19, సెప్టెంబర్ 2020, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

తీర్ధం..విభూతి..


"స్వామీ దత్తాత్రేయా నాకీ బాధను తగ్గించు నాయనా..లేకపోతే నన్ను త్వరగా తీసుకుపో తండ్రీ!.." అంటూ ఆ వృద్ధురాలు శ్రీ స్వామివారి మందిరం లోని మంటపం లో పడుకొని మెలికలు తిరిగిపోతూ వేడుకుంటున్నది..సుమారు పది రోజుల నుంచీ కడుపులో నొప్పితో బాధపడుతోంది ఆవిడ..సుమారు డెబ్భై ఏళ్ల పైబడిన వయసు..వైద్యులకు చూపించాలని ఆమె కుమారుడు శతవిధాల ప్రయత్నం చేసాడు..ససేమిరా ఒప్పుకోలేదు ఈవిడ..తాను దత్తాత్రేయ స్వామినే నమ్ముకున్నానని..అక్కడికే తీసుకెళ్లమని కొడుకుతో తేల్చి చెప్పి..మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్నది..ఆమె పేరు శకుంతలమ్మ..ఊరు కృష్ణారెడ్డిపల్లె..


మూడురోజులు గడిచాయి..రోజూ ఉదయాన్నే శ్రీ స్వామివారి కి అర్చక స్వాములు ప్రభాత పూజ హారతి పూర్తి చేసిన తరువాత..వరుస క్రమం లో వచ్చి శ్రీ స్వామివారి తీర్ధాన్ని తీసుకుంటుంది..ఆ తరువాత అక్కడే  పాదుకలు ఉంచిన చిన్న మంటపంలో ఉన్న పాత్ర నుంచి విభూతి తీసుకొని..తన కడుపు మీద రాసుకొని..మరికొంచెం విభూతిని నోట్లో వేసుకొని..తిరిగి వచ్చి మంటపం లో పడుకునేది..బాధ తీవ్రంగా వున్నప్పుడు..నొప్పి భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్ధించేది..అంతేకానీ..మరే విధమైన వైద్యాన్ని ఒప్పుకోలేదు..నాలుగోరోజు కల్లా శకుంతలమ్మ కడుపులో నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది..


ఈ నాలుగురోజుల పాటు ఆవిడ పడుతున్న బాధను దగ్గరా వుండి గమనిస్తున్న నాకు.."ఎందుకు ఈవిడ ఇంత బాధపడుతూ మొండిగా ఇక్కడే ఉంది?..ముందుగా మానవప్రయత్నం చేయాలి కదా?..పూర్తిగా దైవమే వచ్చి ఆదుకోవాలని కోరుకోవడం మూర్ఖత్వం కదా?.." అని చాలాసార్లు అనిపించింది..ఆమాటే ఆవిడ కుమారుడి తో అన్నాను కూడా..అతను నా వైపు అదోలా చూసి.."అమ్మను డాక్టర్ల వద్ద చూపించాలని ఎన్నో సార్లు అనుకున్నాను..కానీ ఆవిడ ఒప్పుకోలేదు..నేను నిస్సహాయంగా ఉండిపోయాను.." అన్నాడు..


ఐదోరోజు కు ఆవిడ నొప్పి చాలాభాగం తగ్గిపోయింది..కేవలం శ్రీ స్వామివారి తీర్ధం..విభూతి మాత్రం తోనే తాను కోలుకున్నది..నాకు విపరీతమైన ఆశ్చర్యం వేసి.."అమ్మా..మీరు ఏ నమ్మకం తో ఇంత నొప్పి భరిస్తూ వుండగలిగారూ.." అని అడిగాను..


"నాయనా..నేను ఆ దత్తాత్రేయ స్వామిని పరిపూర్ణంగా నమ్మాను.. దానికీ కారణం ఉంది..నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు..స్వామిని మాలకొండలో మొదటిసారి చూసాను..అప్పుడు వీడికి మూడేళ్ల వయసు..ఆ తరువాత కూడా మా ఆయన నేనూ రెండు మూడుసార్లు స్వామివారిని దర్శించుకున్నాము..ఒక శనివారం నాడు స్వామివారు పార్వతీదేవి మఠం వద్ద కూర్చుని వున్నారు..మా దంపతులము స్వామికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాము..స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు..ఆరోజు నుంచీ స్వామివారంటే మాకు గురి కుదిరింది..ఒకసారి మేము మాలకొండ వెళ్ళి, పార్వతీదేవి మఠం వద్దకు వచ్చేసరికి  మా ఆయనకు కడుపులో నొప్పి వచ్చింది..బాగా బాధ పడ్డారు..శ్రీ స్వామివారు స్వయంగా అమ్మవారి ముందున్న తీర్ధం తీసి మాకు ఇచ్చారు..కొద్దిసేపటికే ఆయన కడుపులో నొప్పి తగ్గిపోయింది..అది నాకు మనసులో నాటుకుపోయింది..శ్రీ స్వామివారు ఇక్కడ సమాధి చెందిన తరువాత కూడా మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చాము..నాకు కడుపులో నొప్పి రాగానే..మా వాడితో " నాకు ఏ వైద్యమూ వద్దు..నన్ను మొగలిచెర్ల లోని స్వామివారి మందిరానికి తీసుకెళ్లు" అని మొండికేశాను.. నా నమ్మకం స్వామి నిలబెట్టాడు..మూర్ఖత్వం అనుకుంటావో..మొండితనం అనుకుంటావో..లేదా స్వామి మహిమ అనుకుంటావో నీ ఇష్టం.." అన్నది..


మూర్ఖత్వం ఆవిడది కాదు..నాది అని నాకు ఆ క్షణంలో తెలిసివచ్చింది..కాకుంటే..ఇన్నాళ్లు శ్రీ స్వామివారి మందిరం లో వుంటూ..ఇటువంటి లీలలు ఎన్నో చూస్తూ కూడా అలా అనుమానం పడటం మూర్ఖత్వం కాక మరేమిటి?..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: