30, సెప్టెంబర్ 2020, బుధవారం

చదివేప్పుడు ఒక జాగ్రత్త

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 13 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu  


లలితాసహస్రనామస్తోత్రము చదివేప్పుడు ఒక జాగ్రత్త అవసరము ఉంటుంది. కొన్ని పదహారు అక్షరముల నామములు, కొన్ని ఎనిమిది అక్షరముల నామములు ఉంటాయి. వాటిని ఎక్కడా మధ్యలో ఆపడము, విరవడము చెయ్యకూడదు. నామము యొక్క అక్షరసంఖ్య ఎంతో తెలుసుకు చదవాలి.  

ఈ నామము ఎక్కడా ఆపకూడదు. ఈ బ్రహ్మాండములన్నిటినీ అమ్మవారి ఎరుపుకాంతిలో మునిగిపోయాయి. ఉద్యుద్భానుసహస్రాభా అన్నప్పుడు ఎరుపుకాంతి చెప్పలేదు కానీ ఉదయిస్తున్న సూర్యకాంతి ఎరుపని తెలుసు కాబట్టి అర్థమయింది. ఈ ఎరుపు మళ్ళీ ఎందుకు చెపుతున్నారు? మనిషి జీవయాత్రలో మలుపు తిరిగే స్థితి ఇక్కడే ఉన్నది. ఒక గమ్యమును చేరుకునేప్పుడు మలుపు ఒకటి తిరగవలసి ఉంటుంది. ఆ మలుపు తిరగడమన్నది ఎరుపు కాంతిలో ఉంటుంది. దానిని పట్టుకున్న మహాపురుషులు అత్యద్భుతమైన స్థితిలో ఆ కాంతిని దర్శించి వారు అనుభవించిన దానిని ఈ లోకమునకు అందించారు. 

ఒకవ్యక్తిలో ఉన్నప్రేమ అభివ్యక్తమైనప్పుడు దయగా మారిందన్న విషయము ఆలోచిస్తే మలుపు తిరిగినట్టు. ఎవరి మీద రాగ ద్వేషములు ఉండవు. ఆ స్థాయికి చేరడము కొంత కష్టము. అమ్మవారి ప్రేమ సమస్త బ్రహ్మాండము అంతా పంచుతుంది. ప్రార్థనా శ్లోకములో ‘అరుణాంకరుణాంతరంగితాక్షీం’ అని చెప్పినట్టు ఆ తల్లి ఎరుపు, అమ్మ అంటే దయలోపల ఉన్న ప్రేమపైకి వ్యక్తమైతే దయాగుణము. అందులో లోకములు మునిగిపోతున్నాయి. ఆవిడ ‘ఆబ్రహ్మకీటకజనని’ అందరికీ తన ప్రేమను పంచిపెడుతుంది.  

సృష్టి చేసే బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు. సృష్టి అనేది రజోగుణము అది ఎరుపుతో కూడుకుని ఉంటుంది. ఈ ఎరుపు సంసారములోకి వెళ్ళి రాగముగా నిలబడితే అది పతనావస్థకు దారి తీస్తుంది. అమ్మా! అని అమ్మవారి వైపు తిరిగి భక్తితో నిలబడినట్లయితే మోక్షము వైపు వెళతారు. ఎరుపు చిక్కబడటము తెలుపును చేరుకోవడానికి పనికి వస్తుంది. ఈశ్వరుని చేరుకోవడానికి మార్గము అవుతుందని చెప్పడము కోసము ఆ తల్లి బ్రహ్మాండములన్నిటినీ తన ఎరుపుకాంతిలో ముంచుతున్నది.

సుఖము, దుఃఖమని రెండుమాటలు ఉంటాయి. సాధారణముగా మనిషి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ అన్న ఐదింటితో సుఖము అనుభవించడము జరుగుతుంది. ఈ ఐదు తన్మాత్రలు తీసేసి ఐదుజ్ఞానేంద్రియములను మాత్రము ఉంచితే బయట ఎన్ని అందములు ఉన్నా ఏమీ తెలియదు ఏమీ సంబంధము ఉండదు. బ్రతుకు కష్టమయిపోతుంది. లోకములో సుఖమన్నమాట ఉండదు. అమ్మవారు పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంది. బ్రహ్మాండములో అందములు పెట్టి పిండాండము అనుభవించకుండా చేస్తే అమ్మతనమునకు సంతోషము ఉండదు. ఆ అమ్మతనమునకు ఉన్న ప్రేమ రాగరంజితము. ఈ తన్మాత్రలతో పిండాండ, బ్రహ్మాండములను అనుసంధానము చేస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి ఆశ్చర్యకరముగా నడిపిస్తున్న ఎరుపుయొక్క శక్తి అని గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. అమ్మ ఎరుపు అర్థమై సమన్వయము చేసుకోవడము క్రియాశక్తి పూర్తవడము. అమ్మవైపు తిరిగితే ముందు ఎరుపు, నాలుగుచేతులు, నాలుగు ఆయుధములు, మళ్ళీ వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తలలోనే అమ్మవారి కళ్ళు, ముక్కు, నోరు, గెడ్డము, బుగ్గలు, చెవులు, జుట్టు అన్నీ ఉన్నాయి. మంత్రసంబంధముగా చూస్తే అది ఒక మంత్రకూటము. ఈ ఎరుపును అనుభవించి అనుసంధానము చేసుకొని వారు ఎన్నటికీ తలను చూడలేరు. అమ్మవారి కబరీబంధము దర్శనము కాదు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: