30, సెప్టెంబర్ 2020, బుధవారం

*ధార్మికగీత - 35*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          

                                    *****

       *శ్లో:- ప్రియ వాక్య ప్రదానేన ౹*

               *సర్వే తుష్యన్తి జంతవ:౹*

               *తస్మా త్తదేవ వక్తవ్యం ౹*

               *వచనే కా దరిద్రతా? ౹౹*

                        *****

*భా:- మనిషికి భగవంతుడు ప్రసాదించిన అపురూప వరం మాట. మంచి మనసుతో ఆప్యాయంగా, ప్రియంగా మాట్లాడిన మాటలే ఆప్తులకు, ఆత్మీయులకు వరాల మూటలై మరింత సన్నిహితం చేస్తాయి. నెయ్యానికి, వియ్యానికి, సిరులు పండడానికి కారకము లవుతాయి. ఆ మాటలు పరుల ఉల్లాలను పల్లవింపజేస్తాయి. హృదిని, మదిని పరవశింపజేస్తాయి. ఆ మాటే ఒకింత కటువైతే, కయ్యానికి కాలుదువ్వుతూ, అందరినీ దూరం చేస్తుంది కూడ. కాన ప్రేమగా, మృదువుగా మాట్లాడాలి. భగవద్దత్తమైన మాటలకు దరిద్రం లేదు గదా! "కాకి"కి "చీ" కొట్టడానికి, "కేకి"కి జై కొట్టడానికి గాత్రమే మూలము. "మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు" అన్నాడు కరుణశ్రీ. "వాగ్భూషణం భూషణం"అన్నాడు భర్తృహరి. రామరావణులను, మెప్పించగలిగింది హనుమ వాగ్వైభవమే మన సంపూర్ణ వ్యక్తిత్వానికి కొలమానిని మన మాటే. శ్రీరాముని మిత, హిత, స్మిత, మృదు, పూర్వ భాషిత్వ పటిమ, గరిమ, మహిమ మన అందరికి అనుసరణీయము, ఆచరణీయము, ఆదర్శప్రాయము కాగలిగితే మన జన్మ ధన్యమే.నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సారాంశము.*

                                   *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: