26, జులై 2023, బుధవారం

పుటుక్కు జరజర డుబుక్కుమే

 , తెలుగు సామెతలు వెనక గల ఆసక్తికర కధనాలు.


01. "పుటుక్కు జరజర డుబుక్కుమే"


ఓపాక పై బూడిదగుమ్మడి పాదుపాకి 

ఓ కాయ కాసింది. 

ఆ పాక చూరు కింద రాటకి 

ఓ మేక కట్టేసి ఉంది.

ఒకనాడు 

ఉర్వారక విబంధనాత్ రీతిని ఆ పాదుకి తొడిమనించి 

ఆ గుమ్మడికాయ 

పుట్టుక్కున విడిపోయి 

జరజరా కప్పుమీంచి జారి డుబుక్కున కింద ఉన్న మేక నెత్తిని పడితే 

ఆ మేక బాధతో మే... అంది.

ఇదీ కధనం.


దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే 

మనకి ఏమాత్రం సంబంధంలేని తప్పుకి 

మనం బాధ పడవలసి వచ్చినపుడు

ఏరా ఏమైంది అంటే

ఆ... ఏవుంది

పుటుక్కు జరజర డబుక్కు మే.. అని బాధని కూడా హాస్యచతురతతో పంచుకునే అమ్మభాష లో 

ఓ అందం ఇది.


02.కాకతాళీయం.

కాక అంటే కాకి

తాళ  అంటే తాటిచెట్టు.


ఓ మాటు 

ఓ తాళపత్ర వృక్షం అంటే 

తాటిచెట్టు పై 

ఓ కాకి 

వాలీవాలగానే దానికి ఉన్న తాటికాయ 

ఠపీమని కిందకి రాలింది. 

అపుడా కాకి 

ఆహా! నేనెంత బలశాలినో కదా!అనుకుందిట.


వాస్తవానికి 

కాకి కాలూనిన బలానికి 

తాటికాయ పడలేదు.

తాటికాయ పడే సమయానికి 

కాకి వాలడం జరిగింది.


నేను కాలితో తన్నితే ఆటో స్టార్టవలేదు. 

అది స్టార్టు చేసే సమయానికి 

నేను తన్నడం జరిగింది. 

ఇదీ కాకతాళీయం అంటే.


ఇది ఎప్పుడు వాడతారంటే 

అనుకోకుండా మనవలన ఏదైనా గొప్ప పని జరిగితే 

ఆ..ఏదో కాకతాళీయంగా జరిగింది కానీ నిజానికి 

నా గొప్పేంలేదు

 అని నిజాయితీ తెలిపే మంచి లక్షణం పెంచే మాతృభాష సౌందర్యం ఇదోటి.


03. సింగినాదం జీలకఱ్ఱ


పూర్వం పల్లెలలోకి పడవలలో 

పోపు సామానులు సుగంధ ద్రవ్యాలైన

జాపత్రి యాలక్కాయిలు ఆవాలు జీలకఱ్ఱ మెంతులు వంటివి అమ్మకానికి కాలవ ఒడ్డున లంగరేసేవారు. 

మేం వచ్చామొహో! అని ఊరంతా తెలపడానికి


శృంగము అంటే 

కొమ్ము బూరలు  తుతుత్తుతూ

 అని పేధ్ధగా ఊదేవారు.


ఓ మాటు 

ఓ కొత్తకోడలు 

ఈ చప్పుడు విని

"అత్తా ఏమిటీ ధ్వని "అని అడిగితే 

ఆ అత్త

ఆ ఏవుంది 

"శృంగనాదం జీలకఱ్ఱ" 

ఏంలేదు లే కోడలా అందిట.

అది కాలక్రమంలో 

సింగినాదం జీలకఱ్ఱగా మారింది. 


ఇది ఏ సందర్భంలో వాడతారంటే

విషయం ఏమీ లేకుండా పెద్ద ఆర్భాటం చేసేప్పుడు వాడే అమ్మపలుకుల చురక ఇది.


04. కొండ బండ కుండ గుర్తులు.


మా చిన్నతెలుగు మాస్టారు. నాకేదైనా తెలుగులో గుర్తుండక పోతే 

గుడ్డిబట్టీ అంటే గాఠిగా కళ్ళుమూసుకు బట్టీయం వేయమనేవారు. 


అప్పటికీ రాక పోతే ..

అంటే 

ఎలాంటివంటే

పద్యాల పక్కన 

కం

చం

ఉ 

అని వ్రాసి ఉండేవి ఇవేంటో నాకు తెలిసేది కాదు.

అపుడాయన అవి పద్యాలలో రకాలురా!అని అంటూ


కం

కందము

చం

చంపకమాల

ఉత్పలమాల

మత్తేభము 

అని కుండగుర్తు పెట్టుకో అనేవారు.


ఈ కుండ కొండ బండ గుర్తు అనే పలుకుబడి ఎలా వచ్చిందంటే.


పూర్వం 

ఓ కామందుకి 

ఓ పొలం ఉండేది.

దానికి ఓ పాలేరుని పెట్టాడు.

వాడికి అవగాహనా లోపం ఎక్కువ

అందుకే

ఆ కామందు

"ఒరె..మన ఊరి ఉత్తరాన ఓ కొండ కనపడుతుందా 

ఆ కొండ కి కిందనున్నదే 

మన చేను. 

అని


ఒరేయ్  

ఆ కొండకింద ఓ పేద్ద బండ పక్కన ఉన్నదే మన పొలం అనో

బండ కొండ గుర్తులు చెప్పేవాడు


ఇంకా వాడి

మట్టిబుఱ్ఱకి తట్టకపోతే


ఒరేయ్

ఆ కనిపించె కొండ కింద ఓ చేలో 

ఓ రాటకి 

ఓ కుండ బోర్లించి దిష్ఠిబొమ్మగా

 నా నెత్తిన ఉన్నట్టు

ఆ కుండగుండుకీ మూడు నామాలుంటాయి

అదే మన చేను. అని 

కుండ బండ కొండ గుర్తులు,రా

అని చెప్పేవాడు.


ఇది ఏ సందర్భంలో వాడతారంటే


కష్ఠమైనవి

సులువుగా గుర్తుపెట్టుకోడానికి

యమాతా రాజభానస ల వలె తేలికగా

చెప్పే సులభ బోధనా పద్ధతులు,నేర్పే మాతృదేవోభవ భాష మన తెనుగుభాష


చివరిగా..


05. గాడిదగుడ్డు

కంకరపీసు


ఓ మాటు ఓ ఆంగ్ల దొరగారిదగ్గర

రాజబాబు వంటి 

ఓ సేవకుడు

అల్లు వారి వంటి 

ఓ దుబాసీ పనిచేస్తూ ఉండేవారు.


ఆ ఇంగ్లీషు దొర తరచూ

GOD IS GREAT..HE

CONQUARD PEACE

అంటూ ఉండేవాడు.

అంటే 

దేవుని గొప్పతనం వలన అతను విజయంతో శాంతి పొందాడు

అని వారి మాతృభాషలో అంటూంటే


ఈ రాజబాబుకి అర్థం కాక

అల్లు రామలింగయ్యని 


సారూ! 

ఆ దొరవారు

 పదే పదే ఏంటండీ అంటూంటారు? అని అడిగితే


తనకీ తెలియని దానిని తెలీదని ఒప్పుకోలేని 

ఆ అల్లు దుబాసి


ఏం లేదురా!

గాడిదగుడ్డు

కంకరపీసు

అని గడుసుగా తప్పించుకునే సమయస్ఫూర్తి నేర్పే  అమ్మ గడసరి భాష మన తెలుగు భాష


ఇది ఏ సందర్భంలో వాడతారంటే

తనకి కూడా తెలీని ఓ విషయాన్ని తనకన్నా చిన్నవారి

ముందు తెలీదు అని ఒప్పుకోడానికి చిన్నతనంగానో అహమో అడ్డొచ్చినపుడు

ఆ.. గాడిదగుడ్డు. నోర్మూసుకో అని తప్పించుకుంటారు నేటికీ కొందరు.


ఇవీ ఈ పూట తేనీటి ☕వేళ మనకే సొంతమైన మన తెలుగు పడికట్లు.


కాసేపు అమ్మభాషలో అమ్మతో మాట్లాడితే ఎలా ఉంది? అందుకే తేనె కన్నా తీయని కమ్మనైనది మన అమ్మభాష.


అమ్మతో వీలైనంత ఎక్కువసేపు మాట్లాడండి

కనీసం 

అమ్మభాషతో ఐనా వీలున్నపుడల్లా సావాసం చేయండి

పాఠకులకి 

నమోవాకములతో

కామెంట్‌లు లేవు: