(మంజరీ ద్విపద)
రచన ::
గోపాలుని మధుసూదన రావు
అంతకు ముందట యవనినాథుండు,
సత్త్వశోభితుడైన సత్యవ్రతుండు
ననుసరించుచునుండ హరినామ స్మరణ
దరిదాటి కడలులు ధరణిని ముంచ
సంసిద్ధ మగుచున్న సమయంబు వచ్చె
హరి ప్రేరణంబున యప్పు డచ్చటకు
నావొక్క టొచ్చుట నరపతి గాంచె
సత్వరంబున యంత సత్యవ్రతుండు
మహిమగు యౌషధ మ్రాను తీగలను
వివిధంబులగు ముఖ్య విత్తనంబులను
పెట్టించె నావలో పెన్నిధిం వోలె
హరిధ్యాన మగ్నుడై నంతటా రాజు
ఋషి సంఘముల తోడ నెక్కెను నావ
అందఱారీతిగా యార్ణవంబందు
నావయందుండియు నరుగుచూ నుండ
చిద్విలాసుండైన శ్రీమహా విష్ణు
యద్భుత మీనమై యగుపించె నెదుట
కని ఘన మత్స్యమున్ కడు మోదమంది
వెనువెంట దానికి పెను బాము తోడ
చేర్చి కట్టిరి నావ శృంగంబు నకును
అంత ఋషుల గూడి యా రాచపెద్ద
మత్స్యావతారుడు మహనీయు డైన
విష్ణు దేవుని గాంచి వినుతించె నిట్లు
" కొందఱు మనమందు కొందల పడుచు
యంకురించినయట్టి యజ్ఞాన మునను
భ్రాంతిలో దిరిగేరు పరము లేకుండ
పరుగిడు చుండేరు పలు త్రోవలందు
అటువంటివారలు యరయ యోగమున
పరమాత్మ యగునిన్ను భక్తిసేవించి
ఘనముగా పొందేరు కైవల్యప్రాప్తి
ఆ రీతి నందర నాదరించేటి
కమలాక్ష ! మమ్మునూ కరుణించవయ్య
కనలేని వానికి కనులున్న వాడు
యేరీతి త్రోవను యెఱిగించుచుండు
సర్వేశ ! పరమాత్మ ! సకల ప్రాణులను
సూర్యుడే కన్నుగా చూచేవు నీవు
సన్మతి , మూఢుకు తండ్రివి నీవె
యారీతి మమ్ముల ననయంబు నీవు
సద్గతి జూపుము సద్గురు పగిది
ఇంగలమును గూడ బంగారమునకు
కడువన్నె యేరీతి కలుగుచూ నుండు
యారీతి నిను గొల్చు యఖిల భక్తులకు
పాపముల్ నశియించి ప్రాప్తించు ముక్తి
పరమాత్మ ! నీ దయన్ పదివేల పాలి
లేశభాగంబులో లీలల కతన
చేకూరుచున్నది దేవేంద్ర పదవి
పరమేశ ! నిన్నింక భక్తి మెప్పించ
యేముండు దొరకక ? యీశా ! మహేశా !
గురువని పెఱవాని గుర్తించి నపుడు
కొఱగాని పదమునే జూపించు నతడు
కోరి యట్లేగిన కుజను డయ్యేను
అరయ నీ దోవనే యనుసరించంగ
యఱమఱ లేనట్టి పదము పొందేను
పరమ నెచ్చెలి వయ్యు బంధుగు వయ్యు
చిన్మూర్తి వయ్యును చిత్ యాత్మ వయ్యు
వాంఛా ఫలంబువై వఱలు నిన్వీడి
పలు వెంటలం బడి పరుగులు దీసి
యాయాశ మొందేరు యవివేక జనులు
నిర్భాగ్యునకు హేమ నిధి చేరువైన
దక్కించుకొనలేడు తర్కించ నతడు
నిజకర్మ బద్ధమై నీరధి యందు
యుచితనిద్రం బొంది యున్న లోకమును
యే మహనీయుచే యెప్పటికపుడు
మేల్కాంచు చుండునో మేలును పొంది
నట్టి యో పరమాత్మ ! యై తీవు గురువు
ఆలకింపుము స్వామి ! యర్థింతు నిన్ను
వేలుపుపెద్ద నిన్ వేడెద స్వామి !
సర్వేశ ! నాలోని సంకటంబులను
మాన్పించి దయతోడ మన్నించి నన్ను
నిఖిలేశ్వరా ! యింక నీ లోకమునకు
గొనిపొమ్ము వెనువెంట గోరెద నిన్ను "
సత్యవ్రతుండట్ల సద్భక్తి తోడ
ప్రార్థించె వినయాన పరమేశు విష్ణు
మత్స్య రూపంబున మహిత సంద్రమున
విహరించుచున్నట్టి విస్ణు దేవుండు
యత్యంత తోషిల్లె నాతనిం గాంచి
హరి పురాణపురుషు డగుటచే నపుడు
సాంఖ్యయోగ క్రియా సహిత మైనట్టి
విమల 'పురాణ సంహిత ' ను బోధించె
సత్యవ్రతుండట్లు సంయమీంద్రులతొ
భగవాను ప్రోక్తంబు బహు సనాతనము
బ్రహ్మ స్వరూపంబు బడసియు నపుడు
బ్రహ్మ విజ్ఞానంబు బడసియు నపుడు
ధన్యు డయ్యె మిగుల తరియించ బ్రతుకు
విబుధుడౌ యాతండు యీ కల్పమందు
శ్రాద్ధదేవుండను సన్నామమునను
యరయ వివస్వతుం డనబడు నట్టి
సూర్యదేవునియొక్క సుతునిగా బుట్టి
చిద్విలాసుండైన శ్రీహరి కృపన
యేడవ మనువయ్యె విఖ్యాతముగను .
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి