19, సెప్టెంబర్ 2020, శనివారం

14-22,23,24,25-గీతా మకరందము

 14-22,23,24,25-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అర్జునుని యా ప్రశ్నను విని భగవానుడు గుణాతీతుని లక్షణములను వివరముగ చెప్పుచున్నారు- 

 

శ్రీ భగవానువాచ — 

ప్రకాశం చ ప్రవృత్తిం చ 

మోహమేవ చ పాణ్ణవ| 

న ద్వేష్టి సమ్ప్రవృత్తాని 

న నివృత్తాని కాంక్షతి || 

 

ఉదాసీనవదాసీనో 

గుణైర్యో న విచాల్యతే | 

గుణా వర్తన్త ఇత్యేవ 

యోఽవతిష్ఠతి నేఙ్గతే ||

 

సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః | 

తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిన్దాత్మసంస్తుతిః ||

 

మానావమానయో* స్తుల్యః 

తుల్యో మిత్రారిపక్షయోః | 

సర్వారమ్భపరిత్యాగీ 

గుణాతీతస్స ఉచ్యతే || 

 

తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణసంబంధమగు ప్రకాశమును (సుఖమును) గాని, రజోగుణసంబంధమగు కార్య ప్రవృత్తినిగాని, తమోగుణసంబంధమగు మోహమును (నిద్రా,తంద్రతలను) గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థునివలె ఉన్నవాడై గుణములచేత (గుణకార్యములగు సుఖాదులచేత) చలింపజేయడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, (ఏపరిస్థితులయందును) చలింపక నిశ్చలముగ నుండునో, మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఆత్మయందే స్థిరముగనున్నవాడును, మట్టిగడ్డ, ఱాయి, బంగారము - వీనియందు సమబుద్ధి గలవాడును, ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును, (లేక కామ్యకర్మలనన్నిటిని విడచువాడును, లేక సమస్తకర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండు వాడును) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును.


వ్యాఖ్య:- గుణాతీతునియొక్క లక్షణము లిచట పేర్కొనబడినవి. ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది, లేనిది తెలిసికొనవచ్చును. గుణాతీతుడు తటస్థుడుగనుండుచు తనకు ఏ కారణముచేతనైనా, సత్త్వగుణసంబంధమైన ప్రకాశము (సుఖము) గాని, రజోగుణసంబంధమైన కార్యప్రవృత్తిగాని, తమోగుణసంబంధమైన మోహము (నిద్రాతంద్రతలు) గాని సంప్రాప్తించినచో వానియెడల ద్వేషముగాని, అవి తొలగినచో వానిని కోరుటగాని లేకుండును. గుణాతీతునియొక్క తాటస్థ్యమును, ఔదాసీన్యస్థితిని తెలుపుటకు ఈ విషయము బోధింపబడినదేకాని ఆ యా మోహాదిగుణములు అవలంబనీయములని తెలుపుటకాదు. మఱియు ఇచట మోహమనగా అజ్ఞానమని అర్థముకాదు. ఏలయనిన గుణాతీతునకు అజ్ఞానమెపుడో తొలగిపోయియుండును. భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు 'నిశ్చలత్వము', 'సమత్వము' అనునవి ప్రధానముగ గోచరించుచున్నవి -

(1) ‘నిశ్చలత్వము’ - ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదరిపోవును. తన సమత్వమును గోల్పోవును. కాని గుణాతీతుడు మేరుసమానగాంభీర్యముగలిగి, పరిస్థితులకు ఏమాత్రము చలింపకనుండును (న విచాల్యతే, నేఙ్గతే). శ్వాసవాయువు, లేక చిన్న అలలు పర్వతమును కదలింపజాలనట్లును, మేఘములకు పైనున్న సూర్యుని మేఘజనితములగు పిడుగులు, మెఱుపులు, వర్షము బాధింపజాలనట్లును, త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలుకడగలిగియున్న యోగిపుంగవుడు ప్రపంచములోని ఏ సంఘటనచేగాని, ఆపత్తుచేగాని చలింపక సదా ఆత్మయందే సుస్థిరుడై యుండును. ఆ వికటపరిస్థితులన్నియు మనస్సునకు జెందినవి. గుణములకు సంబంధించినవి. ఉపాధికి జేరినవి. "నేను గుణములకంటె వేఱుగనున్నాను. మనస్సునకు అతీతుడనైయున్నాను" అని తలంచి యాతడు మహద్ధైర్యయుతుడై మెలగును. గుణాతీతునియొక్క గుఱుతు ఇదియే.


(2) సమత్వము - మానావమానములందు, నిందాస్తుతులయందు, సుఖదుఃఖము లందు, ఇష్టానిష్టము లందు, శత్రుమిత్రాదులందు, శిలాకాంచనములందు గుణాతీతుడగు మహనీయుడు సమబుద్ధి గలిగియుండును. గుణాతీతుడైన శుకమునీంద్రుడు జనకుని యాస్థానమున కేగినపుడు, ఆతని పరీక్షార్థము జనకునిచే కలుగజేయబడిన సుఖదుఃఖాదులందు ఆతడెంతటి సమత్వమునుజూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితియందే (ధ్యేయాకారమందే, స్వవస్తువునందే) నిలుకడ గలిగియుందురు. కావున మిథ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారినేమియు చేయజాలవు. మఱియు నిందాస్తుతులు, సుఖదుఃఖములు మున్నగునవి మనోధర్మములే, కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులైయుండు గుణాతీతులను, జ్ఞానులను అవి కదలింపజేయజాలవు. మఱియొకనికి కలుగు సుఖదుఃఖములు మనుజుని యెట్లు బాధింపజాలవో, అట్లే ఉపాధిని తనకంటె వేఱుచేసికొనిన జ్ఞానిని, గుణాతీతుని ఆ యా ద్వంద్వములు బాధింపజాలవు.


'సర్వారమ్భపరిత్యాగీ’ - ఈ పదమునకు "సమస్తకార్యములందును కర్తృత్వమును వదలినవాడ”ని అర్థము చెప్పుటయే సమంజసముగ నుండును. లేక, కామ్యకర్మలన్నిటిని వదలినవాడనియు చెప్పవచ్చును.లేక, ఇతరకార్యములన్నిటిని త్యజించివైచి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడనియు పేర్కొనవచ్చును.


ఇట్టివాడు "యః” - ఎవడో 'సః' అతడు 'గుణాతీతః ఉచ్యతే’ గుణాతీతుడని చెప్పబడును - అని తెలుపుటవలన - అనగా యచ్ఛబ్ధప్రయోగము గావింపబడుటవలన ఎవరైనను సరియే ఆ స్థితిని బడయవచ్చుననియు, అట్లు (ప్రయత్నపూర్వకముగ) ఆ యా సద్గుణములను బడయువాడే గుణాతీతుడగునుగాని తక్కినవారు కారనియు స్పష్టమగుచున్నది. కావున సర్వులును అట్టి మహోన్నతస్థితికై యత్నించి కృతార్థత బడయవచ్చును.

 

ప్రశ్న:- గుణాతీతుని లక్షణములెవ్వి?

ఉత్తరము:- ఎవడు తనకు సంప్రాప్తించిన సత్త్వగుణసంబంధమగు ప్రకాశము (సుఖము)ను గాని, రజోగుణసంబంధమగు కార్యప్రవృత్తినిగాని, తమోగుణసంబంధమగు మోహము (నిద్ర, తంద్రత) ను గాని ద్వేషింపడో, అవితొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థునివలెనుండి ఆ యా గుణకార్యములచే ఏ మాత్రము చలింపడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, ఏ పరిస్థితులందును చలింపడో, మఱియు ఎవడు ఆత్మయందే స్థిరముగ నుండునో, మట్టిగడ్డ, ఱాయి, బంగారములందు సమదృష్టిగలిగియుండునో, సుఖదుఃఖములందు, ఇష్టానిష్టములందు, నిందాస్తుతులందు, మానావమానములందు శత్రుమిత్రులయందు సమభావముగల్గి యుండునో, ధీరుడై వర్తించునో, సమస్త కార్యములందును కర్తృత్వము విడిచివేయునో (లేక కామ్యకర్మలన్నిటిని త్యజించివేయునో, లేక సమస్తకర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండునో) అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. కావున ఈసద్గుణములే గుణాతీతుని లక్షణములైయున్నవి.

~~~~~~~~~~~~~

* మానాపమానయోః - పాఠాంతరము.

కామెంట్‌లు లేవు: