19, సెప్టెంబర్ 2020, శనివారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -23


శ్రీహరిదర్శనంబు 


జయవిజయులు ఇలా అంటున్న సమయంలో...అందరికీ ప్రభువైనవాడూ, అంతములేనివాడూ అయిన హరి ఆ కలకలాన్ని విని, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ వినోదించడాన్ని చాలించి, ఆశ్రయించినవారి కష్టాలను పోగొట్టేవాడై, శాశ్వత వైభవంతో శుభాలను కలిగించేవాడై అంతఃపురం యొక్క మాణిక్యాలు పొదిగిన మందిర ద్వారాలను దాటి మాననీయ స్వరూపంతో వచ్చాడు.ఇంకా...లక్ష్మీదేవి కూడా తొట్రుపాటు కలిగినదై వెంట రాగా, పరమహంసలైన మునీశ్వరులు నమస్కరించే తమ పాదపద్మాలకున్న క్రొత్త మణులు పొదిగిన బంగారు అందెలు అడుగడుగుకూ మనోహరమైన శబ్దాలు చేస్తుండగా శ్రీహరి మహానుభావులచేత నమస్కరింపబడేవాడై, యోగులచేత సేవింపబడేవాడై శ్రీహరి వచ్చాడు. అప్సరసలు తమ చేతులకున్న మణులు పొదిగిన బంగారు కంకణాలు గల్లుగల్లున మ్రోగుతుండగా హంసరెక్కలవంటి తెల్లని వింజామరలను వీస్తున్నారు. ఆ వింజామరల గాలికి చంద్రబింబంలా వెలుగుతున్న వెల్లగొడుగు అంచులలో వ్రేలాడుతున్న ముత్యాల హారాలు బాగా కదులుతున్నాయి. వాటిమీదనుండి చల్లగా జారిపడుతున్న మంచుబిందువులతో అందాలు చిందే దివ్యమంగళ స్వరూపుడై శ్రీహరి వచ్చాడు. 

ఇంకా ఆ శ్రీహరి మునీశ్వరు లందరూ వర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖపద్మంతో అలరేవాడు. విశేషమైన ప్రేమతో చెమ్మగిల్లిన కన్నులున్న తన భక్తజనుల హృదయాలలో నివసిస్తూ తనరేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలంపై వైజయంతి అనే మాలచేత అలంకరింపబడి రాజిల్లేవాడు. నమస్కరించే జనులను రక్షించడంలో దయామృత తరంగాలు పొంగిపొరలే పద్మనేత్రాలు కలవాడు. ఆ విష్ణువు యోగిపుంగవు లందరిచేత సేవింపబడేవాడు. సజ్జనులను రక్షించడానికి సమర్థుడైనవాడు. అత్యంత మహిమాన్వితమై అఖిలలోకాలకు చూడామణి అయిన వైకుంఠపురాన్ని అలంకరించేవాడు. ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళ కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమచేతికి భుజకీర్తులు, మురుగులు, కంకణాలు ముచ్చట గొలుపుతుండగా, కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు. ఆ శ్రీహరి పాదపద్మాలలోని కేసరాలవలె తులసీదళాలు వెలుగులు వెదజల్లుతున్నవి. ఆ తులసీదళాలతో మిళితమైన మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లగాలులను ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆ యోగీశ్వరుల మనస్సులకు విష్ణుమూర్తి దివ్యస్వరూపం ఆనందదాయకమై వెలుపలి లోపలి ఇంద్రియాలకు సంతుష్టి కలిగిస్తున్నది. ఆ అనుభవం చేత వారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన స్వరూపంతో విష్ణుమూర్తి నడచి వచ్చాడు. ఆయన ప్రక్కన లక్ష్మీదేవి నడచివస్తున్నది. మిక్కిలి శ్రేష్ఠమైన ఆమె సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతున్నది. ఆ విధంగా సకల జగత్తులకు ఈశ్వరుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు.

ఆ విధంగా సుస్థిరమూ శుభకరమూ అయిన శోభావైభవంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి క్రొంజిగురాకులా ఉంది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై విలసిల్లే మల్లెమొగ్గల అందాన్ని అందుకున్నది. అటువంటి గోవిందుని సుందర ముఖపద్మాన్ని సనక సనందనాదులు ఆనందంగా సందర్శించారు. మనస్సులు తృప్తి చెందక మళ్ళీ మళ్ళీ మాధవుణ్ణి సందర్శించారు.ఆ సనక సనందనాది మునులు అచంచలమైన భక్తితో ఆ శ్రీహరి ముఖాన్ని చూపులు త్రిప్పుకోలేక చూసి చూసి, ఎట్టకేలకు చూపులు త్రిప్పుకొని స్వామి పాదాలమీద కేంద్రీకరించారు. ఆ పాదాలు కల్మషము లేని భక్తుల భేదాలను పోగొట్టేవి, మునుల మనస్సులకు మోదాన్ని కలిగించేవి, మోక్షమందిరం యొక్క ద్వారాలను తెరిపించేవి, వేదాలను క్రొంగ్రొత్త నూపురాలుగా చేసికొని పొగడ కెక్కినవి.కోరిక తీరిన ఆ సనక సనందాది మహర్షులు నిరంతరం యోగమార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెదకినా కనిపించని మహానుభావుడైన విష్ణువును కన్నులారా చూసారు. పద్మరాగ మణుల కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాలలో పదిలపరచుకొని పదేపదే నమస్కారాలు చేశారు. ధ్యానించేవారికి మాత్రమే వశమయ్యేవాడూ, తత్త్వజ్ఞులకు దర్శన మిచ్చేవాడూ, భక్తులైన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే స్వరూపం కలవాడూ అయిన ఆ పరాత్పరుణ్ణి మునీశ్వరులు తమ మనస్సులలో నిలుపుకున్నారు.


సనకాదుల హరి స్తుతి


కన్నులకు విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుడు, పురుషోత్తముడు, అనంత తేజోనిధి అయిన విష్ణువును సనకసనందనాదులు ఇలా సంస్తుతించారు. పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడా! భక్తజనులపై వాత్సల్యాన్ని చూపే దేవా! నీ కుమారుడూ, మాకు జనకుడూ అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభూ! కృతార్థులమైన మా జన్మ సార్థకమయింది.దేవా! నీవు దుష్టుల హృదయాలలో ఉండికూడ వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించేవారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తి పరుస్తావు. పద్మనయనా! సర్వలోకాధిపతీ! నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్లా, నీ గురించి చెప్పుకొనడం వల్ల, సుస్థిరమైన భక్తియోగంలో నిష్ణాతులైన ఆత్మవిదులైనవారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు.

నీ పాదాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు నీ భక్తికి వ్యతిరేకాలైన ఇతర ముఖ్యమైన కార్యాలు ముక్తి నిచ్చేవైనా వాటిని పాటింపరు. దయాగుణమే అలంకారంగా గలవాడా! పాపాలను తొలగించేవాడా! పొగడ దగినదీ, దోషాలు లేనిదీ, శుభగుణాలకు కాణాచియైనదీ, గొప్ప కీర్తిచేత విరాజిల్లేదీ అయిన పవిత్రమైన చరిత్ర కలవాడవు. నీ పాదపద్మాల సేవచేత నిర్మలమైన మనస్సు కల మహానుభావులు ఇతర విషయాలను భావించరు. అంతులేని తపస్సు చేసి సాంసారిక పాపాలను పోగొట్టుకొని తిరిగే మేము ఈరోజు నీ పాదదాసులపై కోపించి శపించాము. మహాపాపాన్ని కల్గించే చెడుమార్గంలో అడుగుపెట్టి ధర్మహాని చేసి నరకానికి పాత్రుల మయ్యాము. మా తప్పు మన్నించి మమ్మల్ని రక్షించు. కేశవా! తుమ్మెద కుతూహలంతో కమ్మని మకరందం కోసం వాడిముళ్ళతో కూడిన కొంగ్రొత్త పూలగుత్తులను సమీపించే విధంగా మిక్కిలి ఆటంకాలను అధిగమించి నీ పాదపద్మాలను ఆరాధించడానికి వచ్చాము.పద్మనాభా! మాధవా! నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చిందే ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి. మహనీయమైన కీర్తియొక్క విలాసంచేత ప్రకాశించే సుగుణాలు కలవాడా! అందరికీ ఆశ్రయింప దగినవాడా! అచ్యుతా! పంచేంద్రియాలకు లొంగినవారికి కనిపించక నల్ల అవిసె పూవుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు. అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారై విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: