30, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్. 107

 

..

భరతా తండ్రి ఋణగ్రస్తుడైనప్పుడు ఆయన ఋణము తీర్చవలసిన బాధ్యత పుత్రులుగా మనపైన ఉన్నదికదా ! 

.

"పుత్" అనే నరకం నుండి తండ్రిని తప్పిస్తాడు కావున పుత్రుడు అని పిలుస్తారు.

.

మన తండ్రి నీ తల్లిని వివాహము చేసుకొనే సందర్భములో ఆవిడ కుమారునకు మాత్రమే రాజ్యమిస్తానని నీ తాతగారికి వాగ్దానము చేసియున్నాడు.

.

దేవాసుర సంగ్రామము జరిగే సమయములో నీతల్లి చేసిన సేవకు మెచ్చి వరము కూడా ఇచ్చి ఉన్నాడాయన.

.

దాని ప్రకారము నీకు రాజ్యము నాకు అరణ్యవాసము మన తండ్రిగారు నిర్ణయించినారు.

.

 తండ్రి వాక్కునందు స్థిరముగా నిలచి నేను అరణ్యవాసము సీతా లక్ష్మణ సమేతముగా చేయ నిశ్చయించుకొన్నాను.

.

నీవు కూడా పట్టాభిషిక్తుడవై తండ్రిగారి సత్యవాదిత్వమును నిలబెట్టుము. ఆయనను ఋణవిముక్తుని చేయుము.

.

భరతా నీవు నరులకు రాజువగుము ,నేను వనములోని మృగములకు రాజు నయ్యెదను .శీఘ్రమే తిరిగి వెళ్ళి పట్టాభిషిక్తుడవు కమ్ము!.

.

రాముడు భరతునితో ఇలా మాట్లాడుతుండగా

.

 బ్రాహ్మణోత్తముడైన జాబాలి మధ్యలో కల్పించుకొని.

.

రామా! చాలాబాగున్నదయ్యా నీవు చెప్పేది ! ఎంత నిష్ప్రయోజనమైన ఆలోచన నీది.

.

ఎవడైనా గానీ ప్రాణి ఒంటరిగానే పుడుతున్నాడు ఒంటరిగానే గిడుతున్నాడు !

 ఎవడు ఎవడికి బంధువు?

ఎవడినుంచి ఎవడు ఏమి పొందుతున్నాడు?

.

నా తల్లి ,నా తండ్రి అని అంటూ ఇంత ఉన్మత్తమైన ప్రేమ ఎందుకు? ఎవ్వడూ ఎవడికి ఏమీ కాడు!

.

ప్రయాణం చేసే టప్పుడు ఒక ఊరిలో రాత్రిపూట బస చేసినట్లు ఎక్కడ నుండి వచ్చాడో తెలియని మనిషికి తల్లి తండ్రి బంధువులు వీరుండే చోటుకూడా అలాంటిదే !

.

ఎందుకయ్యా హాయిగా రాజ్యాన్ని ఏలుతూ సుఖంగా ఉండకుండా తండ్రిమాట అంటూ అత్యంత కష్టమైన అరణ్యవాసాన్ని కౌగలించుకొంటావు! 

.

ఏడి ? దశరధుడు ఇప్పుడున్నాడా ! 

అతడిప్పుడు నీకేమీ కాడు,

 నీవతనికి ఏమీ కావు! 

.

అసలు తండ్రి ఎవరు?

 అతను బీజము మాత్రమే !.

తల్లి ఋతుమతి అయినప్పుడు శుక్లము,శోణితము కలువగా పురుషుడు జన్మిస్తున్నాడు .అంతే!

.

నిన్ను చూస్తే జాలికలుగుతున్నది ధర్మము ,ధర్మము అంటూ పట్టుకొని పాకులాడుతున్నావు!

.

చచ్చినవారికోసము ఏవేవో తద్దినాలు పెడుతున్నారు. ఎంత అన్నము వృధా అవుతున్నదో వాటివల్ల! 

నీవు ఇక్కడ పెట్టే అన్నము అక్కడ అది నీ తండ్రిని చేరుతున్నదా! 

.

దానాలివ్వమనీ,యజ్ఞాలు చెయ్యమనీ పనికిరాని మాటలు కొందరు మేధావులు చెపుతున్నారు.

.

రామా నాకు తెలిసి ఇక్కడ మనమున్న లోకమొక్కటే లోకము. పరలోకము లేదు పాడులేదు. 

దానిని నీవు లెక్కపెట్టవలసిన పనిలేదు.

ఆనందంగా రాజ్యమేలుకో ! ధర్మము అంటూ పట్టుకొని వేళ్ళాడకు.

.

జాబాలి మాటలు అధికమైన భక్తితో శ్రద్ధతో విని చలించని బుద్ధితో ఇలా అన్నాడు రాముడు.

.

నీవు నా సంతోషాన్ని కోరి ఇప్పటివరకు పలికిన పలుకులు పైకి బాగానే కనబడతాయి కాని అవి చేయకూడనివి ,హితముకానటువంటివి అయినవి.

.

కట్టుబాట్లు గాలికి వదిలివేసి మంచినడవడి ,మంచి చూపు లేని మానవుడు సమాజంలో గౌరవము పొందజాలడు.

.

మనిషి నడవడికను బట్టే వాడు కులీనుడోకాడో,వీరుడోకాడో,పరిశుద్ధుడో కాడో చెప్పవచ్చును.

.

నేను పైకి మంచివాడిలా కనపడుతూ లోపల దుష్టత్వము నింపుకొని యుండవలెనా? నిజాయతీ అవసరములేదా ?

.

లోపల ఎన్నో దౌర్భాగ్యపు ఆలోచనలు పెట్టుకొని బయటకు గొప్ప శీలవంతుడిలా కనపడమంటావా?

.

గోముఖవ్యాఘ్రమని,పయోముఖవిషకుంభమనీ ,

తేనెపూసినకత్తి అని లోకులు నన్ను ఆడిపోసుకోరా?

.

ప్రతిజ్ఞను మరచి ప్రవర్తిస్తే ఇంక నేను ఎవరికి మంచి మార్గము ఉపదేశించగలను? స్వర్గమునకు చేరుకోగలనా?

.

ధర్మ వర్తనము లేక రాజు స్వేచ్ఛావర్తనుడైతే ప్రజలు కూడా అదేవిధముగా ప్రవర్తించరా!

.

ఈ రాజ ధర్మము అతిపురాతనమైనది ! సత్యస్వరూపమైనది,

దీనిలో క్రూరత్వమునకు తావులేదు .

రాజుకు సత్యమే ప్రధానము.

జాబాలీ ! సత్యము మీదనే లోకము ప్రతిష్ఠితమై ఉన్నది

.

సత్యే లోకః ప్రతిష్ఠితః!

.

ఈ లోకములో సత్యమే ఈశ్వరుడు

లక్ష్మి సత్యమునే ఆశ్రయించి ఉంటుంది.

సత్యాన్నిమించిన ఉత్తమధర్మము లేదు.

.

సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్!

.

నేను సత్యప్రతిజ్ఞకలవాడను .తండ్రి ఎదుట సత్యముపై శపధము చేసిన నేను ఆయన ఆజ్ఞను పాలించకుండా ఉండలేను.

.

నా సత్యప్రతిజ్ఞను లోభమువలన కానీ,చిత్తభ్రమవలనకానీ ,తమోగుణమువలన కలిగిన అజ్ఞానము వలన కానీ భేదించను.

.

స్థిరచిత్తుడైన రాముడు ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నాడు.

.

NB

.(మనలో కలిగిన భావమేదో దానికి అనుగుణముగా రాగముండవలే తదనుగుణముగా తాళముండవలె! 

భా.ర.త..వాడే ఈ సంస్కృతి ని కాపాడే భా.ర.తీ యుడు).

.

.ప్రస్తుత ప్రపంచంలో "జాబాలి" సంతతి ఎక్కువ అయినట్లుంది కదూ!


రామాయణమ్. 108/109

..

రాముడు గంభీరంగా చెపుతున్నాడు.గొంతులో ఒక స్థిరత్వం మాటలో పటుత్వం కలగలసి వస్తున్నాయి. ఆయన వాక్కులు దృఢంగా ఉన్నాయి..

.

నీచులు ,క్రూరులు,పాపాత్ములు,దురాశాపరులు,సేవించేటటువంటిది అధర్మముతో నిండినదీ అయిన క్షత్రియధర్మమును నేను పరిత్యజించెదను.

.

మనిషి చేసే పాపము, ముందు అతని మనసులో పుడుతుంది, ఆతరువాత శరీరము ఆ పాపకర్మ చేస్తుంది .

.

 నాలుక అబద్ధమాడుతుంది . ఈ విధముగా పాపము మూడు విధాలుగా ఉంటుంది. ..

ఒకటి .మానసికము,,

రెండు..శారీరికము.,, మూడు ..వాచికము.

.

జాబాలీ ! నీవు శ్రేష్ఠము అని నాకు చెప్పినదంతా కూడా చెడ్డదే!

.

నా తండ్రిగారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ కాదని ఇప్పుడు భరతుడి మాటలను ఏల పాటించగలను?

.

నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ స్థిరమైనది! అప్పుడు కైకేయీ దేవి కూడ సంతసించినది.

.

నేను పరిశుద్ధుడనై ,మితభోజనము చేయుచు ,పవిత్రములైన కందమూలఫలములతో ,పితృదేవతలను తృప్తి చెందించుతూ ,సంతుష్టి చెందిన పంచేద్రియములు కలవాడనై ,కపటము విడనాడి(Without Hypocrisy)

శ్రద్ధావంతుడనై కార్యాకార్యములు తెలుసుకుంటూ వనవాసజీవితము గడిపెదను.

.

దేవతలందరును ధర్మసమ్మతమైన శుభకార్యములు చేయుటవల్లనే ఆయా పదవులు పొందగలిగారు.

.

నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వముగా ఖండించాడు రాముడు .

.

అసలు నీలాటి వారిని చేరదీసిన నా తండ్రిని నిందించవలె నిన్నుకాదు .

సత్యము ,ధర్మము,పరాక్రమము,భూతదయ,ప్రియవాక్కు,

దేవబ్రాహ్మణ ,అతిధులపూజ ..ఇవి స్వర్గానికి మార్గములని సత్పురుషులు చెపుతున్నారు.

.

రాముడి ఆగ్రహన్ని చూసిన జాబాలి ,రామా! నేను నాస్తికుడను కాను నిన్ను అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యము తప్ప వేరే ఏదియును లేదు. 

.

రాముడికి కోపము వచ్చినదని గ్రహించిన వశిష్ఠులవారు ఆయనకు ఇక్ష్వాకుల చరిత్ర అంతా తెలిపి ,ఇక్ష్వాకులలో జ్యేష్ఠుడే రాజు ! అదే ధర్మము అని తెలిపి శాంతింపచేశారు.అతి ప్రాచీనమైన మీ కుల ధర్మాన్ని నీవు చెరచవద్దు అని హితబోధ చేశారు.

.

రామా నేను నీకు, నీ తండ్రికి ఆచార్యుడను ,నేను చెప్పిన విధముగా చేసినచో నీవు ధర్మమార్గమును అతిక్రమించినవాడివి కాజాలవు.

కామెంట్‌లు లేవు: