30, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము

 


             రచన . 

గోపాలుని మధుసూదన రావు 



శ్రీనైమిశ వనమందున 

 శౌనక ముఖ్యాదులైన సంయమివర్యుల్ 

మానితమగు నొక మఖమును 

 పూనిరి సేయంగ మిగుల పూనిక తోడన్. 1

                    

అనయము భగవన్నామము 

 మనమందున దలచునట్టి మహనీయుండున్ 

ఘనుడగు నారదు డొచ్చెను

 మునిసంఘము లుండు వనికి మోదము తోడన్ 2   


మునిసంఘము నారదుగని 

మనమున యానందమొంది మన్నన సేయన్ 

మునియంతట చిఱునగవున 

ఘనమగు యీ సవనమునకు కర్తెవరనియెన్ 3


హవ్యంబుల భోక్తెవరని 

దివ్యుమ్డగు నారదుండు తెలియగ నడుగన్ 

"మువ్వురు మూర్తులె " యనుచును 

భవ్యులు యచటున్న మునులు పల్కిరి భక్తిన్ 4


విని యా మాటలు సంయమి 

యనియెను నీ రీతి నంత నాశ్చర్యముతో

" ఘన మునులగు మీరెప్పుడు 

వినలేదా సవనవిధులు విజ్ఞులు నుడువన్ 5


మువ్వురు మూర్తుల కొఱకును 

హవ్యము నీయంగ తగదు , యందొక వ్యక్తిన్ 

దివ్యునిగ నెన్నుకొనియును 

నివ్వగ హవ్యంబు , జన్న మిచ్చును ఫలమున్ 6


మువ్వురు మూర్తుల యందున 

నెవ్వడు యత్యంత ఘనుడొ యేర్పడ నెఱిగీ 

నవ్వాని పెద్ద జేసియు 

నవ్వానికె నీయవలయు హవ్యంబెపుడున్ ". 7

కామెంట్‌లు లేవు: