19, సెప్టెంబర్ 2020, శనివారం

*🌻. మోక్షము - వినాశము 🌻*

 


నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చుచుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. 

*అదియే మోక్షము.*


అట్లుగాక అహంకారమునకు సొంతపని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.


 హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.


మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.  


అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట.


🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: