19, సెప్టెంబర్ 2020, శనివారం

ఆదిపర్వము – 24

 


మాండవ్య మహాముని వృత్తాంతం


అప్పుడు జనమేజయునకు ఒక సందేహం వచ్చింది.


“వైశంపాయన మునీంద్రా, యమధర్మ రాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు” అని అడిగాడు.


దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


మాండవ్యుడు అనే మహాఋషి ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి, సైనికులు వెంటపడగా పరుగెత్తుకుంటూ అటుగా వచ్చారు. అక్కడ ఉన్న ఆశ్రమం చూసి అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుని చూసి “అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా” అని అడిగారు. మౌన వ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పలేదు.


సైనికులు ఆశ్రమం లో ప్రవేశించి, అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. మాండవ్య మహా మునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహామునిని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు.


రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించారు. సహాయం చేసినట్టు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనప శూలం మీద కూర్చోబెట్టమని శిక్ష విధించాడు. కాని మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక, తపస్సు చేసుకుంటున్నాడు.


ఒకరోజు రాత్రి కొంతమంది మహాఋషులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూసి “ఓ మహర్షీ, మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవ్వరు?” అని అడిగారు.


దానికి మాండవ్యుడు నవ్వి “నా పూర్వ జన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను. దీనికి ఒకరిని నిందించ పనిలేదు” అన్నాడు.


ఈ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని రాజుకు చెప్పారు. రాజుగారు వెంటనే అక్కడకు వచ్చి, మాండవ్యుని కిందికి దించమని ఆజ్ఞాపించాడు. కాని ఆ శూలం అతని శరీరం నుండి వెలుపలికి రాలేదు. అక్కడికి దానిని నరికించాడు. శూలంలో కొంతభాగం శరీరంలో మిగిలిపోయినందున మాండవ్య మహామునికి “అణి మాండవ్యుడు” అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తరువాత ఆ మాండవ్యుడు యమపురికి వెళ్లాడు.


“యమధర్మ రాజా, మహారాజు నాకు అంతటి శిక్ష వెయ్యాడానికి నేనేమి తప్పు చేసాను?” అని అడిగాడు.


“మహామునీ, నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకొని చిన్న చిన్న మేకులకు గుచ్చి ఆనందించావు. అందుకని ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు” అని అన్నాడు యముడు.


దానికి మాండవ్యునికి కోపం వచ్చి “యమ ధర్మ రాజా, పిల్లలు 14 ఏళ్లు వచ్చేవరకు బాలురు అని పిలవబడతారు. ఆ వయసులో ఏదీ తెలిసి చెయ్యరు. కాబట్టి ఈ రోజు మొదలు 14 ఏళ్ల లోపు పిల్లలు ఏమి చేసినా అది తప్పు కాదు. పెద్దగా పాపం కాదు. కాని 14 ఏళ్ల లోపు పిల్లలకు ఏవరన్నా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది” అని నిర్ణయం చేసాడు. (ఈ చట్టం ఈనాటికీ “Juvenile Act” గా అమలులో ఉంది).


“కానీ యమధర్మ రాజా, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు. కాబట్టి నువ్వు శూద్ర యోని యందు జన్మించు” అని శాపం పెట్టాడు. అందుకని యమధర్మ రాజు వ్యాసుడి వలన, దాసీ దాని గర్భంలో నుండి విదురుడుగా జన్మించాడు” అని వైశంపాయనుడు జనమేజయునకు వివరించాడు.

కామెంట్‌లు లేవు: