26, జులై 2023, బుధవారం

రాజుగారు తలచుకుంటే

 మహా భారత యుద్ధానంతరము హస్తిన పాలకులు ప్రభ కోల్పోయి నామ మాత్రపు పాలకులు అయ్యారు. 


మగధ రాజ్యపు పాలకులు అయిన జరాసంధుని  వంశస్తులు దేశానికి పాలకులు అయ్యారు. వీరిని బృహద్రధ వంశం అంటారు.


బృహద్రధ వంశస్తులు మొత్తం 1006 సంవత్సరాలు రాజ్య పాలన చేశారు..ఆ పిమ్మట అవంతీ పాలకులు అయిన ప్రద్యోతన వంశ పాలనలోకి పోయింది.


ప్రద్యోతన వంశస్తులు 138 సంవత్సరాలు యావద్దేశాన్ని చక్రవర్తులుగా పాలించారు. 


ఆ తర్వాత దేశం కాశీ రాజు  శిశునాగుని పాలనలోకి పోయింది మగధ. శిశునాగుడు 1994 BCE నుండి 1954 BCE వరకూ పాలించారు.


ఈ శిశునాగుని కి కొన్ని అక్షరాలు సరిగ్గా పలికెడివి కావు..అవి తన ముందు ఎవరైనా పలికితే వారు తనను అవమానించారని వారికి శిక్ష వేసేవాడట. చివరకు ఈ ధోరణి తో అంత:పుర స్త్రీల మీద కూడా  చిత్రవిచిత్రముగా ప్రవరించడం అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాయి.


ఓ మారు అతని మూడవ ఇల్లాలు చంద్రావతి  పరిహాస పాత్రముగా రాజుగారిని ప్రణయ సమయములో వెక్కిరింత ధోరణిలో అన్నదట.


వెంటనే చక్రవర్తి గారయిన శిశునాగుని కోపం నషాళానికి అంటింది . తన అంతఃపురములో ఎవ్వరూ " ట, ఠ, డ, ఢ, శ, ష, హ, క్ష " లతో  ఉన్న పదాలు ఏవీ మాటాడడానికి వీల్లేదు అని ఒక శాసనం చేసి పారేశాడట. (హతవిధీ! ఈ కథను ఎవరూ ఇపుడు ఆయన చెవిన వేయకండి సామీ..ఆయనా శాసనం చేసి పడేసినా పడేస్తారు)


అలా ఆ అక్షరాలు శిశునాగుడు పలకకుండా చేస్తే..అతడి కుమారుడు అయిన కాకవర్మ( 1954 BCE  నుండి 1918 BCE) పత్ని లీలావతి తెలివిగా తన కుమారుడికి " క్షేమ ధర్ముడు" అని పెట్టి సదరు తాత గారిని ఇరకాటంలో పెట్టేసరికి.. అసలు కంటే కొసరు ముద్దు కాబట్టి ..మనవని కోసం ఆ కఠిన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.


రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదువా మరి.

కామెంట్‌లు లేవు: