30, సెప్టెంబర్ 2020, బుధవారం

15-10-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఈ ఆత్మను ఎవరు తెలిసికొనగలరో, ఎవరు తెలిసికొనలేరో వచించుచున్నారు -


ఉత్క్రామన్తం స్థితం వాఽపి 

భుఞ్జానం వా గుణాన్వితమ్ | 

విమూఢా నానుపశ్యన్తి 

పశ్యన్తి జ్ఞానచక్షుషః || 


తాత్పర్యము:-(ఒక శరీరమునుండి మఱియొక శరీరమునకు) బయలుదేఱుచున్నవాడును, లేక, శరీరమునందున్నవాడును, లేక విషయముల ననుభవించుచున్నవాడును, (సత్త్వాది) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు (తెలిసికొనజాలరు). జ్ఞానదృష్టిగలవారు మాత్రము చూచుచున్నారు (తెలిసికొనుచున్నారు).(అనగాఆయా క్రియలు జరుపుచున్నపు డాతనిని అజ్ఞులెఱుంగజాలరనియు, జ్ఞానులు మాత్ర మెఱుంగ గలరనియు భావము).


వ్యాఖ్య:-భగవంతుడు మాకేల కానుపించకనున్నారని అనేకులు ప్రశ్నించుచుందురు. దానికి, సమాధానమును శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకమున నొసంగిరి. నీవు జ్ఞాననేత్రమును (ఆత్మానాత్మవివేకమును) సంపాదించినచో ఇచ్చటనే, ఈ శరీరమునందే పరమాత్మను దర్శింపగలవు, అని భగవానుడు నుడువుచున్నాడు. వారికై దూరమున వెతకనక్కఱలేదు. జీవునియొక్క స్వశరీరముననే ఆతనిని కనుగొనవచ్చును. తినుచు, త్రాగుచు, అనుభవించుచున్న ఆ వ్యక్తిని వివేచనతో, సూక్ష్మదృష్టితో, జ్ఞాననేత్రముతో మనుజుడు కనుగొనగలడు (పశ్యన్తి జ్ఞానచక్షుషః). ప్రాపంచిక దృశ్యవాసనాప్రాబల్యము వలన అజ్ఞానులాతనిని తెలిసికొన జాలకున్నారు. అద్దమును ప్రపంచమువైపు త్రిప్పి పట్టుకొనినచో ముఖము అందు కానరాదు. తనవైపు త్రిప్పుకొనినచో మాత్రమే కానవచ్చును. అట్లే మనస్సును బహిర్ముఖముగ, చపలముగ, వాసనాయుక్తముగ గావించినచో ఆత్మవస్తువు అందు గానరాదు. అంతర్ముఖముగ, నిశ్చలముగ, వాసనారహితముగ నొనర్చిన మాత్రమే కానవచ్చును. నిశ్చలమనస్సు, ఆత్మానాత్మవివేకము కలవానికే ఆత్మదర్శనము, లేక భగవద్దర్శనము అగుచుండును. (ఇచట భగవద్దర్శనమనగా భగవదనుభూతి యని అర్థము).


"ఉత్క్రామన్తం…" అని చెప్పుటచే ఆత్మ జీవరూపమున ఈ శరీరమందే తినుచు, త్రాగుచు, మఱియొక శరీరమును బొందుచునున్నదని తెలియుచున్నది. కావున ముముక్షువులు భగవద్దర్శనముకై దూరదూరముగ బోనక్కఱలేదు.

జ్ఞాననేత్రముచే మహనీయులు ఆ యాత్మను తప్పక చూడగల్గుచున్నారని ఇట చెప్పుటవలన జీవితమునందు ప్రతి మానవునియొక్క ప్రథమకర్తవ్యము (అవివేకమును బోగొట్టుకొని, విషయవిరక్తిగలిగి మనస్సును బయటకు పరుగెత్తనీయకుండచేసి జ్ఞాన విచారణద్వారా, హృదయపరిశోధనద్వారా లోనగల) ఆత్మనెఱుంగుటయే యగును. "పశ్యన్తి జ్ఞానచక్షుషః” అని అసందిగ్ధముగ చెప్పివేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరువాయి భగవద్దర్శనము జీవునకు లభించియే తీరునని స్పష్టమగుచున్నది. అట్టి జ్ఞాననేత్రము లేనిచో, జీవితము నిరర్థకమే కాగలదు.


ప్రశ్న:- ఆత్మను ఎవరు చూడగలరు? ఎవరు చూడలేరు?

ఉత్తరము:- జ్ఞాననేత్రముగలవారు చూడగలరు. అది లేనివారు అనగా అజ్ఞానులు చూడలేరు. (జ్ఞాననేత్రము అనగా ఆత్మానాత్మవివేకము).

కామెంట్‌లు లేవు: