19, సెప్టెంబర్ 2020, శనివారం

ఒకే హల్లుతో వాక్యాలు

 ఒకే హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. ‘క’ గుణింతంతో.. “కాకీక కాకికి కోక కాక కేకికా?”- కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?” అని దీనర్ధం. అలాగే న గుణింతంతో ఓ పద్యం:


నానా నన నా నున్న న

నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై

నానీ నను నానా నను

నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!


అని లక్షణకారుడు చెబితే మరో తుంటరి నూనె అనే ఒక్క మాటతో గిలిగింతలు పెట్టాడు . ఇలా…”నా నూనె నీ నూనా? నీ నూనె నా నూనా? నా నూనె నీ నూనని నేనన్నానా”


మరి శ్రీశ్రీగారు ఊరకుంటారా. మ,న,స అనే మూడక్షరాలతోనే త్యక్షర కందాన్ని రసవత్తరంగా అందించారు.


మనసాని నిసిని సేమా

మనసా మసి మనిసి మనసు మాసిన సీనా

సినిమా నస మాసనమా

సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!


సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనేపదాలతో చమత్కారమందించారు. ఇందులో శ్రీ శ్రీగారు మహాకవిగా కంటె సినిమా కవిగా కనిపిస్తారు.


ఇక ఒక అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి రసజ్ఞుల నలరించారు.


మా పని నీ పని గాదా

పాపను మా పాప గారి పని నీ పనిగా

నీ పని దాపని పని గద

పాపని పని మాని దాని పని గానిమ్మా!!


ఇప్పుడు కొన్ని పద్య చమక్కులు చూద్దాం. ఎటువైపునుండి చదివినా ఒకేలా ఉండడమే కాకుండా అర్థభేదంతో ఉండే అనులోమ-విలోమ పద్యాలు. ఈ పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.


దామోదర సామ తనధ

రామా సరసాకర దశరధ హరి రాధా

కామా సదయాతి పరమ

ధామా వర యాదవకుల దారక రాసా!!


ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.


సారాకర దాల కువద

యారవ మాధామ రపతి యాదస మాకా

ధారా రిహ ధర శదరక

సారస మారా ధన తమసారద మోదా!!


పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.


ధీర శయనీయ శరధీ

మార విభాను మత మమత మను భావి రమా

సారస వన నవ సరసా

దారద సమతార తార తామస దరదా!!


ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. (ఈ ప్రక్రియను ఇంగ్లీషులో Palindrome అంటారు)


రాధా నాధా తరళిత

సాధక రధ తా వరసుత సరస నిధానా

నాధాని సరసత సురవ

తాధర కధ సా తళిరత ధానా ధారా!!

సేకరణ.శ్రీనివాస్

కామెంట్‌లు లేవు: