30, సెప్టెంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

అక్కాచెల్లెళ్ళు.. అన్నదానం..


కరివేటి విజయమ్మ గారు చెన్నై లో కాపురం వుంటున్నారు..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తులు..విజయమ్మ గారు ప్రతి సంవత్సరము రెండు సార్లు చెన్నై నుంచి మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతుంటారు..విజయమ్మ గారికి ఇద్దరు కుమార్తెలు..శైలజ, నీరజ..పెద్దమ్మాయికి పదిహేడేళ్ల వయసు వచ్చిన తరువాత అంతుపట్టని వ్యాధి సోకింది..చెన్నై లో ఎంతో మంది డాక్టర్లకు చూపించారు..ప్రయోజనం కనబడలేదు..శారీరికంగా ఎటువంటి బాధా లేదు..కానీ అమ్మాయి ప్రవర్తన పిచ్చి వాళ్ళలాగా ఉంటున్నది..విజయమ్మ గారికి పెను దిగులు పట్టుకుంది..అప్పటికి చిన్నమ్మాయి వయసు పదిహేనేళ్లు..


పిల్లలిద్దరినీ తీసుకొని విజయమ్మ గారు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఐదు రోజల పాటు అక్కడే వున్నారు..మందిరం లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే..పెద్దమ్మాయి ప్రవర్తన లో మార్పు వచ్చింది..పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే ఆ అమ్మాయి బుద్ధిగా వుండసాగింది..దుష్టగ్రహ లక్షణం అని అర్ధం చేసుకుని..అమ్మాయి మామూలు మనిషిగా మారితే శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేయిస్తానని మొక్కుకున్నారు విజయమ్మ గారు..


కానీ..అనుకున్నంత త్వరగా ఆ అమ్మాయి బాధ తగ్గలేదు..ఐదునెలల పాటు..ప్రతినెలా ఐదు రోజుల లెక్కన ఆ అమ్మాయితో శ్రీ స్వామివారి మందిరం వద్ద ప్రదక్షిణాలు చేయించారు..అప్పటికి పూర్తిగా నయమయ్యింది.. విజయమ్మ గారికి శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తి మరింతగా పెరిగింది..తన కూతురిని శ్రీ స్వామివారే రక్షించారని పదే పదే చెప్పుకొనేది..అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం రెండుసార్లు..అందులో గురుపౌర్ణమి నాడు మాత్రం ఖచ్చితంగా శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్లడం నియమంగా పెట్టుకున్నారు..అలాగే..అన్నదానానికి విరాళం ఇవ్వడమూ మరో నియమం..అలా అన్నదానం చేయబట్టే, తన కూతురు త్వరగా కొలుకున్నది అని విజయమ్మ గారి ప్రగాఢ విశ్వాసం..


మరో మూడేళ్లకు ఆ అమ్మాయికి వివాహం కూడా చేశారు..చిన్నమ్మాయి కూడా శ్రీ స్వామివారి మీద భక్తిని పెంచుకున్నది..నిన్న గురుపౌర్ణమి రోజు..విజయమ్మ గారు, తన చిన్న కూతురితో కలిసి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


"మా పెద్దమ్మాయి ఈరోజు హాయిగా కాపురం చేసుకుంటున్నదంటే..కారణం శ్రీ స్వామివారి కృపే నండీ..మేము చేయదల్చుకున్న అన్నదానం లో మా పెద్దమ్మాయి కూడా కొంత మొత్తాన్ని ఇస్తుందండీ.. పెద్దమ్మాయి పరిస్థితి చూసిన తరువాత..ఈ చిన్నమ్మాయి కూడా శ్రీ స్వామివారి నే కొలుస్తున్నది..అమెరికా లో చదువుకునే అవకాశం వచ్చింది..వీసా గురించి కొద్దిగా ఇబ్బంది పడ్డాము..తాను శ్రీ స్వామివారికి మొక్కుకున్నది.. మొన్ననే వీసా మంజూరు అయింది..ఆ సంతోషంలో..వచ్చే ఆదివారం నాటి అన్నదానానికి విరాళం ఇవ్వాలని పట్టుబట్టి..నన్ను తీసుకొని వచ్చింది..శ్రీ స్వామివారిని నమ్మి కొలిస్తే..కష్టాలు దూరం అవుతాయండీ..కాకుంటే మన ప్రారబ్ధం తాలూకు బాధ కొద్దిగా అయినా అనుభవించక తప్పదు..కష్టాన్ని అత్యంత వేదనతో అనుభవించకుండా..తేలికగా తీసుకునేటట్లు చేస్తారు శ్రీ స్వామివారు..అందరు అవధూతల మార్గమూ ఇదేనండీ..మనం నమ్మిన సద్గురువు పాదాలను విడవకుండా పట్టుకుంటే..ఆయనే అన్నీ చూసుకుంటారు..మేము ఈ స్వామివారిని త్రికరణ శుద్ధిగా నమ్మాము..మా కష్ట సుఖాలను శ్రీ స్వామివారే భరిస్తారు.." అన్నారు విజయమ్మ గారు..


"నేను అమెరికా లో వున్నా కూడా ప్రతి సంవత్సరం మా పేరుతో రెండు సార్లు అన్నదానం చేయండి..అలాగే మీరు మరేదైనా కార్యక్రమం రూపకల్పన చేసి..తెలిపితే..మాకు చేతనైనంత విరాళం ఇస్తాము..ముఖ్యంగా దత్తదీక్ష స్వీకరించే స్వాములకు మీరు 41 రోజులపాటు ఉచితంగా రెండుపూటలా ఆహారం అందిస్తున్నారు కదా..కనీసం ఒకరోజుకు అయ్యే మొత్తం ఖర్చు మేము భరిస్తాము..మాకు అవకాశం ఇవ్వండి.." అని చెప్పింది విజయమ్మ గారి చిన్నకూతురు..


ఈ సంవత్సరం మార్చినెల 29వ తేదీ నుండీ దత్తదీక్షా కార్యక్రమం మొదలవుతుందనీ..మే నెల 10 వ తేదీ వరకూ కొనసాగుతుందని తెలిపాను..తల్లీకూతుళ్ళు చర్చించుకుని..ఒక తేదీ నిర్ణయించి..ఆరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును తాము భరిస్తామని చెప్పి..నగదు కూడా నా చేతికి ఇచ్చి..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని తిరిగి చెన్నై వెళ్లారు..


మనలో ఉన్న భక్తీ విశ్వాసాలే మనలను దైవానికి దగ్గరగా చేరుస్తాయి..విజయమ్మ గారి విషయం లోనూ ఇదే జరిగింది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: