30, సెప్టెంబర్ 2020, బుధవారం

శివానందలహరి 12 వ శ్లోకం

 దశిక రాము




" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"


అవతారిక:

కొండ గుహలలో నివాసం, అగ్నిహోత్ర మధ్యంలో నిలవడం, పర్వతాలపై నివాసం,నీటిలో నిలవడం వాటికంటే, ఈశ్వర పాదపద్మంపై అర్పింౘబడిన 

నిర్మలమైన అంతః కరణము విశిష్టమైన దని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు.


శ్లో" గుహాయాం గేహేవా _ బహిరపి వనేవా‌ ద్రి శిఖరే

         జలేవా వహ్నౌవా _ వసతు వసతేః కిం వద ఫలమ్ ,

         సదా యస్యైవాంతః _ కరణమపి శంభో తవపదే

         స్థితం చేద్యోగో సౌ _ సచ పరమయోగీసచ సుఖీ‍!!


పద విభాగము:

గుహాయాం _ గేహే _ వా _ బహః _ అపి _ వనే _ వా _ అద్రిశిఖరే 

 _ జలే _ వహ్నౌవా _ వసతు _ వసతేః _ కిం _ వద _ ఫలమ్ _

 సద _ యస్య _ ఏవ _ అంతఃకరణమ్ _ అపి _ శంభో _ తవ _

పదే _ స్థితం _ చేత్ _ యోగః _ అసౌ _ సః _ చ _ పరమయోగీ _ 

సః _ చ _ సుఖీ.


తాత్పర్యం :

ఈశ్వరా ! మానవులు పర్వత గుహల యందు గానీ , గృహము నందు గానీ బయట ఎక్కడో గానీ, పర్వత శిఖరంపైకానీ, నీటియందుకానీ, అగ్నియందు కానీ నివసింపవచ్చు. నివసించిన ఆ ప్రదేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది.? ఎవరి

హృదయం ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు ఆసక్తమై ఉంటందో , అదే యోగము , అతడే యోగి. అతడే సౌఖ్యవంతుడు. హృదయంలో భక్తి ప్రధానం కానీ నివసించే స్థలము ప్రధానము కాదని భావము.


వివరణ: 

ధ్యానం,అర్చనం, తపస్సు మొదలయిన వాటికి ఒక పవిత్ర ప్రదేశం వుండడం మంచిదే. నిజానికి గంగాది నదీతీరాలు, గ్రామాలకు సమీపంలో వుండే అరణ్య ప్రదేశాలు, పవిత్ర గుహలూ , ఆశ్రమాలూ మొదలైనవి పరమేశ్వర ధ్యానానికి అనుకూల ప్రదేశాలని శాస్త్రములే చెపుతున్నాయి. 

ఇక్కడ ఒకమాట మనం గుర్తుంౘుకోవాలి. ఇటువంటి ప్రదేశాల్లో వుండకూడదని శంకరులు చెప్పలేదు. ఇట్టి స్థలాలు తప్పక వుండాలి. 

వీటితోబాటు భగవత్పాద స్మరణము నందు ఆసక్తి కల చిత్తము కూడా ఉండాలనీ, అలా ఉంటేనే , ఆప్రదేశాలలో నివాసానికి సార్థకత అనీ, శంకరుల అభిప్రాయం గా మనం గుర్తించాలి. లేకపోతే అంతా వ్యర్థమనీ,లోకవంచన, 

ఆత్మవంచన అవుతుందన్నది సత్యము.

🙏🙏🙏


ధర్మము - సంస్కృతి

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: