30, సెప్టెంబర్ 2020, బుధవారం

*కర్మ సిద్ధాంతం (doctrine of karma )*



*ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలిపోయిన కర్మఫలం విధిగా జీవుడిని మరొక జన్మ(పునర్జన్మ)ఎత్తేటట్లు చేస్తుంది.*


*మనిషి నిరంతరం అంతులేని కోరికల వలయంలో చిక్కుకొని తిరుగుతుంటాడు. ఆ కోరికలే దుఃఖానికి కారణం. కోరికలు తీరడానికి తగ్గ పనిని మనిషి చేస్తూనే ఉండాలి.*


*మరి మనిషి చేసిన పని వృథా పోదు కదా! ప్రతి పనికి మంచిదో చెడుదో ఫలితం ఉంటుంది.ఆ పలితాన్ని మానవుడు అనుభవించక తప్పదు.*


*కొన్ని కర్మల ఫలితాలను అప్పటికప్పుడు అనుభవిస్తాడు. కొన్నింటిని ఆ తర్వాత అనుభవిస్తాడు. కొన్ని కర్మల పలితాలను ఈ జన్మలో అనుభవించలేక పోవచ్చు.*


*మనిషి మరణించినా కర్మఫలం నశించదు. అది ఆత్మను వాసనా రూపంలో అంటిపెట్టుకొని కొనసాగుతూనే ఉంటుంది.*


*కర్మఫల శేషం పునర్ఙన్మకు దారి తీస్తుంది.*


*ఈ జన్మలో అనుభవానికి రాకుండా మిగిలి పోయిన కర్మఫలం విధిగా జీవుడిని మరొక జన్మ ఎత్తేటట్లు చేస్తుంది.*


*మళ్లీ జీవుడు ఆ జన్మలో కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలలో కొన్ని మిగిలిపోతాయి. మళ్లీ జన్మ ఎత్తుతాడు. కొన్ని కర్మఫలాలు అనుభవించాక కొన్ని మిగిలిపోతాయి.*


*వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. పాత కర్మల అనుభవాలు తరిగిపోతుంటే కొత్తవి పెరిగిపోతుంటాయి.*


*మానవుడు జనన మరణ పరంపర చక్రభ్రమణంలో, చక్రనేమి క్రమంలో పడి తిరుగాడుతుంటాడు.*


*పునర్జన్మ ఒక నిరంతర చక్రం. దానికి ఆది లేదు. అంతం లేదు. అందుకే మానవుడు జనన మరణ పరంపర అనే చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు.*


*అదే కర్మసిద్ధాంతం. (Law of Karma). దీనినే ఫిజిక్స్ లో (Law of Conservation Energy)తో పోల్చారు విజ్ఞులు.*


*ఎనర్జీకి నశింపులేదు. రూపాంతరం చెందుతుంది. అలాగే కర్మ కూడా. అది మానవుని జన్మాంతరాలకు కూడా వెన్నాడుతూనే ఉంటుంది.*


*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరే శయనం*

*ఇహ సంసారే బహుదుస్తారే*

*కృపయా పారే పాహి మురారే*


*– — భజగోవిందం — శంకరులు.*


*భావం :*


*పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ ! దయతో నన్ను రక్షించు (తరింపచెయ్యి).*


*శంకరులు కూడా జగత్తును (మానవ జీవితాన్ని) దుఃఖమయంగా భావించారు.*


*భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి?*


*ఆత్మానాత్మ వివేకం” అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు .*


*ప్రశ్న : ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?*


*జ)పూర్వ జన్మ లలోని కర్మ వలన.*


*ప్రశ్న : కర్మ ఎందుకు జరుగుతుంది?*


*జ)రాగం (కోరిక) వలన.*


*ప్రశ్న: రాగాదులు ఎందుకు కలుగుతాయి?*


*జ : అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.*


*ప్రశ్న : అభిమానం ఎందుకు కలుగుతుంది?*


*జ) అవివేకం వలన*


*ప్రశ్న : అవివేకం ఎందుకు కలుగుతుంది?*


*జ)అజ్ఞానం వలన*


*ప్రశ్న : అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?*


*జ) అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.*



*అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి*

కామెంట్‌లు లేవు: