*దశిక రాము**
❄ శ్లోకం 12 ❄
**వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|**
**అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||**
105. వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.
106. వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.
107. సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,
108. సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;
109. సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు) ; ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;
అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు
110. సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-) శ్రీలక్ష్మీ సమేతుడు.
111. అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).
112. పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.
113. వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.
114. వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.
శ్లోకం 13
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||
115. రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
116. బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
117. బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
118. విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
119. శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
120. అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
121. శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
122. వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
123. మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.
శ్లో. వసు ర్వసుమనాః స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః !!12!!
-------------------(నామాలు 104 ... 113)
24. వాసముండు జీవ రాశులన్నిటి యందు
విరస, రాగములకు విముఖు డతడు
సత్యమైనవాడు, సముడె, సమ్మితుడెగా
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : వసుః ... సర్వ భూతములందునూ వసించువాడు, వసుమనాః ... రాగ ద్వేషములు లేని పరిశుద్ధాత్ముడు, సత్యః ... సత్యమైనవాడు, సమాత్మా ... సమతా భావము కలవాడు, సమ్మితః ... భక్త సులభుడు (ఆంగ్ల భాష్యం ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన వాడు).
భావము : సకల జీవ రాశులలో నివసించేవాడు, (కొన్ని భాష్యాల ప్రకారం అష్టవసువులలో ఒకరైన అగ్ని అని ఉంది. ఆ ప్రకారంగా చూసినా అన్ని జీవులలోనూ అంతో ఇంతో వేడిమి ఉంటుంది కదా), రాగ ద్వేషాలకు అతీతమైనవాడు, సత్యమైనవాడు, సమతా భావం కలవాడు( సౌమ్యుడు, ఉదారుడు అనే నానార్థాలు కూడా ఉన్నవి కదా), భక్త సులభుడై అందరికీ ఆమోదయోగ్యమైనవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
25. సముడు నతడె, జూడు సత్ఫలములొసగు
హృదయ పద్మ వాసి, యుదజ దళాక్షుడే
ధర్మ కర్త దానె, ధర్మమే యాకృతి
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : సమాః ... సర్వ సమానుడు (లక్ష్మీ పతి కూడా కావచ్చును), అమోఘః ... సరియైన ఫలితములనిచ్చువాడు, (ఆంగ్ల భాష్యం ప్రకారం ఉపయోగకారి), పుండరీకాక్షః ... పుండరీకము (ఉదజము) అంటే పద్మము కనుక పద్మము (రేకల)వంటి కనులు గలవాడు అని ఒక పాఠం, కాగా భక్తుల హృదయ పద్మములో నివసించువాడు అని ఇంకొక భాష్యం, వృష కర్మః ... ధర్మ బద్ధమైన కర్మలు చేయువాడు, వృషాకృతిః ... ధర్మమే ఆకారమైనవాడు( రామో విగ్రహవాన్ ధర్మః అనడంలో భావం అదే కదా...).
భావము : సకల భూతముల పట్ల సమానంగా వ్యవహరించువాడు,( స మా ... అంటే లక్ష్మితో ఉండువాడు అనే భాష్యమూ ఉన్నది), సరియైన ఫలితములనిచ్చ
ువాడు, భక్తుల హృదయ పద్మము లందు నివసించువాడు, (లేదా పద్మముల వంటి కనులు కలవాడు అనే భావమూ ఉన్నది), ధర్మమైన కార్యక్రములనే నిర్వర్తించే, ధర్మమే ఆకారముగా గలవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.
🙏ఓం నమో నారాయణాయ🙏
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి