే వారు వశిష్ఠ మహర్షి మాటలు దయచేసి గమనించి మాట్లాడండి ! 

.


భారతీయ సమాజం లోని నేటి పోకడలు కూడా తులనాత్మకంగా అధ్యయనం చేయ ప్రార్ధన..

.

లౌకిక దృష్టికి కైక చేస్తున్న పనులలో క్రూరత్వం కనిపిస్తున్నది .

సామాన్యంగా ఆవిడను రాముడికి ఇన్ని కష్టాలు కలిగించినదానిగా భావించి తిట్టిపోస్తాము మనమంతా ! 

ఒక్క క్షణం ఆలోచిద్దాం ! 

ఆవిడ ముగ్గురికీ దుస్తులు సిద్దం చేసింది .ఆవిడ కోరిక మేరకు రాముడొక్కడే వెళ్లాలి .కానీ చిన్నప్పటినుండీ రాముడిని గారాబంగా పెంచినది ఆవిడే ! ఆవిడకు తెలుసు రాముడి నీడ లక్ష్మణుడని ! అన్నని వదిలి ఆయన ఒక్కక్షణం కూడా ఉండడని ! సీతారాముల అన్యోన్య దాంపత్యం చూసిన ఆవిడకు అర్ధమయ్యింది రాముడి ఆత్మ సీతేనని సీతమ్మప్రాణం రాముడేనని! .

మరి మనిషిని అతని నీడ ,ఆత్మ విడిచి ఉంటాయా ! అసంభవమది.

.

ఇక పోతే లోకకంటకుడయిన రావణ వధ జరగాలంటే రాముడి ప్రయాణం మొదలుకావాలి ! తండ్రినుండి విడదీయాలి ! దశరథుడినుండి రాముడిని వేరు చేయగల సమర్ధులు ఎవరు? ఒకరు విశ్వామిత్రుడు! రెండు కైక !

మొదట విశ్వామిత్రుడు తాత్కాలికంగా విడదీసి దివ్యాస్త్రజ్ఞానాన్ని ఇచ్చి రాముడిని రాబోయే సంగ్రామానికి సన్నద్ధుడిని చేశాడు .అది సరిపోతుందా ! సరిపోదు ! రాముడు బయటకు నడవాల్సిందే ! ఇదిగో ఆ పని కైకమ్మచేసింది ! 

రాముడెవరో కైకకు తెలుసు రాముడు నారాయణుడని రామనారాయణుడని! మరి ఈ కోణంలో ఆలోచిస్తే కైక అమృతమూర్తి..)

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: