26, జులై 2023, బుధవారం

పిల్లవాడు - పిల్లివైద్యం

 పిల్లవాడు - పిల్లివైద్యం


పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీ మఠంలో భక్తులు బారులు తీరి ఉన్నారు. వారిలో దంపతులొకరు మగబిడ్డతో వరుసలో నిలబడి ఉన్నారు. వారి వంతు రాగానే, బిడ్డను మహాస్వామి వారి పాదాల చెంత ఉంచి భోరున ఏడవసాగారు. ఇతర భక్తులు వారివైపు జాలితో చూస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి చూస్తే బంగారు బొమ్మలా ఏ కదలికా లేకుండా ఉన్నాడు. కళ్ళు కూడా కనిపించడం లేదు అని అర్థమైంది.


స్వామి వారు పిల్లవాడి వంక కొద్ది సేపు తీక్షణంగా చూసి, "ఇంకా అలానే ఉంది. తగ్గలేదు" అని మౌనంలోకి వెళ్ళిపోయారు. మహాస్వామి ఏమి అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపాగి మఠం అంతేవాసిని కొద్దిగా పాలు, నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు. పాలలో పువ్వుని ముంచి పిల్లవాడి తలకు, కళ్ళకు, కడుపుకు, కాళ్ళకు రాసి కనులు మూసి కొద్ది సేపు ప్రార్థన చేసారు. తరువాత ఆ బిడ్డ తల్లి తండ్రులతో, "మాయవరం(మైలాదుతురై) మయూరనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి, అక్కడ ఉన్న దక్షిణామూర్తి పాదాల చెంత పిల్లవాడిని ఉంచండి. ఇప్పుడే బయలుదేరండి" అని చెప్పారు. వెంటనే ఆ దంపతులు ఆ పిల్లవాణ్ణి తీసుకుని పయనమయ్యారు.


వీరు అక్కడకు చేరుకునేటప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఈ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటున్నారు. గణపతిని దర్శించుకుని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థించసాగారు. ఒక గంట గడిచింది. పిల్లవాడిలో ఏ కదలికా లేదు. చుట్టూ మూగిన జనం ఆ బిడ్డ తల్లిదండ్రుల నమ్మకం చెడిపొయేలాగా మాట్లాడుతూ, వారిని మాట్లాడించే ప్రయత్నం చేయనారంభించారు.


అదే సమయానికి ఒక తెల్ల పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరకు వచ్చింది. పిల్లి నుంచి బిడ్డను తల్లి కాపాడ సాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా పిల్లి పిల్లాడి నుదురు నాకి, తల నుంచి పాదాల వరకు వాసన చూసి వెళ్ళిపోయింది. పుట్టినప్పటి నుంచి కదలని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వి కేరింతలు కొట్టసాగాడు. ఆ తల్లిదండ్రులు "జయ జయ శంకర హర హర శంకర" అని ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని ఎత్తుకున్నారు. పిల్లవాడు తల్లిదండ్రులను చుసి నవ్వాడు. ఈ సంఘటన చూసిన జనాలు స్వామివారి దైవత్వాన్ని కొనియాడారు.


పూర్వ జన్మలలో పిల్లిని చంపినట్లు అయితే, అలాంటి వారు మరు జన్మలో సంతాన హీనులుగా కానీ, మానసిక/శారీరిక వైకల్యం ఉన్న సంతానం కానీ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. 


మహాస్వామి వారి గొప్పతనం ఏమని చెప్పేది. ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపం వల్ల ఆ తండ్రికి అలాంటి సంతానం కలిగిందో, ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి కర్మను మార్చారు. మహాస్వామి వారి దగ్గరకు వచ్చి శరణు వేడిన వారి బాధలను స్వామి వారు ఎన్నిటినో తీసి వేసారు. వైద్యులు నయం చేయలేని, కర్మవశాత్తు కలిగే ప్రాణంతక రోగాలను ఎన్నింటినో స్వామి వారు తొలగించారు.


ఇలాంటివి చదువుతుంటే, స్వామి వారు మన మధ్యలో ఇంకో 100 యేళ్ళు ఉంటే బావుంటుంది అని అనిపించకుండా ఉంటుందా?


--- ఆదిత్య నండూరి, హైదరాబాద్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: