30, సెప్టెంబర్ 2020, బుధవారం

పోత‌న త‌ల‌పులో....68

 


గ‌ర్భ‌స్థ శిశువైన ప‌రీక్షిత్తును క‌రుణాంత‌రంగుడైన కృష్ణ‌ప‌ర‌మాత్మ ర‌క్షించాడు. ఆ భువ‌న‌మోహ‌న రూపుడిని ప‌రీక్ష‌గా చూసే లోపే క‌నిపించ‌కుండా పోయాడు.

                 ***

"గదఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ

ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ

సదయుం డెవ్వఁడొకో?" యటంచు మదిలోఁ జర్చించుచున్ శాబకుం

డెదురై చూడ నదృశ్యుఁ డయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా!

                ***

అరే ఎవరీ కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ, భయంకరంగా పైనబడి బాధిస్తున్న బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి, నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ తర్కించుకొంటూ గర్భస్థశిశువు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు.

               **

"ప్రకటిత దైవయోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా

వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా

బకుఁ బ్రతికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం

తకుఁ డగు; విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై"

        ***

"మహారాజా! ప్రఖ్యాతమైన దైవనియోగం వల్ల భారతవంశం అంతరించి పోకుండా ప్రభవిష్ణువైన శ్రీమహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు, పగవారిపాలిటి లయకాలుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతు డనే నామంతో విఖ్యాతుడై, జగన్మాన్యుడౌతాడు."


ఈ బాలుడు జగన్మాన్యు డౌతాడు అనుచున్న విప్రోత్తములను ధర్మరాజు ఇలా అడిగాడు...

                           ***

ఓ పుణ్యాత్మకులార! నాపలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్

మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై,

యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా యెల్లప్పుడున్? మాధవ

శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే."

                       ***

"ఓ మహాత్ములారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై, కారుణ్యమూర్తులై, రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాతముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగనే ఎల్లప్పుడూ శ్రీ వల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు గదా దయచేసి కొంచెము సెలవీయండి."

              ***

సమదర్శనంబున జలజాతభవుఁడనఁ-

  బరమప్రసన్నత భర్గుఁ డనగ

నెల్లగుణంబుల నిందిరావిభుఁడన-

  నధికధర్మమున యయాతి యనఁగ

ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁడన-

  నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ

రాజితోదారత రంతిదేవుండన-

  నాశ్రితమహిమ హేమాద్రి యనఁగ

                  ***


యశము నార్జించుఁ, బెద్దల నాదరించు,

నశ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల

ఘనులఁ బుట్టించు, దండించు ఖలులఁ బట్టి,

మానధనుడు నీ మనుమఁడు మానవేంద్ర!

                   ***

ఇతడు సమదృష్టిలో జలజభవుడు-ప్ర‌స‌న్న‌త‌లో పరమశివుడు. రమణీయ గుణసంపదలో రమాధవుడు-అనిపించుకొంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తిలో ప్రహ్లాదుడుగా, దాతృత్వగరిమలో రంతిదేవుడుగా, ఆశ్రయమహిమలో హిమగిరిగా ఖ్యాతి గాంచుతాడు. కీర్తిపై అనురక్తీ, పెద్దలపై భక్తీ, కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తనయులకు తండ్రియై వంశాన్ని పండిస్తాడు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడు మానధనుల‌లో మాననీయు డౌతాడు.

                 ***

హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్,

భరించున్ ధరన్ రామభద్రుండుఁ బోలెన్,

జరించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్,

వరించున్ విశేషించి వైకుంఠుభక్తిన్.

                 ***

ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️విష్ణు ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: