“ధైర్యే సాహసే లక్ష్మీయని” అష్టలక్ష్ములలో చేర్చిన ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారున్న లోకమిది. ‘ధైర్యమే వెలలేని ఆభరణమని’ భావించి జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వారూ ఉన్నారు.
“ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియన్న” భర్తృహరి సుభాషితాన్ని నిజం చేస్తూ యక్షప్రశ్నలకు సమాధానాలిచ్చి నలుగురు సోదరులను దక్కించుకున్న పాండవాగ్రజుడు స్థితప్రజ్ఞత లోకానికి ఆదర్శం.
“కార్యసాధనలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, అపజయమెదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదని, సత్య, ధర్మాలదే విజయమన్న” పురాణాలు , అంతిమ విజయాలు దక్కించుకున్న రాముడు , పాండవుల చరితలను రామాయణ, మహాభారతాల్లో వర్ణించాయి.
“ ఆపదల నుండి కాపాడేది, దుఃఖాన్ని చేరనీయనిది, కార్యసాధనకు మార్గమైనది ధైర్యమేనని” మనుచరిత్రలో పెద్దన లిఖించినట్టు యముణ్ణి మెప్పించి పతిని దక్కించుకున్న సావిత్రి, నలుడికి దూరమై బాధలనుభవించినా ధైర్యంగా ఎదుర్కొన్న దమయంతిల చరితలను పురాణాలు అందించి మహిళలకు మార్గదర్శనం చేశాయి.
“పరులెవ్వరూ సాధించలేని కార్యాలను, విశ్వసించిన సిద్ధాంతానికి కట్టుబడి కొనసాగించడమే ధైర్యమని” గ్రంథాలు చెప్పినట్టు భరతమాత స్వేఛ్చకై బ్రిటీషు వారినెదిరించిన మహాత్ముడు నిరూపించాడు.
“ఆశ, ధైర్యాలు విజయ కిరీటంలో రెండు వజ్రాలన్న” మాటలకు ప్రతిరూపాలన్నట్టు ప్రవర్తించిన వారున్నారు. కాల్చమని ఆంగ్లేయులకు రొమ్ము చూపిన టంగుటూరి ప్రకాశం, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు, శత్రువుకు తలవంచక ఆత్మార్పణం చేసుకున్న చంద్రశేఖర ఆజాద్, ఉరికంబమెక్కినా భయమెరుగని భగత్ సింగ్ తదితరులు నిరూపించారు.
“ధైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని” పెద్దలన్నట్టుగా ముందుకు సాగిన మహానుభావుల్ని చరిత్ర గుర్తించింది. పత్రికల ద్వారా స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన కాశీనాధుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, సి.వి. చింతామణి , అయ్యదేవర గార్లు బ్రిటీషు ఆగడాల నెదుర్కొన్నారే తప్ప వెనుకడుగేయలేదు. కేసరి , మరాఠా పత్రికల్లో స్వాతంత్య్ర వార్తలు వ్రాసినందుకు బాలగంగాధర్ తిలక్, తెలుగు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం వ్రాసినందుకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావులకు జైలు శిక్షలు విధించినా భయపడి వెనక్కు తగ్గలేదు.
కుటుంబాలకు దూరమై శీతోష్ణస్థితుల కతీతంగా విధులు నిర్వర్తిస్తూ దేశరక్షణకై ప్రాణాలొడ్డుతున్న వీరసైనికుల ధైర్య సాహసాలే కాదు త్యాగాలూ తిరుగులేనివిగా కీర్తించాలి.
“ఏ కార్యం తలపెట్టినా ధైర్యంగా ముందడుగేయాలని, లేనప్పుడు విజయం దక్కదని” విశ్వసించినప్పుడే పరాజయం ఎదురైనా తట్టుకుని నిలబడే ధైర్యం కలుగుతుంది.
“పుట్టుకతో ధైర్యసాహసాల్ని వెంట తెచ్చుకోరని, పరిస్థితులు, అనుభవాలే మనిషిని తీర్చిదిద్దుతాయన్నట్టు” ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలను శరణు వేడకూడదు. ధైర్యంగా జీవితాన్ని కొనసాగించే వారికి లోకమే దాసోహమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి