30, సెప్టెంబర్ 2020, బుధవారం

నైవేద్యం*

 *


దేవతల నివేదనకు యోగ్యమైన పదార్థం నైవేద్యం. పక్వాన్నాలు, మధుర పదార్థాలు, పండ్లు, రసాలు... ఇలా ఎన్నో నైవేద్యానికి ఉపయోగపడుతుంటాయి. పూజించేవారి శక్తి సామర్థ్యాలను అనుసరించి తారతమ్యాలు ఎన్ని ఉన్నా- అన్నీ భక్తి ముందు చిన్నవే. భగవంతుడు కూడా భక్తితో పత్ర, పుష్ప, ఫల, తోయాలలో ఏది సమర్పించినా దానినే తాను స్వీకరిస్తానని భగవద్గీతలో అన్నాడు. నివేదనకు భక్తే ముఖ్యం కానీ పదార్థాలు కాదు.

అసలు నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఎలాంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలని ప్రశ్నించుకుంటే కొన్ని విషయాలు బహిర్గతమవుతాయి. భగవంతుడికి చేసే పూజ సఫలం కావాలని, తనకు శ్రేయస్సు లభించాలని మనిషి కోరుకుంటాడు. కనుక పూజలో చివరగా తన కోరికలు సఫలం కావాలని పదార్థ నివేదనం చేస్తాడు. తాజాగా చేసిన వంటలు, తాజాగా లభించిన పండ్లు, కాయలు, మధుర రసాలు ఊరే పదార్థాలు... భగవంతుడికి ప్రీతిపాత్రాలు. వాటిని భక్తితో సమర్పించి, ప్రసాదంగా స్వీకరించి, మనిషి తృప్తి చెందుతాడు.

భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తింటాడా? తినడు కదా? ఎందుకీ నైవేద్యాలని ప్రశ్నించేవారుంటారు. నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపైన గల కృతజ్ఞతాభావాన్ని నైవేద్యం సూచిస్తుంది. అంటే లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతి అంటే భగవంతుడే కదా? ఈ చరాచర ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు అర్పించే నైవేద్యం కృతజ్ఞతావిష్కరణమే. నైవేద్యాల్లో ఉండేవేమిటి? పంచభూతాలే! మట్టిలో నుంచి పుట్టిన మొక్కల నుంచి వచ్చిన చెట్లు అందించినవే అమృతఫలాలు. గిరుల నుంచి పుట్టిన ఝరులు ఇచ్చినవే నిర్మలజలాలు. పక్వాన్నాలేవీ అగ్నిదేవుడి సహాయం లేకుండా లభించవు. స్వచ్ఛమైన గాలి వల్లనే ప్రకృతి సజీవంగా ఉండగలుగుతున్నది. ఇలా ప్రకృతి రూపంలో పరమేశ్వరుడు ప్రసాదించిన సంపదలే మానవాళికి, ఇతర ప్రాణికోటికి జీవనాధారాలు. కనుక మనిషి భగవంతుడికి యథాశక్తిగా నివేదించుకొని తృప్తి చెందుతాడు.

పరమార్థంగా ఆలోచించినప్పుడు మనిషి జీవితం భోగాల కోసం కాదని, అమృతయోగాల కోసం, అద్భుత త్యాగాల కోసమేనని సమస్త పురాణేతిహాసాలు ప్రబోధిస్తున్నాయి. మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని నివేదన చెబుతుంది. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని మహనీయులంటారు. వారి జీవితాలు అలాంటి ఆదర్శాలకు నెలవులు. భగవంతుడికి చేసే నివేదన కూడా ఈ సత్యాన్నే ప్రతిఫలిస్తుంది. సర్వసమర్పణ భావమే సర్వదా శ్రేయస్కరం.

ఏ విధమైన పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన సంపన్నులదాకా అందరూ పూజలు చేస్తారు. ఎందరో భక్తితో నైవేద్యాలు సమర్పిస్తారు. భగవంతుడికి అందరూ సమానులే. భక్తితో ఇచ్చినది ఏదైనా భగవంతుడికి ప్రీతిపాత్రమే అనడానికి భక్త శబరి, భక్త కన్నప్ప వంటివారి చరిత్రలు ఉదాహరణలవుతాయి. భక్తి లేకుండా ఎవరు ఇచ్చినా వ్యర్థమే అవుతుందికాని సార్థకం కాదు. సమస్త మంగళాలకు, శుభాలకు ఆలవాలమైన భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును, ఓజస్సును వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయుష్యం పెరుగుతుందని, ఆరోగ్యం సంప్రాప్తిస్తుందని పెద్దల ఉపదేశం.

నైవేద్యం అంటే భగవంతుడు ప్రసాదించే అమృతభాండమే. దాన్ని భక్తితో స్వీకరించి, సేవించి, భుజించి, మనిషి చిరంజీవి కావాలి!

కామెంట్‌లు లేవు: