30, సెప్టెంబర్ 2020, బుధవారం

*ఇంద్రుడు - వరాహ జన్మ*




ఒకప్పుడు ఇంద్రుడు కర్మవశాత్తు పందిగా జనించ వలసి వచ్చింది. ఆయన నారదమహర్షిని దర్శించి, మహాత్మా, నేను పందిగా ఉపాధిని పొందినప్పుడు మీరు వచ్చి ప్రబోధించితే నేనా ఉపాధిని వదలి మళ్ళా ఇంద్రత్వం స్వీకరిస్తానూ అని బ్రతిమాలాడు. నారదుడు నవ్వి సరే అన్నాక ఆయన సూకరోపాధిని పొందటమూ మాట ఇచ్చినట్లే నారదమహర్షి పోయి ప్రబోధించటమూ జరిగింది. అప్పుడేం జరిగిందో చూసారా. ఆ పందిరూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు కదా, ఈ జన్మం ఇంత హాయిగా ఉందే, దీనిని వదలిపెట్టమని చెబుతావేమి టయ్యా, ఠాట్ కుదరదంటే కుదరదూ అని. ఇదండీ జీవుణ్ణి పశువుని చేసి ఆడించే వాసనారూపకమైన పాశం అంటే. ఇటువంటి పాశం అమ్మకు ఆయుధంగా అమరి ఉంది.

{ఈ వివరణ లలితా సహస్రనామ వివరణ లోనిది}


మన పురాణాలలో ఇంద్రుడికి కలిగినన్ని శాపాలు మరెవరికీ కలగలేదు. ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో, ఒక ముని ఇంద్రుడు చేసిన పనివల్ల కోపించి, ‘నీవు మగ పందివై, భూమ్మీద ఒక సంవత్సరకాలం జీవింతువుగాక’ అని శపించాడు. ముని వాక్యం అమోఘం. వెంటనే ఇంద్రుడు భూమ్మీద ఒక మగ పందిగా పుట్టాడు. కొంతకాలానికి, ఆ పంది ఒక సుందరమైన ఆడ పంది ప్రేమలోపడి, మోహించి, వ్యామోహితుడై, ఆ సుందరాంగి లేకపోతే బ్రతుకే వృధాఅని, ఇక బ్రతుకలేనని అనుకోని, ఆ ఆడ పందిని సమీపించి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారి ప్రేమ సుఖాంతం అయింది. వారి పెళ్ళి అయింది. కొంతకాలం వారి ప్రణయ జీవితం హాయిగా జరిగింది. అప్పటికే సంసారమనే పాముతో కాటేయబడ్డ ఇంద్రుడికి (మగ పంది) విషం పైపైకి ఎక్కటం మొదలైంది. ఆ జంటకి అనేకంగా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను, తన భార్యను చూస్తూ, ఎంతో ఆనందిస్తూ, బురదగుంటల్లో పొర్లుతూ, దొర్లుతూ, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.


చూస్తుండగానే ఒక సంవత్సరకాలం తెలియకుండానే కరిగిపోయింది. ఇంద్రుడికి స్పృహేలేదు. ఆనందంగా, విలాసంగా వున్నాడు. ఇంతలో, అక్కడ ఇంద్రలోకంలో, దేవతలందరూ ఇంద్రుడి రాకకై ఎదురుచూస్తూ, స్వాగత ఏర్పాట్లు అన్నీ చేసుకొని సిద్ధంగావున్నారు. సమయానికి, ఇంద్రుడు రాలేదు. కారణం తెలియక, వారు అగ్నిదేవుడ్ని పిలిచి, భూమ్మీదకువెళ్ళి, ఏంజరిగిందో తెలుసుకొని రమ్మన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి, బురదగుంటలో భార్యా, పిల్లల సమేహితుడై ఇంద్రుడు ఆనందంగా వుండటం చూసాడు. అప్పుడు, అగ్నిదేవుడు, ఆర్యా, మీరు ఇందృడు, స్పృహలోకిరండి; మీ శాపం సమయం తీరిపోయింది. కాబట్టి, వెంటనే ఇంద్రలోకానికి విచ్చేయండి, అందరూ మీ రాకకై వేచిచూస్తున్నారు అని విన్నవించాడు. ఆ మాటలువిన్న ఇంద్రుడు, అగ్నిదేవా, నాకు ఇక్కడ చాలా బాగుంది, అంతేకాకుండా నేను నా భార్యని, ముద్దులొలికే నా పిల్లల్ని వదిలి ఇప్పుడు రాలేను. కాబట్టి నీవు వెళ్ళిపో. నేను కొంతకాలం తరువాత వస్తాను అని చెప్పాడు. అయినీ, అగ్నిదేవుడు చాలాసార్లు వచ్చేయమని బతిమాలాడు. ఇంద్రుడుకి కోపంవచ్చి, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళీపో అని అన్నాడు. చేసేదిలేక ఆయన వెళ్ళిపోయి, జరిగిందేమిటో దేవతలందరికీ చెప్పాడు. ఆతరువాత వరుణుడుకూడా వెళ్ళి ప్రయత్నంచేసి, విఫలుడై తిరిగి వచ్చాడు. ఏంచేయాలో వారికి తెలియలేదు. ఇంద్రలోకంలో ఇంద్రుడులేక పరిపాలనంతా ఆగిపోయింది. అప్పుడు మరొక దిక్పాలకుడు యముడుని పిలిచి నీవు వెళ్ళి ప్రయత్నంచేసి రమ్మన్నాడు. నేను వెళ్ళినా అదే జరుగుతుందికదా ఏమిటి ప్రయోజనం? అని అన్నాడు. అప్పుడు ఆ దిక్పాలకుడు, యమా, ఒకవేళ ఇంద్రుడు నీమాట విని రాకపోతే, వరాహరూపంలోవున్న ఆయన్ని చంపివేయి. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది, వెళ్ళిరా అని పంపించాడు.


యమధర్మరాజు వెళ్ళి ఇంద్రుడిని స్వర్గలోకాని రమ్మని బతిమాలాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరందరూ, ఒకరితరువాత మరొకరువచ్చి, నన్ను విసిగిస్తున్నారు. ఇక్కడ నేను నా భార్యా,పిల్లలతో నేను చాలా సుఖంగావున్నాను. మీరు నన్ను ఇన్నిసార్లు విసిగించారుకనుక, నా నిర్ణయం చెబుతున్నాను విను: నేను స్వర్గలోకానికి ఇక ఎప్పటికీ రాను. నాకు ఇక్కడే స్వర్గలోకంల్లాగావుంది. ఇక వెళ్ళిపో అని హూంకరించాడు. సరేనని చెప్పి, యముడు కొంచెం దూరం వెళ్ళి, వెనుకగా వచ్చి, ఆ మగపందిని తన కత్తితో చంపేసాడు. పంది శరీరం పడిపోయిందికాబట్టి, చేసేదేమీలేక, ఇంద్రుడు ఆ పంది శరీరాన్ని వదిలివేయాల్సివచ్చింది. అప్పటివరకూ ఆ వరాహ శరీరంతోవున్న బంధనం తెగిపోయింది. వాస్తవాన్ని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

కామెంట్‌లు లేవు: