26, జులై 2023, బుధవారం

కల్పనలు కాదు .

 మారుతున్న  వివాహ సాంప్రదాయాలు .


పూర్వం  ఆడపిల్ల  తండ్రి ఫలానా  ఊరిలో  ఫలానా  వారి అబ్బాయి  ఉన్నాడని తెలుసుకుని వారి దగ్గర  బంధువులను కాని , ఆప్తులైన స్నేహితులను కాని  వెంట బెట్టుకుని వరుని  ఇంటికి  వెళ్ళి వరుని తల్లిదండ్రులను , వారి ఇంట ఉండే బంధువులను కలిసి , వరుని  కుటుంబ  స్థితి గతులు , సాంప్రదాయలను  అన్నీ పరిశీలించి  తనకు నచ్చిన పక్షంలో  వరుని మరియు  వరుని  తల్లిదండ్రులను  తమ కుమారైను  పెళ్ళి చూపులు చూడటానికి  తమ ఇంటికి రావలసినదిగా ఆహ్వానించేవారు.


తర్వాత మంచిరోజు  చూసుకుని  వరుడు అతని తల్లిదండ్రులు  కొంతమంది  ముఖ్య బంధువులు  కలసి  వధువు ఇంటికి  వెళ్ళి  పెళ్ళి కుమార్తెను  చూసి అక్కడ వధువు  తల్లిదండ్రుల  స్థితిగతులు , సాంప్రదాయాలు  పరిశీలించి , ఇరు పక్షముల వారికి  నచ్చిన పక్షములో  ముందడుగు వేసేవారు.


ఇప్పుడు  నూటికి  80 శాతం కుటుంబాలలో  ఆ పద్ధతులు  మచ్చుకు కూడా  కానరావడం లేదు.


వధువు తరపు  వారెవరూ  వరుని ఇంటికి  వెళ్ళటం , పెళ్ళి చూపులకు ఆహ్వానించడం మరుగైపోయింది .


ఇప్పుడు  వరుని తరపు  వారు  వధువు  వివరాలు  తెలుసుకుని  మా అబ్బాయి  ఉన్నాడని  ఫోను  చేస్తే  వధువు తరపు వారి నుండి  వచ్చే సమాధానాలు  -----


- మేము చాలా busy గా ఉన్నామండీ. మీరు మరోసారి  ఫోను చేయండి .


-  అలాగా మీ వివరాలు చెప్పారుగా . మేం ఫోను చేస్తాం లేండి .


-  మాటి మాటికి  ఎందుకండీ ఫోను చేస్తారు. మేమే చేస్తామన్నాముగా .


- మా అమ్మాయి  పెళ్ళయ్యాక Joint Family లో  ఉండనంటోంది . విడిగా ఉండడం మీ కిష్టమైతే  ముందడుగు  వేస్తాం.


-  మీకు రెండు కార్లు ఉన్నాయంటున్నారు . ఒక కారు మీ అబ్బాయి మరో కారు మా అమ్మాయి  వేసుకుని  ఆఫీసుకు వెడితే మీ వారెలా ఆఫీసుకు వెడతారు ?


పైన  నేను రాసినవన్నీ కల్పనలు కాదు .


అక్షరాలా  అనుభవ పాఠాలు .


" వరుడు  వధువు  మధ్య రెండు సంవత్సరాల వ్యత్యాసమునకే వద్దంటున్నారేమిటి ?  మన కాలంలో దాదాపుగా  ఇరువురి మధ్య ఎనిమిదేళ్ళు తేడా లేదా ?  అంత దాకా ఎందుకండీ  మా అమ్మాయిలకు అల్లుళ్ళకు  ఆరేళ్ళు  తేడా ఉంది. మేము కూడా  ఈ మధ్య కాలంలోనేగా వివాహం చేసింది " అని  నా బోటి గాడెవడైనా వధువు తండ్రికి  నచ్చచెప్ప బోతే  వధువు తండ్రి నుండి వచ్చిన సమాధానం "  మీరు పెళ్ళిళ్ళు  చేసినప్పుడు  మీ అమ్మాయిలు మీ మాట విన్నారేమో ? ఇప్పుడు మాకు చేతకాదు " అని వెంటనే ఫెడేల్ మని మొహం బద్దలు కొట్టినట్లు వధువు తండ్రి జవాబు .


సిగ్గులేక వధువు ఇంటికి  వెడితే , పిలవని పేరంటానికి దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీ దేవిలా వరుని తరపు వారు అవమానాలను ఎదుర్కొంటున్నారు .


కనీసం  వరుని వివరాలు తీసుకోకుండా  సాగనంపుతున్నారు .


మీరు మా ఇంటికి  రావనక్కరలేదని చెప్పకనే చెబుతున్నారు .


పది సంవత్సరాల  క్రితం  మేము ముగ్గురమ్మాయిల వివాహాలు చేసిన వారమే .


మా పిల్లలూ విదేశాలలో ఉన్నారు . ఉద్యోగాలు  చేసుకుంటున్నారు కూడా .


మరి  వీళ్ళందరూ ఎందుకు  ఏం చూసుకుని  అహంకరిస్తున్నారు ?


నడమంత్రపు సిరా ?


లేదా అమ్మాయిలకు  నచ్చ చెప్పలేక పోతున్నారా ?


నిజానికి  ఆ రోజుల్లో  ఇరు పక్షముల  తల్లిదండ్రులదే  వివాహాన్ని నిశ్చయించడంలో అంతిమ నిర్ణయం.


ఇప్పుడు  కేవలం వారి పాత్ర రబ్బర్  స్టాంపు లాంటిది .


అన్నీ నిర్ణయించుకున్న  తర్వాత ఆఖరున తెలిసేది  వారి తల్లిదండ్రులకే .


చివరికి  పరువు దక్కించు కోవడానికి  ఆ  పెళ్ళి చేసి  చేతులు  దులుపుకుంటున్నారు .


ఇక  ఆ కాపురం  సవ్యంగా  సాగడమనేది  ఆ దంపతుల  EGOS  మీదే  ఆధారపడి  ఉంటోంది .


వారిలో  హెచ్చు తగ్గుల భావనల వల్ల అపార్ధాల వల్ల  చాలా మంది కాపురాలు  మూనాళ్ళ ముచ్చటే అవుతోంది .


కాలం ఎల్ల వేళలా ఒక తీరుగా ఉండదు .


నాడు వరుని తల్లిదండ్రుల ముందు  చేతులు కట్టుకుని నుంచున్నారు వధువు తల్లిదండ్రులు .


నేడు  మా అబ్బాయికి  పెళ్ళే కాదేమో అని ఆందోళన పడి  వధువు తల్లిదండ్రుల  షరతులన్నిటికీ తలవొగ్గుతున్నారు .


కానీ  కాలం ఎప్పుడూ  ఒక్కలా ఉండదు .


రాజు  బంటౌతాడు. బంటు రాజౌతాడు.


ఈ విషయం  ఇరుపక్షాల వారు గ్రహించాలి .


ముఖ్యంగా  ప్రస్తుతం  వధువు తల్లిదండ్రులు  ఈ విషయం ఆలోచించాలి .


ఈ రోజుకు  అలనాటి  సాంప్రదాయాలను పాటించే  ఉత్తములకు  శతకోటి  వందనములు .

Copied from Vasu Gulf Journalist  🧱 wall

కామెంట్‌లు లేవు: