19, సెప్టెంబర్ 2020, శనివారం

**మహాభారతము**

 **దశిక రాము,**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


87 - అరణ్యపర్వం.


హనుమద్ పరిష్వ0గంలో పరవశించి భీమసేనుడు, యిక బయలు దేరుతానంటూ అగ్రజునివద్ద తడిబారిన కళ్ళతో వీడ్కోలు తీసుకుంటూ, ఆయన కటాక్షం తమమీద యెల్లప్పుడూ వుండాలని కోరుకున్నాడు.  


భీముని వినయానికి యెంతో సంతుష్టుడై హనుమంతుడు చిరునవ్వుతో, ' భీమా ! మీ సోదరులందరి మీదా నా అనుగ్రహం యెల్లప్పుడూ వుంటుంది. యుద్ధం అనివార్యమైనప్పుడు, శత్రునేనలను మీరు ఎదుర్కొనే సమయంలో, నీ తమ్ముడు అర్జునుని రథంపై వున్న పతాకం మీద నేను వుండి, రక్షణ గావిస్తాను. నీవు సింహనాదం చేసినప్పుడు యుద్ధభూమిలో, నా కంఠధ్వని అందులో మిళితమై, నీవు చేసిన శబ్దానికే, దాదాపు సగంమంది సైనికులు ప్రాణాలు కోల్పోయేటట్లు చేస్తాను. యిక వెళ్ళిరా . నేను గంధమాదన పర్వతాలపై వున్న విషయము, ప్రస్తుతానికి రహస్యంగా వుంచు. ' అని వాత్సల్యపూర్వకంగా వీడ్కోలు పలికాడు హనుమ అనుంగుసోదరునికి.


హనుమతో గడిపిన సుందరదృశ్యాన్నే మాటిమాటికీ నెమరు వేసుకుంటూ, అక్కడి అందాలను వీక్షిస్తూ, మరల భీముడు ప్రయాణం సాగించాడు, హనుమ చెప్పిన మార్గం గుండా. ఎట్టకేలకు, సౌగంధికావనం ప్రవేశించాడు భీమసేనుడు. అక్కడి వాతావరణానికి, సౌగంధికా పుష్ప సువాసనలకు మైమరచి, భీముడు సరాసరి సౌగంధికా సరోవరం వైపు దారితీశాడు. అక్కడ కొంచెముకూడా బురదలేని స్వచ్ఛమైన నీళ్లలో తేలియాడుతున్న సౌగంధికాపుష్పాలను చూసి, మైమరచి, ద్రౌపది ఆతని వూహలలోనికి రాగా, హనుమంతుడు చెప్పిన సలహాని విస్మరించి, అక్కడి జలాలను త్రాగి, ఆ పుష్పాలపై చెయ్యి వేయబోయాడు.  


ఇంతలో అక్కడ కాపలాగావున్న యక్ష సమూహం అతనిని చుట్టుముట్టింది. కుబేరుని అనుమతి లేకుండా మానవ మాత్రులెవరూ వనంలో ప్రవేశించరాదని చెప్పారు వారు. అయితే, ద్రౌపదీధ్యానంలో వున్న భీముడు సౌగంధికా పుష్పాలు కోయబోతున్న సమయంలో యేమిటి యీ వాదనలని కోపగించి, ' ఇది ప్రకృతి అందించిన వరం. దీనిపై యే ఒక్కరికో అధికారంలేదు. ముచ్చటపడిన వారు యెవరైనా పొందడమే ప్రకృతిధర్మం. ' అని వారితో వాదులాడి, వారిని రెచ్చగొట్టి, యుద్ధానికి తలబడ్డాడు. తానెవరో చెప్పి, మీయజమాని కుబేరుని రమ్మనండి. అతనితోనైనా యుద్ధానికి సిద్ధం' అన్నాడు.  


కొద్దిసేపు యక్షులకూ, భీమునికి యుద్ధం జరిగింది. క్షత్రియ తేజస్సుతో ధైర్య సాహసాలతో పోరాడుతున్న భీమసేనుని చూసి, అతనిపై తమ మాయా విద్య ప్రదర్శించడానికి యిష్టపడక, యక్షులు, భీముని కొద్దిసేపు నిలువరించి, యీలోపు, కొందరు అనుచరుల ద్వారా కుబేరునికి వర్తమానం పంపారు. కుబేరుడు వచ్చినవాడు భీమసేనుడు, పుష్పాలను తీసుకువెళ్తున్నది ద్రౌపది కోరికమేరకు, అని గ్రహించి, సౌగంధికా పుష్పాలు తన కానుకగా పంపించమని వచ్చిన యక్షులకు చెప్పాడు.  


ఆ విధంగా భీమసేనుడు, సౌగంధికాపుష్పాల కొరకై సరస్సులో దిగగానే, ఒక్కసారిగా అక్కడ పాండవులు వున్న చోట చిమ్మచీకట్లు అలుముకుని, పెద్దపెట్టున గాలివీచింది. ధర్మరాజు, వ్యాకులతతో, అందరినీ ఒక దగ్గర వుండమని పిలుస్తుండగా, భీమసేనుడు కనిపించలేదు. రెట్టించిన అతృతతో, భీముని గురించి విచారించగా, ద్రౌపది తాను సౌగంధికా పుష్పాలు కోరిన విషయము, దానికై ఈశాన్యదిక్కుగా భీముడు వెళ్లిన వైనం చెప్పింది.  


వెంటనే, యింక ఆలశ్యం చెయ్యకుండా, ఘటోత్కచుని, అతని పరివారం సహాయంతో, అందరూ సౌగంధికా సరస్సు వద్దకు చేరుకొని, భీముని కలుసుకున్నారు. ధర్మజుడు భీముని క్షేమము తెలుసుకుని ఆలింగనం చేసుకున్నాడు. వనరక్షకులు ధౌమ్యులవారికీ, ధర్మజునికీ మిగిలిన పెద్దలకు నమస్కరించి ఆదరించారు. వారి రాక తెలుసుకుని, కుబేరుడు విచ్చేసి, తమ ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.


కొద్దిసమయము కుబేరుని వద్దవుండి, తిరిగి అందరూ కలిసి గంధమాదన పర్వతం చేరుకొని, అక్కడి వాతావరణంలో ఆనందాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతున్నారు, ఘటోత్కచుడు వారివద్ద వీడ్కోలు తీసుకుని తన పరివారంతో తిరిగి వెళ్ళిపోయాడు.


కాలం గడుస్తుండగా,ఒకనాడు, లోమశమహర్షి, ధౌమ్యుడు, స్నానానికి నదీతీరానికి వెళ్లగా, భీముడు అరణ్యం లోనికి వెళ్ళాడు . ద్రౌపదీ ధర్మరాజాదులు అక్కడే వున్నారు. జటాసురుడు అనే రాక్షసుడు, అప్పటిదాకా వారి మధ్యనే బ్రాహ్మణవేషం లో వున్నవాడు, అదను చూసుకుని, తనశరీరాన్ని పెంచి, గాలికంటె వేగంగా వారినందరినీ, అందరి అస్త్ర శాస్త్రాలనూ,కలిపి ఒక మూటగాకట్టి నెత్తిన పెట్టుకుని పారిపోసాగాడు.


అంతవరకూ, మిగిలిన బ్రాహ్మణులతో పాటు ధర్మజుని ఆదరణ పొంది, నివురుగప్పిన నిప్పులాగా బ్రాహ్మణ సమూహంలో వున్న రాక్షసుని చేష్టలకు, కోపగించి ధర్మజుడు,' ఓరీ రాక్షసాధమా ! బ్రాహ్మణరూపం లో వచ్చిన దుష్టుడవు నీవు. నీకు చేటుకాలం దాపురించి యీవిధంగా ద్రౌపదిమీద కాంక్షతో మమ్ములను యిబ్బందిపెడుతున్నావు. అధర్మ బుద్ధితో సంచరిస్తున్న నీవు యెంతో దూరం మాభారం మోయలేవు. నిలు దురాత్మా ! ' అని నిలువరించసాగాడు. ఇంతలో సహదేవుడు తన ఖడ్గాన్ని తీసుకుని నెమ్మదిగా వాడి చేతి నుండి జారి క్రిందకుదిగి భీమసేనునికై గాలించాడు.  


ధర్మజుడు అన్నట్లుగానే, జటాసురుడు యుధిష్టురుని వంటి ధర్మాత్ముని భారం మోయలేక వేగం తగ్గించాడు. ఇంతలో సహదేవుడు వానికి అడ్డుగా నిలిచి కత్తి యుద్ధంతో నిలువరించే ప్రయత్నిస్తుండగా, భీమసేనుడు కలిశాడు. జటాసురునికీ, భీమసేనునికీ భయంకరమైన యుద్ధం జరిగింది. ద్రౌపదీ మొదలగు వారిని తన తలపైనుండి దించి, జటాసురుడు కూడా , ' నీవే నాకు సమఉజ్జీవి. కాచుకో. ' అని మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు భీమునితో. చివరకు భీముని గజపట్లు తప్పించుకొనలేక, భీముని దెబ్బలు యెదుర్కొనలేక, బీముడు మెడపై సాచివేసిన దెబ్బకు తట్టుకొనలేక చెట్టునుండి మగ్గినపండు రాలి క్రిందపడినట్లు, జటాసురుని తల, దేహంనుండి విడివడి, క్రిందలు రాలింది. ఆ విధంగా దుష్టశిక్షణ జరిగి, భీముడు అందరి ప్రశంశలు అందుకుంటుండగా, వారంతా మళ్ళీ నరనారాయణాశ్రమం చేరారు.  


మరికొంతకాలం గడిచింది. అర్జునునిరాకకై యెదురుచూస్తున్నారు అందరూ. లోమశమహర్షి సూచన మేరకు అందరూ కైలాషపర్వతం చేరి అక్కడ వుండి అర్జునుని కొరకై నిరీక్షిద్దామనుకున్నారు. వెంటనే బయలుదేరి, అతి పవిత్రమైన అరిష్టశ్రేణుని ఆశ్రమం మీదుగా, కైలాసశిఖరం చేరుకున్నారు, పాండవులు. ఆ పుణ్యప్రదేశానికి, యెందరో మునులు, ఋషులు, సాధుపుంగవులు వస్తూపోతూవున్నారు. వారితో సత్కాలక్షేపం చేస్తూ యెన్నో మంచివిషయాలు తెలుసుకుంటూ వున్నారు, ధర్మరాజాదులు.  


ఇలావుండగా, ఒకనాడు, ఆకాశములో వున్నట్లుండి ఒక పెద్ద తెల్లనిమెరుపు మెరిసింది. ఆపై, తెల్లని అశ్వాలు పూనిన రథంలో మాతలి సారధ్యంలో, దివ్యరధం గోచరించింది, వారి వైపే వస్తూ. ఇంకొద్దిగా ముందుకు రధంరాగానే, కాంచన మణిమయహారాలతో, నవరత్న ఖచిత సువర్ణ కిరీటంతో ఇంద్ర తేజస్సుతో వెలిగిపోతూ, పాండవ మధ్యముడు అర్జునుడు వారినందరినీ అలరిస్తూ కనిపించాడు.  


రధం వారిదగ్గరగా వచ్చి ఆగింది. రధం దిగుతూనే, అర్జునుడు, లోమశమహర్షికీ, ధౌమ్యులవారికి నమస్కరించి, ఆపై అన్నలకూ నమస్కరించాడు., నకులసహదేవులను దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుని ఆదరించాడు. ద్రౌపదిని ప్రేమ పూర్వకంగా సమీపించి, ప్రియసంభాషణలు గావించాడు. 


పాండవుల సత్కారాలు అందుకుని, మాతలి వారికి చెప్పవలసిన హితవచనాలు చెప్పి, వారంతా ఇంద్రరధానికి నమస్కరిస్తుండగా, తిరిగి మాతలి, రథంతో సహా అమరావతి బయలుదేరి వెళ్ళాడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: