26, జులై 2023, బుధవారం

*🪔శ్రీవేంకటేశ్వర దివ్య చరిత్ర - 5🪔

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీవేంకటేశ్వర దివ్య చరిత్ర - 5🪔*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *వైకుంఠమున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట* 


కైలాసమును వీడి ఆ భృగువు ఉత్కంఠతతో వైకుంఠమునకు వెడలినాడు. బ్రహ్మను పరీక్షించుట జరుగనే జరిగినది. శంకరుని పరీక్షించుట జరిగినది.


శ్రీ మహావిష్ణువును పరీక్షించవలసియున్నది, అందువలననే భృగువు శోభాయమానమగు వైకుంఠమునకు ప్రయాణమై వైకుంఠమును చేరినాడు.


అచ్చట శ్రీమహావిష్ణువుండెడి సొగసు వెలార్చు సుందర మందిరమును ప్రవేశించినాడు.


 ఆహా! ఆ లక్ష్మీనారాయణుల దివ్యస్వరూపములు,


 శ్రీమహావిష్ణువు శేషపాన్పు పై ఠీవిగ పవ్వళించుటలో గల ఆ వంపుసొంపు యెంత చక్కగానున్నది! పవ్వళించియున్న శ్రీమన్నారాయణుని పాదకమలములను లక్ష్మీదేవి తన కర కమలములతో మెల్లమెల్లగ ఒత్తుచున్నది. 


హృదయమున భృగుమహర్షి నారాయణ స్మరణ మొన్నర్చినాడు. తదుపరి ఒక్కసారిగ శ్రీమన్నారాయణుని చెంతకేగి అదరూ బెదురూ లేకుండగ ఆయన పవిత్ర వక్షస్థలమును తన్నినాడు.


శ్రీ మహావిష్ణువు యొక్కవక్షస్థలమును తన్నుట ఎవ్వరునూ, ఎప్పుడునూ చేయ సాహసించని పని దానిని భృగువు చేసినాడు. 


లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యమునకు అంతులేకపోయెను. తనను తన్నినందులకు వైకుంఠవాసుడావంతయు చలించలేదు. 


వీసమెత్తయిన కోపమును పొందలేదు. పైగా తన పాన్పు నుండి దిగి వెడలి భృగుమహాముని పాదములను పట్టుకొని


 ‘మహర్షీ! నేడు నేనెంత ధన్యుడనైతిని, మహాతపశ్శక్తి సంపన్నులగు మీ పవిత్ర పాదధూళి వలన నా శరీరమెంతగానో పవిత్రమైనది. 


అయ్యో! మరచితిని. కుసుమ సమాన కోమలములైన మీ పాదములు నా శరీరమును స్పృశించు ఎంతగా నొచ్చికొనినవో కదా! స్వామీ! ఏదీ మీ పాదములిటు చూపుడు’’ అనిచూచి కొంత ఒత్తెను, 


భృగువునకు పాదమున ఒక కన్ను గలదు. ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదముల నొత్తుచు చిదిపివేసెను.


 పిదప భృగుమునితో ఈ విధముగాననెను. 


‘‘భృగుమహర్షీ! మీ హృదయమున గల అభిప్రాయమును, మీరు వచ్చిన పనిని నేను గ్రహించనే గ్రహించితిని. మీరు ఏ పని నిమిత్తము నా కడకు వచ్చిరో ఆ పని అయినందులకు నేను మిక్కిలిగ ఆనందించుచున్నాను.’’


 ప్రశాంతమయిన, గంభీరమయిన శ్రీమహా విష్ణువు యొక్క పలుకులు భృగుముని పై అమృతపు చినుకులుగనుండెను. 


పాదమున గల కన్నుపోయిన పిదప భృగువున కేదియో నూతనానుభూతి కలిగెను. 


శ్రీమహావిష్ణువు యొక్క పరమశాంత స్వభావమునకు భృగువు లోలోపల మహానందమును పొందెను.


 ఆహా ఎంతటి సాత్త్వికమూర్తి విష్ణుమూర్తి! అనేక విధములైన శక్తి సంపదలున్నప్పటికినీ, తాను వక్షస్థలమున తన్నినప్పటికినీ కించిత్తూ మాట్లాడకదూషించలేకపోయెను.


 పైగా నా యొక్క పాదమున కేమయినా నొచ్చినదేమోనని నొచ్చుకొనుచున్నాడు. కావున శ్రీ మహావిష్ణువు మించిన సత్త్వగుణ ప్రధానుడు మరియొకడు లేడని గుర్తించాడు భృగువు.


 శ్రీమహావిష్ణువుతో అతడు, ‘సకలలోకపితా!నీవంటి మహాత్ముని పరీక్షించుటకు అరుదెంచుటయే పాపమునకు కారణమగును. నా పాపము బహుజన్మలెత్తిననూ పోవునా? తీరునా? నా తప్పును క్షమించవలసినదిగానూ, నన్ను రక్షించవలసినదిగానూ కోరుచున్నాను’’ అనెను.


 శ్రీమన్నారాయణుడు ముఖము నుండి చిరునవ్వు వెన్నెల కురిపిస్తూ కన్నుల నుండి దయను మెరిపిస్తూ భృగుమహర్షీ! నీ హృదయము నేనెరుంగనిదా! 


మీ పరీక్ష వలన మా గొప్పతనము మరియొక మారు ఋజువైనది అంతియే కదా! అందువలన నీకిది పాపదాయకము కాదు, నీకు శుభము కలుగును గాక! 


నీకు లోకకళ్యాణ కారకత్వము కలుగునుగాక! వెడలిరమ్ము అని కటాక్షించుచూ పలికినాడు.


 నారాయణుడు కరుణించగనే భృగువు ‘అమ్మయ్య’ అనుకొని భూలోకమునకు హుటాహుటిగా ప్రయాణమయ్యాడు.


 *వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా,* *గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* 


శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*ఓం నమో వేంకటేశాయా*


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: