ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం - 6/11
(ఈ నెల 1వతేదీ హనుమజ్జయంతి)
VI. హనుమంతుడు - కుండలినీ యోగ సాధకుడు
యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి,
స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా చక్రములను అతిక్రమించి,
చివరికి సహస్రారపద్మాంతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందుతాడు.
అదే యోగ సిద్ధి.
హనుమంతుడు
- జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు.
- బుద్ధిమతాంవరిష్ఠుడు. అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధితో, లక్ష్యశుద్ధి కలవాడు.
1.మూలాధారం:
హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.
2.స్వాధిష్ఠాన చక్రం:
మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.
3.మణిపూర చక్రం:
తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపుమని అడ్డగించింది.
ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.
4.అనాహత చక్రం:
సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.
5.విశుద్ధి చక్రం:
లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.
ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్నతిక్రమించడం.
6.ఆజ్ఞా చక్రం:
మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.
కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేతనూ ఆమె సీత కాదనుకొన్నాడు.
ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి,
మరల విచక్షణా జ్ఞానంచే, గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం.
7.సహస్రార చక్రం:
అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.
ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి
సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.
చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.
ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు.
మనం ఆయనని ఆరాధిస్తూ, ఆయన ఆచరించిన ఈ యోగమార్గంలో పయనించి,
"శ్రీచక్రాంతర్గత బిందు స్వరూపిణి" అయిన అమ్మ దర్శనం పొందుతాం.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్ జై జై హనుమాన్
కొనసాగింపు ....
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
(86399 68383)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి