30, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆదిపర్వము – 35

 

లక్క గృహం


కుంతీదేవి ధర్మజుని చూసి, “ధర్మజా,నీకు విదురుడు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు. ఏమి చెప్పాడు” అని అడిగింది.

దానికి ధర్మజుడు నవ్వుతూ “అమ్మా, విశాగ్నుల వలన అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. పైగా తాను దుర్యోధనుని వద్ద ఉండి, అతను మనకు ఏమన్నా అపకారం తలపెడితే, ఆ విషయం మనకు తెలియచేస్తాను” అని అన్నాడు. విదురునికి తమ మీద ఉన్న ప్రేమకు సంతోషిస్తూ వారు వారణావతానికి వెళ్లారు.

వారణావతంలో ఉన్న ప్రజలు పాండవులకు, కుంతికి ఘన స్వాగతం పలికారు. వారిని తమ నగరానికి సాదరంగా ఆహ్వానించారు. పురోచనుడు పాండవుల కోసం తానూ నిర్మించిన గృహములు చూపించాడు. పాండవులు ఎంతో సంతోషించి, శిల్పాచార్యుడైన పురోచానుని పూజించారు. పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వర్తించి నూతన గృహ ప్రవేశం చేసారు. ధర్మరాజు ఆ ఇల్లు అంతయు ఆణువణువూ పరీక్షించాడు. ఏదో కృత్రిమత్వం గోచరించింది.భీముని పిలిచి

“భీమా, ఈ ఇంటి గోడలు చూడు వింత వాసనవేస్తునాయి కదూ!” అన్నాడు.

“అవును అన్నయ్యా, లక్క,తైలము,నెయ్యి కలిసిన వాసన వస్తున్నాయి. పైగా మన ఇల్లు ఆయుధాగారం దగ్గరగా ఉండి. ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది” అన్నాడు.

అప్పుడు విదురుని మాటలు గుర్తుకువచ్చాయి ధర్మజునికి. విషాగ్నులు అంటే ఇవన్నమాట అనుకున్నాడు.

“అన్నయ్యా మన ఒక పని చేద్దాము. మనం ఇప్పటిదాకా ఉన్న పాత ఇంట్లోనే ఉందాము. ఈ ఇంటిని, ఇందులో ఉన్న పురోచనుడిని దహించి వేద్దాము” అన్నాడు భీముడు ఆవేశంగా.

భీమా తొందరపడకు, మనకు ఈ ఇంటి విషయం తెలిసి పోయింది అందుకని జాగ్రత్తగా ఉందాము. ఒక వేళ మనకు ఈ విషయం తెలిసినట్టు పురోచానునికి కానీ, దుర్యోధనునికి కానీ తెలిస్తే వేరే ఉపాయం పన్నుతారు. అది తెలుసుకోవడం మనకు కష్టం కావచ్చు. అందుకని, మనం ఏమీ తెలియనట్టే ఉందాము” అన్నాడు ధర్మజుడు. అప్పటి నుండి భీముడు చాల జాగ్రత్తగా ఉంటున్నాడు.

పురోచనుడు, పాండవులకు సేవ చెయ్యడానికి ఒక భోయ వనితను నియమించాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. అందరూ పాండవులు నివసిస్తున్న గృహంలోనే ఉన్నారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి చేరవేస్తున్నారు.

హస్తినాపురంలో ఉన్న విదురుడికి సుయోధనుని కుతంత్రం తెలిసిపోయింది. వెంటనే ఒక ఖనకుడిని పాండవుల వద్దకు పంపించాడు. వాడు పాండవుల వద్దకు వచ్చి, విదురుడు చెప్పిన మాటలు చెప్పాడు.ధర్మరాజును చూసి “ధర్మనందనా, రాబోవు కృష్ణ చతుర్థశి నాడు పురోచనుడు ఈ లక్క ఇల్లు తగలపెట్టగలడు. అందుకని మీ భవనము నుండి ఒక సొరంగ మార్గము తవ్వమని నన్ను విదురుడు పంపాడు. మీ అనుజ్ఞ అయిన తవ్వగలను” అన్నాడు. ధర్మరాజు విదురుని దూర దృష్టికి అచ్చెరువొంది, ఖనకుడికి అనుమతి ఇచ్చాడు. ఖనకుడు పాండవుల ఇంటి నుడి వెలుపలికి ఒక బిల మార్గమును ఏర్పాటు చేసాడు. దానిని భీముడు పరీక్షించి తృప్తి చెందాడు.

కృష్ణ చరుర్థశి నాడు కుంతీదేవి వారణావతంలో ఉన్న బ్రాహ్మణులకు, ముత్తైదువలకు భోజనము పెట్టి, దక్షిణలు ఇచ్చింది. రాత్రి అయింది. వారికి సాయంగా ఉన్న బోయ వనిత తన కుమారులతో కూడా కల్లు సేవించింది. అందరూ మత్తుగా నిద్ర పోతున్నారు.

అంతా సద్దుమణిగిన తరువాత,భీముడు ముందుగా పురోచనుడు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తల్లిని, తమ్ములను సొరంగ మార్గమున బయటకు పంపాడు. తరువాత తాము నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తరువాత ఆయుదాగారానికి కూడా నిప్పు పెట్టాడు. ఖనకుడికి తాము క్షేమంగా ఉన్నట్టు చెప్పి, సొరంగ మార్గము ద్వారా వెళ్లి తల్లిని, అన్నను, తమ్ములను కలుసుకున్నాడు. తరువాత అందరూ వడి వడిగా నడవసాగారు. కాని భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజును, అర్జునుడిని చెరి ఒక భుజం మీద కూర్చొపెట్టుకున్నాడు. నకుల సహదేవులను చెరి ఒక చేత్తో ఎత్తుకున్నాడు. వడి వడిగా నడవసాగాడు.

మరునాడు తెల్లవారింది. లక్క ఇల్లు తగలబాడటం వారణావత ప్రజలు చూసారు. అందరూ వచ్చి ఆ బూడిద కుప్పలను తొలగించారు. అందులో భోయవనిత, ఆమె ఐదుగురు కొడుకుల శవాలు కనిపించాయి. ఆ ఆరుగురు, కుంతీదేవి, పంచ పాండవులు అనుకున్నారు. భోరున విలపించారు. ధృతరాష్ట్రుని కుయుక్తిని తిట్టిపోసారు.

ఖనకుడు కూడా జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ, ఆ బూడిదను తాను తవ్విన సొరంగంలో పోసి అది కనపడకుండా చేసాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్లి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారు అని చెప్పాడు. వారణావతంలో ప్రజలు కూడా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయిన విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియచేసారు.

భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో దుఃఖించారు. వారితోపాటు విదురుడు కూడా దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు పాండవుల మరణానికి ఎంతో సంతోషించాడు, కానీ ఆ మంటలలో పురోచనుడు చనిపోవడం బాధ అనిపించింది.

కామెంట్‌లు లేవు: