19, సెప్టెంబర్ 2020, శనివారం

రామాయణమ్.84

 

..

తలచుకుంటూ ఉంటే హృదయం బరువెక్కిపోతున్నది కౌసల్యకు.

తన పుణ్యాలప్రోవు ,తన వరాలమూట జగదేకవీరుడైన రాముడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడనే ఆలోచన ఆవిడ గుండెల్ని పిండివేస్తున్నది ! 

దీనికి కారణం దశరధుడు !

తన భర్తయొక్క అనాలోచిత చర్య !

ఆవిడ బాధ అంతా దశరధుడి మీద కోపంగా మారిపోయింది..

.

రాజా నీకు మూడులోకాలలో కీర్తి ఉండిన ఉండవచ్చు కానీ నీవు చేసిన ఈ తెలివితక్కవ పనివలన అది అంతా తుడిచి పెట్టుకు పోయింది..

.

నీ కొడుకులిద్దరూ నీ పనికిమాలిన కోరిక వలన అడవులపాలైనారే !

కష్టమంటే ఏమిటో తెలియని రాకుమారులు అడవులలో క్లేశాలను ఎలా భరించగలరనుకొని పంపావయ్యా!

.

ఇంత వరకు భక్ష్య,భోజ్య,లేహ్య,చోష్య,పానీయాదులతో బహుపసందైన భోజనమారగించే ఆ జనకుడికూతురు అడవులలో దొరికే నివ్వరిధాన్యాలు,వెదురుబియ్యాలతో ఆకలి ఎలా తీర్చుకుంటుంది?

.

సుప్రభాతవేళలో మంగళవాయిద్యములను శ్రవణానందకరంగా వింటూ నిదురలేచే ఆ రాకుమారి నేడు అడవి అంతా ప్రతిధ్వనించే సింహశార్దూల గర్జనల భయంకరధ్వనికి ఉలిక్కిపడి నిదురలేవాలికదయ్యా! 

ఎంతటి దయమాలినవాడవయ్యా నీవు !  

.

పట్టుపరుపులమీద మెత్తని దిండ్లు తలగడగా పెట్టుకొని హాయిగా నిదురించే నా కుమారుడు నేడు పరిఘవంటి తన బాహువులనే తలగడగా పెట్టుకొని నిదురించాలి గదయ్యా! 

ఎంత తెలివిమాలినపనిచేశావయ్యా!.

.

నీవు సుఖం అనుభవించటానికి నాకొడుకులను సుఖానికి దూరంచేశావు కదా!.

.

రాముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అనుభవించిన రాజ్యలక్ష్మిని తాను తిరిగి చేపడతాడా?

.

ఇంకొక మృగము ముట్టిన ఆహారము పెద్దపులి తాను ముట్టదు .

నరశార్దూలము నా రాముడు!

 వాడు ఇంకొకరిచేత ఎంగిలి చేయబడ్డ కూడు ఆశించడు.

.

ఆత్మాభిమానము కల రాముడు ఈ అవమానం సహించడు.

.

కేవలము తండ్రి అనే గౌరవముతో నిన్ను ఏమీ చేయలేదు.

వాడికోపము ముల్లోకాలను ముంచెత్తగలదు ! 

వాడి బంగరు బాణములు సకలభూతములను ప్రళయకాలములోని అగ్ని లాగా దహించివేయగలవు.

వాడి శస్త్రాస్త్రాలు మహాసముద్రాలనే ఇంకింపచేయగలవు,

వాడు కన్నెర్ర చేస్తే నీవెక్కడ ఉండే వాడివి?.

.

పెద్దపులి తోకను తాకితేనే తాకినవారిని నిలువునా చీల్చివేస్తుంది! ఈ అవమానము నా రాముడు భరింపగలడా?

.

చేపలు తమపిల్లలను తామే తింటాయి అలాగే నీ పిల్లల సౌభాగ్యాన్ని నీవే నాశనం చేశావుకదయ్యా!

.

వాడు ఏ నేరము చేశాడో చెప్పు ?

 ధర్మానికి కట్టుబడి నడుచుకోవటమే వాడి బలహీనత అయ్యింది నేడు !

 ధర్మమూర్తికి ఉత్తపుణ్యానికి రాజ్యబహిష్కరణ విధించి బికారిలాగ ఇంటినుండి వెడలగోట్టావు కదా! 

ఇది శాస్త్ర సమ్మతమేనా?! 

సనాతన ధర్మమేనా? !

.

పడతికి పతి,పుత్రుడు,జ్ఞాతి ఈ ముగ్గురే గతి ! 

మొదటి గతి, నీవా ఉండీ నాకు లేనట్లే

నా కొడుకును చూసుకొని ఉందామంటే వాడిని అడవులపాలుచేశావు! 

అన్ని విధాలుగా నన్ను గతిలేని దానిని చేశావు కదయ్యా అంటూ తన హృదయవేదనను బహిర్గతం చేసింది కౌసల్యామాత!


రామాయణమ్. 85

..

రాణీ కౌసల్య పేల్చేమాటల తూటాలు దశరధుడి హృదయకవాటాలను భేదిస్తున్నాయి.ఆవిడ పలికే ఒక్కొక్క పలుకు ములుకై గుండెలను గుచ్చుతున్నాయి.పాపం ముసలి రాజు తట్టుకోలేక పోతున్నాడు.ఇంద్రియాలు పట్టుతప్పుతున్నాయిమాటిమాటికి మూర్ఛిల్లుతు‌న్నాడు తేరుకుంటున్నాడు.

.

కౌసల్యా ! పూర్వమెప్పుడో నేను చేసిన పాపం నన్ను పట్టిపీడిస్తున్నది.నీ వంటి ధర్మదృష్టిగల వనితాశిరోమణి ,పెద్దచిన్నతారతమ్యము తెలిసినదానవు.నీవు ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ భర్తను నిందించడం నీవంటిదానికి తగునా!.

.

పల్లెత్తుమాట ఏనాడూ తను తన భర్తను అని ఎరుగదు.

 ఈనాడు తనకీ దురవస్థ సంప్రాప్తించినదని ఇన్నిమాటలు అన్నానే ! అని ఒక్కసారిగా ఉబికిఉబికివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ భర్తచేయిని తన తలమీద ఉంచుకొని, రాజా నీవు ఒక్కమాటతో నన్నుప్రాణములేని దానిని చేసి వేశావు గదయ్యా!.

నేను క్షమార్హము కాని అపరాధము చేసినాను.

.

మహారాజా నాకు ధర్మములన్నీ తెలుసు నీవు ధర్మము తప్పని వాడవనీ తెలుసు అయినా నన్ను ఆవరించిన శోకం నాలోని,ధైర్యాన్నీ,విజ్ఞతను,శాస్త్రపరిజ్ఞానాన్నీ, నశింపచేసినదయ్యా.శోకాన్ని మించిన శత్రువు లేదుకదా!

.

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతమ్

శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః

.

శత్రువుకొట్టిన దెబ్బనైనా సహింపవచ్చును కానీ హఠాత్తుగా వచ్చిమీదపడిన శోకాన్ని అది ఎంత చిన్నదైనా కానీ తట్టుకోవడం కష్టం..

.

ఓ వీరుడా ! ధర్మవేత్తలూ,శాస్త్రజ్ఞులు,అన్నిసంశయాలు తొలగిన సన్యాసులు కూడా శోకాన్ని తట్టుకోలేరయ్యా!.

.

ఓ నా ప్రాణనాధా నాప్రియ పుత్రుడు అడవికి వెళ్ళి నేటికి అయిదవరోజు అయినా నాకు అయిదు సంవత్సరములవలే ఉన్నది.రాముడిని తలుచుకుంటున్నకొద్దీ నాలో దుఃఖము కట్టలు తెంచుకొంటున్నదయ్యా!.

.

వీరిలా మాటలాడుకుంటూనే ఉన్నారు .సమయమెంత గడిచిందో ఇరువురికీ స్ప్రుహలేదు.సూర్యకిరణాలవెలుగు మసకబారి రాత్రి వచ్చింది.శోకముతోటే నిద్రలోకి జారుకున్నాడు దశరధుడు.

కామెంట్‌లు లేవు: