30, సెప్టెంబర్ 2020, బుధవారం

684. ఓంశ్రీరాజరాజేశ్వర్యై నమః!🙏

 684. ఓంశ్రీరాజరాజేశ్వర్యై నమః!🙏


శా. శ్రీవారాణసి విశ్వనాథు సతివౌ శ్రీమద్విశాలాక్షిగా


నీవారిన్ బతితోడఁ గాచెదవుగా నిష్ఠన్ సదా ప్రేమతో.


నీవే మాకిల దిక్కు. నమ్మితిమి నిన్నే మమ్ము గాపాడుమా.


జీవన్ముక్తికి మార్గమీవె జననీ! శ్రీరాజరాజేశ్వరీ! 1.


శా. జీవం బీవు, శివుండు బ్రహ్మ, కనఁగా జీవాత్మ బ్రహ్మైక్యమున్


నీవే తెల్పుము చెందు మార్గము, భవానీ! నీవె మార్గంబువై


సేవాతత్పరులైన భక్త తతికిన్ చేయూతనిమ్మా! శివా!


జీవన్ముక్తికి మార్గమీవె జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 2.


శా. భావంబందున బ్రహ్మ తత్వ మదియే వర్ధిల్లు నీ సత్కృపన్.


జీవుల్ బాధలనెల్ల వీడి మననౌన్ జిన్మార్గ సద్వర్తనన్,


దైవత్వంబు లభించు జీవికి సుబోధన్ తాన్ మనన్ గల్గుటన్,


జీవన్ముక్తికి మార్గమీవె జననీ! శ్రీరాజరాజేశ్వరీ! 3.


శా. దైవాధీన జగంబునన్ మెలఁగుటన్ తత్వంబపేక్ష్యంబె. స


ద్భావాధీనమె దైవమెన్న విలసద్భావంబు నీచేతనే


జీవుల్ పొందగ సాధ్యమౌనుగద తజ్జీవంబె నీవౌటచే.


జీవన్ముక్తికి మార్గమీవె జననీ! శ్రీరాజరాజేశ్వరీ! 4.


శా. సేవాధర్మ మెఱుంగఁ జేయు జననీ! సేవింప జీవంబులన్


నీవే సత్కృప తోడఁ గాచెదవుగా నీ భక్తులన్ నిత్యమున్,


భావంబందు వెలుంగుచుండుమిల సేవాభాగ్యమున్ గొల్పగా,


జీవన్ముక్తికి మార్గమీవె జననీ! శ్రీరాజరాజేశ్వరీ! 5.


మ. భవబంధంబు లగాధ మార్గము లగున్ భావింప జీవాళికిన్


జవసత్వంబులు వ్యర్థమౌను భువిపై సాధింపగా నేరమిన్


నవనీతాన్విత దైవమున్ నరుఁడు. జ్ఞానంబున్ సదా గొల్పుచున్


శివతత్వంబు నెఱుంగఁజేయు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 6.


మ. శ్రవణానందము గల్గు నీ చరితమున్ శ్రద్ధన్ వినం గల్గినన్


కవితావేశము పొంగిపొర్లునుగదా కల్యాణి! నిన్ గాంచినన్.


శివదేహంబున నీవునున్ గలుగుటన్ జీవప్రభల్ వర్ధిలెన్.


శివ తత్వంబు నెఱుంగఁ జేయు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 7.


మ. కవులం గల్గెడి కల్పనా గరిమ నీ కారుణ్యసౌభాగ్యమే.


శివ నామంబునఁ గల్గు వెల్గు లవియున్ చెల్వొందు నీచేతనే. 


భవబంధంబులు వీడఁ జేయునదియున్ ప్రఖ్యాతిగా! నీవెగా.


శివ తత్వంబు నెఱుంగఁ జేయు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 8.


మ. భవితన్ గొల్పెడి తల్లి వీవె జగతిన్ భావించగా నాకు, నన్


నవమాసంబులు మోసి కంటి విచటన్ నా తల్లిగా వచ్చి నే


నవలోకించి నినున్ రచించెదను శ్రీనాథాదులన్ బోలుచున్.


శివ తత్వంబు నెఱుంగఁ జేయు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 9.


మ. ప్రవరుల్ పండితు లీసభన్ గలరు. తత్ ప్రాశస్త్యమెన్నన్ సతీ!


శివదీక్షాపరుఁడైన పండరిదగున్. వర్ధిల్లగా జేయుమా


కవులన్ గౌరవమొప్ప జూచు నతనిన్ కల్యాణ సంధాయినీ!


శివ తత్వంబు నెఱుంగఁ జేయు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ! 10.


అమ్మ పాదపద్మములకు భక్తిపూర్వక ప్రణామములతో

🙏🙏🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: